Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సెయింట్ లూయిస్ హిందూ దేవాలయంలో దశసహస్ర మోదక హోమం

సెయింట్ లూయిస్ హిందూ దేవాలయంలో దశసహస్ర మోదక హోమం

మిస్సోరిలోని సెయింట్ లూయిస్ హిందూ దేవాలయంలో నిర్వహిస్తున్న నవకుండాత్మక శతచండీ సహిత రుద్రయాగం రెండో రోజు వైభవంగా వేదఘోషల మధ్య భక్తిశ్రద్ధలతో కొనసాగింది.

ఆలయ యాగశాల భక్తులతో కిక్కిరిసింది. వైదిక సంప్రదాయాల ప్రకారం పలు కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. రెండో రోజు ఉదయం గోమాత పూజతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఋత్వికులు శాస్త్రోక్తంగా మహాన్యాస పారాయణం చేశారు. పరమశివుని అనుగ్రహం, లోకక్షేమం, సర్వజనులకు సుఖశాంతులను కోరుతూ రుద్రహోమం నిర్వహించారు.

ఉదయం కార్యక్రమాల్లో భాగంగా నిర్వహించిన దశసహస్ర మోదక హోమం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. విఘ్నేశ్వరుడికి ప్రీతికరమైన మోదకాలతో ఈ విశిష్ట హోమాన్ని నిర్వహించారు. హోమానికి అవసరమైన 10000 మోదకాలను ఆలయ వాలంటీర్లు స్వయంగా సిద్ధం చేశారు. శాస్త్రోక్తంగా పూర్ణాహుతి నిర్వహించి, భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. సాయంత్రం కార్యక్రమాల్లో చండీ హోమం నిర్వహించారు. ఆదిపరాశక్తి అనుగ్రహం, ధర్మరక్షణ, లోకక్షేమం కోసం ఈ హోమం జరిపారు. అనంతరం వారాహి హోమం వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య శాస్త్రోక్తంగా నిర్వహించి రాత్రి తీర్థప్రసాదాలతో రెండో రోజు కార్యక్రమాలకు ముగింపు పలికారు.

ఆరు రోజుల పాటు కొనసాగనున్న ఈ మహాయాగంలో ప్రతిరోజూ విశిష్ట పూజలు, హోమాలు, చండీ పారాయణం, రుద్రయాగాలు నిర్వహిస్తారు. ప్రపంచ శాంతి, సర్వజన సుఖశాంతి, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, కుటుంబ శ్రేయస్సు కోసం నిర్వహిస్తున్న ఈ మహాయాగంలో అనేక ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి పాల్గొంటున్నారని ఆలయ కమిటీ అధ్యక్షుడు గంగవరపు రజనీకాంత్, ఉపాధ్యక్షుడు విజయ్ సాక్షి, కార్యదర్శి జంగా కిషోర్‌లు పేర్కొన్నారు. మిగిలిన రోజుల కార్యక్రమాలకు కూడా భక్తులు కుటుంబ సమేతంగా హాజరై అమ్మవారు, పరమేశ్వరుడి అనుగ్రహాన్ని పొందాలని మీడియా వ్యవహారాల సమన్వయకర్త రాజా సూరపనేని కోరారు.

ఈ వార్తలనూ చదవండి:

సెయింట్‌ లూయిస్‌లో వైభవంగా ప్రారంభమైన శతచండీ సహిత రుద్రయాగం

ఆటా 19వ మహాసభలకు విస్తృత ఏర్పాట్లు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy