Thursday, 06 May, 12.19 am ఆంధ్రజ్యోతి

అమరావతి
సెట్స్‌ ఎదురుచూస్తున్నాయి

ఒక సినిమాను సెట్‌ చేయటం, దాన్ని సెట్స్‌ పైకి తీసుకెళ్లడం ఎంత కష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాగే కథరీత్యా అవసరమైన సెట్‌లు నిర్మించటంలోనూ అంతే కష్టం దాగుంది. దర్శకుడి ఊహలకు కళాదర్శకుడి సృజన, నిర్మాత పెట్టే ఖర్చు తోడైతే ఆ సెట్స్‌ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి కలిగిస్తాయి. కొత్త లోకాలకు తీసుకెళతాయి. అందుకే కథ డిమాండ్‌ మేరకు ఖర్చు విషయంలో కాంప్రమైజ్‌ కాకుండా భారీ సెట్స్‌ నిర్మించడానికి నిర్మాతలు వెనుకాడడం లేదు. అయితే కథతో నిమిత్తం లేకుండా భారీ సెట్స్‌ వేసి మాయ చేయాలని చూసినా ప్రేక్షకులు అంగీకరించరు. సెట్స్‌ ప్రత్యేక ఆకర్షణగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తెలుగు చిత్రాలు ఇవే. అయితే వీటిలో కొన్ని చిత్రాల సెట్‌ వర్క్‌ పూర్తి కాగా, కరోనా కారణంగా షూటింగ్‌కు బ్రేక్‌ ఇవ్వడంతో ఎదురు చూస్తున్న సెట్స్‌ మరికొన్ని ఉన్నాయి.

ఆచార్యలో టెంపుల్‌ సిటీ

చిరంజీవి కథానాయకుడుగా నటిస్తోన్న చిత్రం 'ఆచార్య'. ఆయనకు జోడీగా కాజల్‌ అగర్వాల్‌ నటిస్తున్నారు. రామ్‌చరణ్‌కు జంటగా పూజాహెగ్డే నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. నక్సల్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే కథే అయినా దేవాదాయ శాఖ అవినీతి, తెలుగు రాష్ట్రాల్లో అన్యాక్రాంత మైన దేవాలయ భూముల అంశాలు కూడా 'ఆచార్య' చిత్రంలో స్పృశిస్తున్నారు దర్శకుడు కొరటాల. ఈ సినిమా కోసం పురాతన దేవాలయం అవసరం పడటంతో హైదరాబాద్‌ శివార్లలోని కోకాపేట్‌లో దాదాపు 20 ఎకరాల్లో టెంపుల్‌ సెట్‌ను భారీ ఎత్తున నిర్మించారు. ఈ దేవాలయం సెట్‌ 'ఆచార్య' చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా చెపుతున్నారు. ఆ టెంపుల్‌ సిటీ గురించి తెలియచేసే ఓ వీడియోను చిరంజీవి ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. 'ఒక సినిమా కోసం 20 ఎకరాల్లో ఇంత భారీ సెట్‌ వేయటం దేశంలో ఇదే తొలిసారి. ఈ సెట్‌ కళాదర్శకత్వ ప్రతిభకు ఓ మచ్చుతునక' అని చిరంజీవి అన్నారు. ప్రముఖ తమిళ కళా దర్శకుడు సురేష్‌ సెల్వరాజన్‌ ఈ సెట్‌ను రూపొందించారు. దీనికి రూ. 10 కోట్లపైనే ఖర్చయింది.

మేజర్‌ కోసం తాజ్‌ హోటల్‌

26/11 ముంబైలో జరిగిన ఉగ్రవాదుల దాడిలో అమరుడైన మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం 'మేజర్‌'. అడివి శేష్‌ కథానాయకుడు. శశికిరణ్‌ తిక్క దర్శకత్వంలో మహేశ్‌ బాబు సోనీ పిక్చర్స్‌ ఇండియా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తాజ్‌ హోటల్లో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతుండటంతో ఆ హోటల్‌లోనే సినిమా చిత్రీకరణ జరపాలని భావించారు. కానీ అనుమతులు లభించకపోవటంతో ఏకంగా ఆ హోటల్‌ సెట్‌ వేశారు. 500 మంది కార్మికులు పది రోజుల పాటు శ్రమించి ఈ సెట్‌ వేశారు. అలాగే గేట్‌ వే ఆఫ్‌ ఇండియా, ఎన్‌ఎస్‌జీ కమాండో కార్యాలయం సెట్‌ కూడా వేశారు. కళా దర్శకుడు అవినాష్‌ కొల్లా ఈ భారీసెట్‌కు రూపకల్పన చేశారు.

ఆర్‌ఆర్‌ఆర్‌ భారీ సెట్స్‌

రాజమౌళి దర్శకత్వంలో జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా నటిస్తోన్న చిత్రం 'రణం రౌద్రం రుధిరం'. చారిత్రక పాత్రలతో కల్పిత గాథగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం కోసం రాజమౌళి ఆలోచన మేరకు భారీసెట్లను నిర్మించారు. హైదరాబాద్‌లో భారీవ్యయంతో రెండు సెట్స్‌ రూపొందించి షూటింగ్‌ జరిపారు. లాక్‌డౌన్‌తో పుణేలో ప్లాన్‌ చేసిన షెడ్యూల్‌ వాయిదా పడింది. లాక్‌డౌన్‌ ఎత్తేశాక కూడా షూటింగ్‌కు పరిస్థితులు అనువుగా లేకపోవటంతో హైదరాబాద్‌లోనే సెట్‌ను తీర్చిదిద్దారు. అలాగే హైదరాబాద్‌ గండిపేట పరిసరాల్లో భారీ సెట్లు వేసి కోట ప్రాకారాలు తీర్చిదిద్దారు. అలాగే ఓ ప్రైవేట్‌ స్టూడియోలో రూ. 18 కోట్ల వ్యయంతో మరో సెట్‌ను నిర్మించారు.

శాకుంతలం

సమంత టైటిల్‌ రోల్‌లో దర్శకుడు గుణశేఖర్‌ తెరకెక్కిస్తోన్న పౌరాణిక చిత్రం 'శాకుంతలం'. ఆ కాలానికి తగ్గట్టుగా ఉండేలా దాదాపు పది సెట్స్‌ ఈ సినిమా కోసం వేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్‌ జరుగుతున్న అన్నపూర్ణ స్టూడియోలో ఇంతవరకూ నాలుగు సెట్స్‌ వేసి షూటింగ్‌ చేస్తున్నారు. వచ్చే నెల్లో జరిగే రెండో షెడ్యూల్‌లో మిగిలిన సెట్స్‌లో షూటింగ్‌ జరుగుతుంది. సమంత ఈ చిత్రంలో శకుంతలగా నటిస్తున్నారు.

ఆదిపురుష్‌ కోసం అడవి సెట్‌

ప్రభాస్‌ కథానాయకుడుగా ఔం రౌత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్‌ ఇండియా చిత్రం 'ఆదిపురుష్‌'. రామాయణం నేపథ్యంలో తెరకెక్కే చిత్రం ఇది. 3డీ టెక్నాలజీలో తెరకెక్కుతోంది. కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించేందుకు భారీ అడవిసెట్‌ను రూపొందించారు. ముంబైలోని గోరేగావ్‌లో వేసిన ఈ భారీ సెట్‌ అగ్నిప్రమాదంలో దగ్ధం కావడం, కరోనా కారణాల వల్ల షూటింగ్‌ కు బ్రేక్‌ ఇచ్చారు.

ఇటలీని తలపించే రాధేశ్యామ్‌ సెట్‌

ప్రభాస్‌, పూజాహెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్‌ దర్శకత ్వంలో తెరకెక్కుతోన్న పీరియాడికల్‌ లవ్‌స్టోరీ చిత్రం 'రాధేశ్యామ్‌'. 1960ల్లో ఐరోపాలో జరిగిన ప్రేమకథ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ చిత్రం కోసం హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో పెద్ద హాస్పిటల్‌ సెట్‌ వేశారు. దీని కోసం రూ. 5 కోట్లు ఖర్చు చేశారని సమాచారం. అలాగే క్లైమాక్స్‌ కోసం ఇటలీ వెళ్లి అక్కడ రైల్వే స్టేషన్‌లో చిత్రీకరణ చేయాల్సి ఉంది. కానీ కరోనా వల్ల ఇటలీ వెళ్లడం కుదరలేదు. దీంతో హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో రూ. 2 కోట్ల ఖర్చుతో రైల్వేస్టేషన్‌ సెట్‌ వేశారు. ఆర్ట్‌ డైరెక్టర్‌ రవీంద్ర ఆధ్వర్యంలో 250 మంది కళాకారులు నెల రోజులు కష్టపడ్డారు. అలాగే క్లైమాక్స్‌ సన్నివేశాల కోసం రూ. 30 కోట్ల ఖర్చుతో ఓ భారీసెట్‌ను రూపొందించారు. హాలీవుడ్‌ యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌ నిక్‌ పోవెల్‌ ఆధ్వర్యంలో ఈ సెట్‌లో యాక్షన్‌ ఎపిసోడ్‌ చిత్రీకరించారు. అలాగే ప్రభాస్‌ కథానాయకుడుగా నటిస్తోన్న ''సలార్‌' చిత్రం కోసం హైదరాబాద్‌ శివార్లలో ఓ భారీ సెట్‌ను రూపొందించి చిత్రీకరణ జరిపారు.

ఎర్రకోట, చార్మినార్‌ సెట్స్‌లో హరిహర వీరమల్లు

పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడుగా క్రిష్‌ దర్శకత్వంలో తెరెకెక్కుతోన్న చారిత్రక చిత్రం 'హరిహర వీరమల్లు'. మొఘలాయుల కాలం నేపథ్యంలో తెరకెక్కుతుండటంతో అప్పటి వాతావరణానికి తగ్గట్టు హైదరాబాద్‌లో భారీ సెట్‌లు రూపొందించి చిత్రీకరణ జరిపారు. కీలక సన్నివేశాల కోసం ఎర్రకోట, చార్మినార్‌ సెట్స్‌ రూపొందించారు. వీటిల్లో కొంత భాగం షూటింగ్‌ జరిగింది. మరికొన్ని సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉంది.

శ్యామ్‌సింగరాయ్‌ కోసం రూ. 6.5 కోట్ల సెట్‌

చారిత్రక నగరం కోల్‌కతాని హైదరాబాద్‌కు తీసుకొచ్చారు 'శ్యామ్‌సింగరాయ్‌' చిత్రబృందం. నానీ కథానాయకుడుగా రాహుల్‌సాంకృత్యాన్‌ తెరకెక్కిస్తోన్న చిత్రం ఇది. దాదాపు రూ. 6.5 కోట్ల వ్యయంతో పదెకరాల్లో ఈ సెట్‌ని రూపొందించారు. కళా దర్శకుడు అవినాష్‌ కొల్ల ఈ సెట్‌ను సృష్టించారు. ఇందులో 'శ్యామ్‌సింగరాయ్‌' ఫైనల్‌ షెడ్యూల్‌ షూటింగ్‌ జరుగుతోంది.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy
Top