Monday, 17 Feb, 11.17 am ఆంధ్రజ్యోతి

జాతీయం-అంతర్జాతీయం
సమూహం నుంచి ఒక్కడిగా..!

మూడేళ్ల పాలనలో ఎడప్పాడి మార్కు

అన్నాడీఎంకే సంబరాలు

నేతల శుభాకాంక్షలు

ఎడప్పాడి పళనిస్వామి.. 'అమ్మ' జయలలిత అస్తమయం వరకు తెరచాటు నేత. అన్నాడీఎంకే మహా సమూహంలో ఒకరు. కానీ, ఇప్పుడు అన్నాడీఎంకేను సమర్థవంతంగా నడిపిస్తున్న నాయకుడు. ఆరు నెలలైనా సీఎం పీఠంపై నిలబడగలడా అన్న సందేహా లను పటాపంచలు చేసి మూడేళ్ల పాలనను విజయ వంతంగా పూర్తి చేసిన ఘనుడు. అంతేకాదు, ఎడప్పాడి మార్కుతో పార్టీలో పట్టు సాధించారు. సమూహం నుంచి ఒక్కడిగా ఎదిగి.. తమిళనాడు ముఖ్యమంత్రి పీఠంపై తనదైన ముద్రవేస్తున్నారు. దీనిని విజయోత్సవంగా అన్నాడీఎంకే జరుపుకుంటోంది. నేతలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. సీఎంగా నాల్గవ యేట అడుగుపెట్టిన ఎడప్పాడి పళనిస్వామి గురించిన ఎడప్పాడి పళనిస్వామి ఆదివారం ముఖ్యమంత్రిగా నాలుగవ ఏట అడుగుపెట్టారు. ఈ సందర్భంగా అన్నాడీఎంకే సంబరాలు జరుపుకోగా, ఇతర పార్టీల నేతలు, ప్రముఖులు, ఐఏఎస్‌ అధికారులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. సీఎం కార్యాలయానికి పంపించే ఫైళ్లను 48 గంటల్లోనే పరిశీలించి తగిన సమాధానంతో ఆయా శాఖలకు మళ్లిస్తూ ఫైళ్ల పెండింగ్‌ అన్న సమస్యే లేదని సచివాలయ ఉన్నతాధికారులు ప్రశంసిస్తున్నారు.

మూడేళ్ల క్రితం....

మూడేళ్ల క్రితం ఫిబ్రవరి 16వ తేదీన గిండీలోని రాజ్‌భవన్‌లో రాష్ట్ర 13వ ముఖ్యమంత్రిగా ఎడప్పాడి పళనిస్వామి బాధ్యతలను స్వీకరించారు. సొంత పార్టీలోనే ముఠా రాజకీయాలు, మరోవైపు అన్నాడీ ఎంకే ఎమ్మెల్యేలను మెప్పించడంతో పాటు, ప్రజలకు అవసరమైన పథకాలను రూపొందించడంలో విశ్రాంతి లేకుండా శ్రమించారని పేరు తెచ్చుకు న్నారు. ముఖ్యంగా, అసెంబ్లీలో ప్రతిపక్షాలు తీసు కొచ్చిన అవిశ్వాస తీర్మానం నుంచి ప్రభుత్వాన్ని గట్టెక్కించడంలో విజయం సాధించారు. మాజీ ముఖ్యమంత్రి జయలలిత 2016 డిసెంబరు 5వ తేదీన అనారోగ్యంతో మరణించడంతో అధికార పార్టీ అధికారంలో ఉంటుందా, దిగిపోతుందా అన్న అనుమానాలు తలెత్తాయి. జయ మరణం అనంతరం ఆమె స్నేహితురాలు వీకే శశికళ మద్దతుతో సీఎం బాధ్యతలు చేపట్టిన ఒ.పన్నీర్‌ సెల్వం కొంతకాలం మాత్రమే ఆ పదవిలో కొనసా గారు. శశికళతో ఏర్పడిన విభేధాల కారణంగా ఆయ న తన సీఎం పదవికి రాజీనామా చేశారు. ఈ నేప థ్యంలో డీఎంకే, కాంగ్రెస్‌ తదితర విపక్షాలు పళని స్వామి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని తీసు కొచ్చాయి. దీంతో, ప్రత్యక్ష ఓటింగ్‌ను సభాపతి పి.ధనపాల్‌ నిర్వహించగా ఒ.పన్నీర్‌సెల్వం సహా 11 మంది ఎమ్మెల్యేలు అవిశ్వాస తీర్మానానికి మద్దతు గా వ్యవహరించారు. దీంతో ప్రభుత్వం ఇబ్బందుల్లో పడుతుందని అందరూ ఊహించారు. అయితే, ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానం వీగిపోవడంతో పళనిస్వామి నేతృత్వంలోని అన్నాడీఎంకే ప్రభుత్వం 122 మంది ఎమ్మెల్యేల మద్దతుతో అధికారాన్ని నిలబెట్టుకుంది. ఇక అన్నాడీఎంకేకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు కంకణం కట్టుకొని రెండుగా చీలిన పార్టీని ఒకటి చేసేలా ఎడప్పాడి పళనిస్వామి చేపట్టిన చర్యలు ఫలించాయి. కాగా, అమ్మా మక్కల్‌ మున్నేట్ర కళగం (ఏఎంఎంకే) ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌కు మద్దతు పలికిన 18 మంది ఎమ్మెల్యేలను పదవి నుంచి తొలగిస్తూ సభాపతి ధనపాల్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ తరువాత ప్రభుత్వానికి వస్తున్న వ్యతిరేకత క్రమక్రమంగా తగ్గుతూ రావడం, ఈపీఎస్‌, ఓపీఎస్‌లు అన్నాడీఎంకే ఉప సమన్వయకర్త, సమన్వయకర్తలుగా ఏకగ్రీవంగా ఎంపిక కావడంతో ఆ పార్టీ నేతలు గట్టిగా ఊపిరి పీల్చుకున్నారు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేల మద్దతుతో ఎడప్పాడి పళనిస్వామి ముఖ్యమంత్రిగాను, ఒ.పన్నీర్‌సెల్వం ఉప ముఖ్యమంత్రి బాధ్యతలను చేపట్టి మంచి పథకాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి మార్గంలోకి నడిపిస్తున్నారు.

పండక్కి వెయ్యి - డెల్టా సురక్షితం..

తమిళులు ప్రతిష్ఠాత్మకంగా జరుపుకొనే పెద్ద పండుగ పొంగల్‌కు మొదటిసారిగా రూ.1,000 నగదు బహుమతితో కూడిన కిట్‌ పంపిణీ పథకానికి సీఎం శ్రీకారం చుట్టారు. ఈ పథకం విజయవంతం కావడంతో ప్రజలు ప్రభుత్వానికి బ్రహ్మరథం పట్టారు. అలాగే, అన్నదాతల సంక్షేమార్థం కోట్లాది రూపాయలు వెచ్చించి నదులు, వాగులు, చెరువుల్లో పూడికతీత పనులు నిర్వహించి అధికస్థాయిలో నిల్వచేసిన నీటిని సాగు కోసం విడుదల చేసి పంటలు సమృద్ధిగా పండించుకొనేందుకు అవకాశం కల్పించారు. అంతేకాకుండా, 13 జిల్లాలతో కూడిన కావేరి డెల్టాను సంరక్షిత వ్యవసాయం మండలంగా తాజాగా ప్రకటించిన సీఎంను మిత్రపక్షాలే కాకుండా ప్రతిపక్షాల నేతలు, రైతు సంఘాలు ప్రశంసించాయి. పెండింగ్‌లో ఉన్న అత్తికడవు-అవినాశి మెగా తాగునీటి పథకానికి ఈ వార్షిక బడ్జెట్‌లో నిధులు కేటాయించారు.

పెట్టుబడుల ఆకర్షణ

స్వదేశీ, విదేశీ పరిశ్రమల నుంచి పెట్టుబడులను ఆకర్షించడంలో కూడా ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి జాతీయస్థాయిలో ప్రథమస్థానంలో నిలిచారు. రెండవ అంతర్జాతీయ పెట్టుబడిదారుల మహానాడును రాజధాని నగరం చెన్నైలో నిర్వహించడంతో పాటు, అమెరికా, సింగపూర్‌ తదితర దేశాలకు వెళ్లి రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు స్థాపించేందుకు అవసరమైన పెట్టుబడులను రాబట్టుకొని ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నారు. రాష్ట్రంలో తరచూ తలెత్తుతూ వచ్చిన శాంతిభద్రతల సమస్యలపై ప్రతిపక్షాలు లేవనెత్తిన సమస్యలను అప్పటికప్పుడు పరిష్కరింపజేసి ఆ నేతల నోళ్లు మూయించారు.

ఫైళ్లలో వేగం

ప్రతిపక్షాల ప్రశ్నలకు మాత్రమే కాకుండా ప్రభుత్వ శాఖల నుంచి సీఎం కార్యాలయానికి పంపించే ఫైళ్లలోని ప్రశ్నలకు సమాధానాలివ్వడంతో పాటు 48 గంటల్లో సంతకాలు చేసి పెండింగ్‌ అనే సమస్యకు తావులేకుండా చేశారు. ఈ మూడేళ్లలో మాత్రమే 16,382 ఫైళ్లలో సంతకాలు చేసి, అభివృద్ధి పథకాలను విజయవంతంగా కొనసాగిస్తున్నారని సచివాలయ ఉన్నతాధికారులు తెలిపారు. ప్రజాసంక్షేమ పథకాలపై ప్రత్యేక దృష్టి సారించిన ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ఆదివారం సీఎంగా నాలుగవ ఏట అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ప్రస్తుత బడ్జెట్‌ సమావేశాల్లోనే అసెంబ్లీలో 110 నిబంధనల కింద అన్ని వర్గాల ప్రజలను మెప్పించే విధంగా కొత్త ప్రకటనలను ప్రకటించేందుకు సిద్ధపడుతున్నారని సచివాలయ వర్గాలు తెలిపాయి.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy
Top