Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సరిహద్దులను ఇలా తెరిచారో లేదో.. పర్యాటకులు అలా పోటెత్తారు!

సరిహద్దులను ఇలా తెరిచారో లేదో.. పర్యాటకులు అలా పోటెత్తారు!

సిమ్లా: ఆర్టీ పీసీఆర్ టెస్టు నెగటివ్ రిపోర్టు లేకుండానే రాష్ట్రంలోకి రావొచ్చంటూ హిమాచల్ ప్రదేశ్ సరిహద్దులను తెరవడంతో పర్యాటకులు ఒక్కసారిగా పోటెత్తారు. ముఖ్యంగా సిమ్లా, కులు-మనాలి, ధర్మశాలకు తొలి రోజే పెద్ద ఎత్తున తరలివచ్చారు. పర్యాటకులు పెద్ద ఎత్తున తరలిరావడంతో వారిని నియంత్రించడం పోలీసులకు కూడా సాధ్యం కాలేదు. అయితే, రాష్ట్రానికి వచ్చేవారందరూ తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు.

సరిహద్దులను తెరిచిన వెంటనే ఎంట్రీ పాయింట్ల వద్ద వాహనాలు కిలోమీటర్ల కొద్దీ బారులు తీరాయి. కొన్ని గంటల్లోనే షోయి బారియెర్ నుంచి సిమ్లాలోకి ఏకంగా 5 వేలకు పైగా వాహనాలు ప్రవేశించాయి. రిడ్జ్, షిమ్లాలోని మాల్‌ రోడ్ పర్యాటకులతో కిక్కిరిసిపోయింది.

కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించిన వారికి పోలీసులు జరిమానాలు విధించారు. అదే పనిగా నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా విధించడంతోపాటు ఎనిమిది రోజులపాటు జైలుకు పంపిస్తామని సిమ్లా ఎస్పీ మోహిత్ చావ్లా హెచ్చరించారు.

కరోనా విజృంభణ కారణంగా 2020 వేసవిలో హిమాచల్ ప్రదేశ్ పర్యాటక రంగం దారుణంగా నష్టపోయింది. ఈసారి కాస్తంత సడలింపుల కారణంగా ఈ రంగం కొంత కోలుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.

కాగా, నిన్నటి వరకు ముందే హోటల్, హోం స్టే బుక్ చేసుకుని ఉన్న వారికి కొవిడ్ నెగటివ్ రికార్డు ఉంటేనే ప్రభుత్వం రాష్ట్రంలోకి అనుమతించింది. అయితే, నేటి నుంచి ఆ నిబంధనలు ఎత్తివేసింది. ఆర్టీ పీసీఆర్ నెగటివ్ రిపోర్టు లేనప్పటికీ రాష్ట్రంలోకి అనుమతిస్తామన్న ప్రభుత్వం ప్రకటనతో వేలాదిమంది పర్యాటకులు హిమాచల్ ప్రదేశ్‌కు పోటెత్తారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy