Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
షేర్‌ మార్కెట్‌లో లాభాలంటూ భారీ సైబర్‌ మోసం

షేర్‌ మార్కెట్‌లో లాభాలంటూ భారీ సైబర్‌ మోసం

  • ఇద్దరికి రూ.2.43 కోట్ల టోకరా

హైదరాబాద్‌ సిటీ: షేర్‌ మార్కెట్‌లో భారీ లాభాలు వస్తాయంటూ నకిలీ ట్రేడింగ్‌ ప్లాట్‌ఫామ్‌లతో సైబర్‌ నేరగాళ్లు ఇద్దరిని బురిడీ కొట్టించారు.

బాధితుల నుంచి మొత్తం రూ.2.43 కోట్లకుపైగా సైబర్‌ కేటుగాళ్లు కాజేశారు.

ట్రేడింగ్‌ పేరుతో..

బాచుపల్లికి చెందిన బాధితునికి ఆగస్టు 2న ఫేస్‌బుక్‌లో వచ్చిన ప్రకటనను క్లిక్‌ చేయగా, అతన్ని 'యెస్‌ సెక్యూరిటీ గ్రూప్‌' వాట్సాప్‌ గ్రూప్‌లో చేర్చి ట్రేడింగ్‌ ద్వారా అధిక లాభాలు వస్తాయని నిర్వాహకులు నమ్మబలికారు. వారి మాటలు నమ్మిన బాధితుడు మొదట రూ.15 వేలు పెట్టగా లాభాలు వస్తున్నట్లు చూపించారు.

దీంతో అతను విడతల వారీగా రూ.10లక్షలు పెట్టుబడిగా పెట్టాడు. ఆ తర్వాత 'సన్‌షైన్‌ పిక్చర్స్‌ లిమిటెడ్‌' ఐపీవో పేరుతో రూ.43.51 లక్షలు, మరో ఐపీవోలో రూ.46లక్షలను పెట్టుబడిగా బదిలీ చేయించుకున్నారు. తదనంతరం లాభాలతో ఖాతా విలువ ఏకంగా రూ.44.43 కోట్లకు చేరిందని చూపించారు. కమీషన్‌ చెల్లిస్తేనే విత్‌డ్రా అవుతాయని మరో రూ. 27.73 లక్షలు వసూలు చేశారు. అనంతరం లాభాలపై పన్ను చెల్లించాలని డిమాండ్‌ చేయడంతో బాధితుడు మోసపోయినట్లు గుర్తించాడు. మొత్తం రూ.1,07,73, 349 బదిలీ చేయగా.. కేవలం రూ.36,800 మాత్రమే తిరిగి వచ్చిందని, రూ.1.07,36,549 నష్టం వాటిల్లిందని సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

 మరో ఘటనలో రూ.1.35 కోట్లు..

రాజేంద్రనగర్‌కు చెందిన బాధితురాలు ఫేస్‌బుక్‌లో వచ్చిన ప్రకటనను క్లిక్‌ చేయగా ఆమెను ట్రేడింగ్‌ ప్లాట్‌ఫామ్‌లో చేర్చారు. బ్లాక్‌ ట్రేడింగ్‌, అప్పర్‌ సర్క్యూట్‌ షేర్లు, ఐపీవోల్లో పెట్టుబడులతో భారీ లాభాలు వస్తాయని అకౌంట్‌ మేనేజర్‌గా పరిచయమైన వ్యక్తి నమ్మించాడు. మొదట రూ.10.41 లక్షలు పెట్టుబడి పెట్టించిన నిందితులు.. గోల్డ్‌ కేటగిరీకి అప్‌గ్రేడ్‌ పేరుతో మరో రూ.25 లక్షలు చెల్లించాలని కోరారు.

అనంతరం ప్లాటినం కేటగిరీ పేరుతో రూ. కోటి పెట్టుబడి పెట్టాలని సూచించారు. అంత మొత్తం సాధ్యం కాదని చెప్పడంతో కనీసం రూ.35 లక్షలు చెల్లించాలని ఒత్తిడి చేశారు. దీంతో జూలై 29, 30 తేదీల్లో రూ.35 లక్షలు బదిలీ చేసింది. ఆ తర్వాత వర్చువల్‌గా లాభం రూ.5.28 కోట్లు చూపించారు. ఆ మొత్తాన్ని ఉపసంహరించుకోవాలంటే మరో రూ.50లక్షలు చెల్లించాలని డిమాండ్‌ చేయడంతో మోసపోయానని గుర్తించిన బాధితురాలు సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి:

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy