Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
శేరిలింగంపల్లిలో 2.73 లక్షల మంది ఓటర్లకు నోటీసులు

శేరిలింగంపల్లిలో 2.73 లక్షల మంది ఓటర్లకు నోటీసులు

  • నియోజకవర్గంలో ప్రారంభమైన ప్రక్రియ

  • మొదటి నుంచీ సర్‌ ప్రక్రియలో జాప్యమే

  • సాంకేతిక సమస్యలంటున్న అధికారులు

  • గడువు లోగా నోటీసులు పంపిణీపైనా అనుమానాలు

హైదరాబాద్: శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 2002 ఓటరు జాబితాతో మ్యాపింగ్‌ కాని ఓటర్లకు అధికారులు నోటీసులు అందజేస్తున్నారు.

సోమవారం సాయంత్రం ఈ ప్రక్రియను ప్రారంభించారు. సర్‌ సర్వే ప్రక్రియ నియోజకవర్గంలో మొదటి నుంచీ ఆలస్యంగానే జరుగుతుంది. ఓటర్లకు ఎన్యుమరేషన్‌ ఫారాల పంపిణీ రాష్ట్ర వ్యాప్తంగా జూన్‌ 24న ప్రారంభమై ఆగస్టు 10 వరకు కొనసాగింది. అయితే ప్రారంభంలో ఎన్యుమరేషన్‌ ఫారాలు ఓటర్లకు ఇవ్వడంలో ఇక్కడ ఆలస్యం జరిగింది.

దరఖాస్తులు రాలేదంటూ ఆలస్యంగా ప్రారంభించారు. నియోజకవర్గ ముసాయిదా ఈ నెల 17న విడుదల కాగా, మరుసటి రోజు నుంచి మ్యాపింగ్‌ కాని వారికి నోటీసులు జారీ చేయాల్సి వుండగా వారం రోజుల ఆలస్యంగా ఈ ప్రక్రియను ప్రారంభించారు. సాంకేతిక కారణాలతో ఆలస్యమవుతుందని చెబుతూ వచ్చిన అధికారులు ఎట్టకేలకు సోమవారం దీన్ని ప్రారంభించారు. నియోజకవర్గంలోని 639బూత్‌లో ఈ కార్యక్రమం ప్రారంభమైంది.

 అయితే అదనంగా మరో 10 మంది ఏఈఆర్వోలను నియమించడం, వారికి బాధ్యతలు అప్పగించడం చేశారు. సర్‌ పక్రియలో అనర్హులను బీఎల్‌ఓలుగా నియమించడంతో సమస్య ఏర్పడింది. పారిశుధ్య కార్మికులు, డ్రైవర్లను బీఎల్‌ఓలుగా పెట్టుకోవడం వల్ల సర్వేలో సమస్యలు తలెత్తాయి. ఎన్యుమరేషన్‌ ఫారాలు సక్రమంగా ఓటర్లకు అందించలేకపోయారు. ఎన్నికల సంఘం గడువు పెంచినప్పటికీ ఈ ప్రక్రియ సక్రమంగా జరగలేదని రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి.

వార్డు కార్యాలయాల్లో హియరింగ్‌..

నోటీసులు అందుకున్న వారందరూ అందులో పేర్కొన్న సమయానికి జోనల్‌, సర్కిల్‌, వార్డు కార్యాలయాల్లో జరిగే హియరింగ్‌కు హాజరు కావాల్సి ఉంది. అక్కడ అవసరమైన పత్రాలు అందజేయాలి. ఆన్‌లైన్‌ ద్వారానూ వారికి ఇచ్చిన నోటీసులో పేర్కొన్న పత్రాలు ఆప్‌లోడ్‌ చేసే అవకాశం కల్పించారు. హియరింగ్‌కు రాని వారి ఓట్లు తొలగిస్తామని అధికారులు చెబుతున్నారు. నియోజకవర్గంలో మొత్తం 2,73,486మందికి నోటీసులు ఇవ్వాల్సి ఉంది. నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఓటు లేని 18 సంవత్సరాలు నిండిన వారు ఫాం-6 పూర్తిచేసి సర్కిల్‌ కార్యాలయంలో అందజేయాలని, ఆన్‌లైన్‌లోనూ దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. ఈ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టనున్నట్లు సమాచారం.

27న వార్డు సమావేశాలు..

సర్‌ సర్వేలో భాగంగా ఇస్తున్న నోటీసులపై ఓటర్లకు అవగాహన కల్పించేందుకు ఈ నెల 27న వార్డు సమావేశాలు నిర్వహిస్తున్నట్లు శేరిలింగంపల్లి అసిస్టెంట్‌ ఎన్నికల అధికారి ప్రేమ్‌కుమార్‌ తెలిపారు. వార్డు పరిధిలోని ఓటర్లు ఈ సమావేశంలో పాల్గొనాలని ఆయన సూచించారు. నోటీసులు అందుకున్న వారు తప్పకుండా రావాలని, ఏఏ పత్రాలు జతచేయాలనే అంశాలను క్షుణంగా వివరిస్తామని చెప్పారు.

ఈ వార్తలు కూడా చదవండి:

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy