Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'సర్‌' న్యాయాన్యాయాలు నిగ్గుదేలేనా?

'సర్‌' న్యాయాన్యాయాలు నిగ్గుదేలేనా?

భారత సర్వోన్నత న్యాయస్థానం (సుప్రీంకోర్ట్‌ ఆఫ్‌ ఇండియా) రాజ్యాంగ న్యాయస్థానం. అదే తుది అప్పిల్లేట్‌ కోర్టు కూడా. కొన్ని వ్యవహారాలలో దానికి సంపూర్ణ విచారణాధికారాలు ఉన్నాయి.

దేశంలోని అన్ని న్యాయస్థానాలపైన పర్యవేక్షణాధికారాలు ఉన్నాయి. స్వంత తీర్పులను సమీక్షించే, తోసిపుచ్చే అధికారాలూ ఈ సర్వోన్నత న్యాయస్థానానికి ఉన్నవి. ప్రజలను కలవరపరుస్తున్న అంశాలలో దేనినైనా తనంతటతాను విచారణకు స్వీకరించే అధికారం దానికి ఉన్నది. ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని లేదా ఒక కమిషన్‌ను నియమించగలదు. ఏదైనా కేసు విచారణలో భాగంగా ఒక అంశంపై దర్యాప్తును పోలీస్ ఏజెన్సీకి అప్పగించవచ్చు. పౌర, వాణిజ్య వివాదాల పరిష్కార బాధ్యతను ఒక మధ్యవర్తికి నివేదించవచ్చు. ఒక కేసు విచారణను ఒక హైకోర్టు పరిధి నుంచి మరో హైకోర్టు పరిధిలోకి మార్చవచ్చు. కోర్టు ధిక్కారానికి పాల్పడిన వ్యక్తిని శిక్షించే అధికారం దానికి ఉన్నది. భారత రాజ్యాంగంపై సుప్రీంకోర్టు అభిప్రాయమే తుదిమాట. 'న్యాయాన్ని సంపూర్ణంగా చేసేందుకు' ఎటువంటి ఆదేశాన్ని అయినా జారీ చేసే అధికారం సుప్రీంకోర్టుకు ఉంది. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన న్యాయస్థానం భారతదేశ సుప్రీంకోర్టే అని ప్రతీతి.

సుప్రీంకోర్టుకు ఉన్న విస్తృత అధికారాలలో ఒకదాన్ని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. రాజ్యాంగానికి సంరక్షకుడిగా ఉండడమే అది. స్టేట్‌ ఆఫ్‌ మద్రాస్‌ వర్సెస్‌ వీజీరో కేసులో రాజ్యాంగ సంరక్షణ తన విధ్యుక్త ధర్మమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగ ఉల్లంఘనలు జరగకుండా నిశితంగా గమనిస్తుంటానని దాని సారాంశం. ఇప్పుడు, ఎన్నికల గురించి రాజ్యాంగం ఏమి చెప్పిందో చూద్దాం. ఓటర్‌ జాబితాలను రూపొందించడం, సవరించడం, ఆ ప్రక్రియను పర్యవేక్షించడం, పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలకు ఎన్నికలు సవ్యంగా సక్రమంగా నిర్వహించడం మొదలైనవన్నీ ఎన్నికల సంఘం విధులు అని అధికరణ 324 పేర్కొంది. వయోజన ఓటుహక్కు ప్రాతిపదికన పార్లమెంటు దిగువసభ (లోక్‌సభ), రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు నిర్వహించాలని అధికరణ 326 ఎన్నికల సంఘాన్ని నిర్దేశించింది. 'ప్రతి పౌరునికి ఓటు హక్కు ఒక రాజ్యాంగ హక్కు' అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

భారతదేశంలో 18 సంవత్సరాల వయసు వచ్చిన ప్రతి వయోజనుడిని ఓటరుగా నమోదు చేసే ఎన్నికల సంఘం ప్రక్రియ ఒక రాజ్యాంగ బాధ్యత. ప్రతి వయోజనుడి పేరు ఓటర్‌ జాబితాలో విధిగా ఉండాలి. ఒక వ్యక్తి ఓటర్‌ అయ్యేందుకు పౌరసత్వం, నివాసం మొదలైన అర్హతలను కూడా రాజ్యాంగం, పౌరసత్వ చట్టం- 1955, ప్రజాప్రాతినిధ్య చట్టం-1950 నిర్దేశించాయి. చట్టం ప్రకారం అ అర్హతలు ఉన్న వయోజనుడే ఓటరుగా నమోదవుతాడు.

సార్వత్రిక వయోజన ఓటుహక్కు మన ప్రజాస్వామ్యానికి మౌలిక ప్రాతిపదిక. ఇది, 18 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయసున్న ప్రతి అర్హత గల పౌరుడికి ఓటుహక్కు కల్పిస్తుంది. ప్రతి వయోజనుడిని ఓటరుగా నమోదు చేయడమే నియమం. ఓటర్ల జాబితా నుంచి ఏ ఒక్కరినైనా మినహాయించాలంటే అందుకు కచ్చితంగా, రాజ్యాంగబద్ధమైన ప్రమాణాలను పాటించవలసి ఉంటుంది. మరింత స్పష్టంగా చెప్పాలంటే, ఈ మినహాయింపు ఒక అసాధారణ చర్య. ఈ మినహాయింపునకు చట్టం నిర్దేశించిన పద్ధతులను విధిగా పాటించాలి. ఎవరినైనా ఓటర్‌ జాబితా నుంచి తొలగించే నిర్ణయం తీసుకుంటే అందుకు కారణాలు ఏమిటో లిఖిత పూర్వకంగా స్పష్టం చేయాలి. ఆ నిర్ణయం న్యాయసమీక్షలో నెగ్గవలసి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఆ మినహాయింపు న్యాయబద్ధమైనది అవుతుంది.

బిహార్‌ 'సర్‌' కేసులో మే 27న వెలువరించిన తీర్పులో సుప్రీంకోర్టు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది: ఓటర్‌ జాబితాల సవరణకు 2003 నాటి జాబితాలను ఎన్నికల సంఘం ప్రాతిపదికగా తీసుకుంది. 2003 ఓటర్‌ జాబితాలలో లేని వారు ఓటరుగా తన అర్హతను నిరూపించుకునేందుకు ఈసీ నిర్దేశించిన ధ్రువీకరణ పత్రాలలో ఏదైనా ఒకటికానీ అంతకంటే ఎక్కువ గానీ సమర్పించవలసి ఉన్నది. ఓటర్‌ జాబితాలలో పేర్లు ఉన్న వ్యక్తులకు పౌరసత్వం ఉన్నట్టుగా భావించి తీరాలని ఇందర్‌జిత్‌ బారువా (1985), లాల్‌బాబు హుస్సేన్‌ (1995) కేసుల తీర్పుల్లో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఓటరుగా నమోదుకు సమర్పించిన డాక్యుమెంట్లను పరిశీలించి ఏ వ్యక్తి అర్హత అయినా సందేహాస్పదంగా ఉన్నప్పుడు ప్రతిపాదిత ఓటర్ల జాబితా నుంచి అతడి పేరు తొలగింపునకు కారణాలను పేర్కొంటూ ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీసర్‌ లేదా అసిస్టెంట్‌ ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీసర్‌ ఒక షోకాజ్‌ నోటీసు జారీ చేస్తాడు. ఆ నోటీసుకు సదరు వ్యక్తి ఇచ్చిన వివరణల ఆధారంగా ఈఆర్‌ఓ నిర్ణయం తీసుకుంటాడు. ఆ నిర్ణయం తనకు ప్రతికూలంగా ఉన్న పక్షంలో ప్రజాప్రాతినిధ్య చట్టం-1969 లోని సెక్షన్‌ 24 (ఎ) కింద జిల్లా మెజిస్ట్రేట్‌కు అప్పీల్‌ చేసుకోవచ్చు. అదే చట్టంలోని సెక్షన్‌ 24 (బి) కింద రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారికి రెండో అప్పీల్‌ చేసుకోవచ్చు. ఓటర్‌ జాబితాలను రూపొందించడంలోను లేదా సవరించడంలోను అతడి పౌరసత్వాన్ని పరిమితస్థాయిలో పరీక్షించే అధికారం ఎన్నికల సంఘానికి ఉంది. అయితే ఈ మొత్తం ప్రక్రియ న్యాయసమీక్షకు అనుగుణంగా ఉండాలని సుప్రీంకోర్టు తీర్పు స్పష్టం చేసింది. బిహార్‌లో ఇటీవలి 'సర్‌' ప్రక్రియ ద్వారా 2003 నాటి ఓటర్ల జాబితా నుంచి 47 లక్షల పేర్లను తొలగించారని ఆ తీర్పు పేర్కొంది. అంటే, బిహార్‌లో ప్రతి 100మంది వయోజనులలో ఆరుగురు ఓటర్లు తుది జాబితాల నుంచి మినహాయించబడ్డారు.

బిహార్‌ 'సర్‌' కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువడకముందే పశ్చిమ బెంగాల్‌లో ఈ సమగ్ర సవరణ ప్రక్రియను పూర్తిచేశారు. లక్షలాది ఓటర్ల పేర్లను జాబితాల నుంచి తీసివేశారు. గగ్గోలు పుట్టడంతో సంబంధిత ఫిర్యాదులపై న్యాయసమీక్ష నిర్వహించాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. పశ్చిమ బెంగాల్‌ 'సర్‌' ప్రక్రియపై అధికారిక గణాంకాల ప్రకారం మొదటి దశ పోలింగ్‌కు సంబంధించిన ఓటర్‌ జాబితాల నుంచి మరణం, నకిలీ నమోదు, నివాస ప్రదేశాల మార్పు, తదితర కారణాలతో మినహాయింపబడిన మొత్తం ఓటర్ల సంఖ్య 63.66 లక్షలు. 'తార్కిక వైరుద్ధ్యాలు' ప్రాతిపదికన మరో 27.16 లక్షల ఓటర్ల పేర్లను తొలగించారు. మొత్తం తొలగింపులు 90.83 లక్షలు. తమ పేర్ల తొలగింపుపై తాత్కాలిక న్యాయాధికారులకు దాదాపు 25 లక్షల మంది అప్పీల్‌ చేశారు. మే 14, 2026 వరకు విచారణ జరిపి పరిష్కరించిన అప్పీళ్ల సంఖ్య 6,581; అప్పీళ్లను అంగీకరించి ఓటర్‌ జాబితాలలో తిరిగి చేర్చబడిన వారి సంఖ్య 4,043. అంటే, అప్పీళ్ల సక్సెస్‌ రేటు 61.43 శాతం.

సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు పేర్ల తొలగింపుపై న్యాయసమీక్ష జరిగిన ఏకైక రాష్ట్రం పశ్చిమబెంగాల్‌. బిహార్‌లో న్యాయసమీక్ష జరగలేదు. ఒకసారి, పశ్చిమ బెంగాల్‌లో అప్పీల్‌ సక్సెస్‌ రేటు 61.43 శాతాన్ని బిహార్‌లో పేర్లు తొలగించినవారి సంఖ్య అయిన 47లక్షలకు వర్తింపజేయండి. ఆ 47 లక్షల మందిలో ఇంచుమించు 28,87,210 మంది ఓటుహక్కుకు అర్హులనే నిర్ణయానికి సహేతుకంగా రావచ్చు. ఓటర్‌ జాబితాలలో తమ పేర్ల పునః చేర్పునకు వారు పూర్తి అర్హులు. అది వారి హక్కు. కానీ జరిగిందేమిటి? పై వాస్తవాలను బట్టి సర్‌ ప్రక్రియ పారదర్శకంగా జరగలేదని విశదమవుతుంది. విశ్వసనీయత పూర్తిగా కొరవడిన వ్యవహారమది. ఈ ప్రక్రియ అమలు అనంతరం ప్రజాస్వామ్యం మనుగడలో ఉంటుందా?

పి. చిదంబరం

(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి,

కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

టీఎంసీలో చిచ్చు... రెబల్ ఎమ్మెల్యేలతో 23 మంది ఎంపీల మంతనాలు

కాంగ్రెస్‌కు జేఎంఎం ఝలక్.. రెండు రాజ్యసభ సీట్లలో పోటీకి కసరత్తు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy