Wednesday, 15 Sep, 6.45 am ఆంధ్రజ్యోతి

ఆంధ్ర ప్రదేశ ముఖ్యాంశాలు
శ్రీకాళహస్తీశ్వరాలయానికి కూతవేటు దూరంలో అపచారం.. ఏంటిది..!?

చిత్తూరు జిల్లా/శ్రీకాళహస్తి : శ్రీకాళహస్తీశ్వరాలయానికి కూతవేటు దూరంలో ఉన్న భరద్వాజ తీర్థంలోని భరద్వాజేశ్వరాలయ సమీపంలో అవధూత అనిల్‌స్వామికి కొందరు భక్తులు అంతిమ సంస్కారాలను నిర్వహించడం కలకలం రేపింది.బయటి ప్రాంతానికి చెందిన వ్యక్తిని ఖననం చేశారంటూ కొందరు ఆరోపించగా పట్టణవ్యాప్తంగా ఉన్న వందలాదిమంది భక్తులు మాత్రం స్వామి తమ ఆరాధ్య దైవమని అనవసర అపోహలను వ్యాపించవద్దని వేడుకుంటున్నారు.నెల్లూరు జిల్లా నాయుడుపేట సమీపంలోని దురశనమాలకు చెందిన వెంకయ్య, రామలక్ష్మమ్మ దంపతుల కుమారుడు అనిల్‌బాబు 2002లో బీటెక్‌ చదివేందుకు స్కిట్‌ కళాశాలలో చేరారు.

ఏకాంతంగా చదువుకునేందుకు అప్పుడప్పుడూ భరద్వాజేశ్వరాలయం వద్దకు వెళ్లేవాడు. 45ఏళ్ల క్రితం వేణుగోపాలస్వామి అనే అవధూత అక్కడ సమాధి అయ్యారు. పక్కనే కోట్లమ్మ అనే అవధూత ఏకాంతంగా ఉండేది. అనిల్‌బాబు ఆమెకు సేవలు చేసేవాడు.బీటెక్‌ పూర్తయేసరికి పట్టణంలో వందలాదిమంది ఆధ్యాత్మిక చింతన కలిగినవారితో అనిల్‌బాబుకు పరిచయమైంది. అనంతరం జేఎన్‌టీయూ అనంతపురంలో ఎంటెక్‌ చదివాడు. ఉద్యోగాలు వచ్చినా ఆధ్యాత్మిక చింతనను వదులుకోలేనంటూ కోట్లమ్మను సేవించుకునేవాడు. ఐదేళ్ల క్రితం ఆమె చనిపోయాక భరద్వాజ తీర్థంలో అంతిమసంస్కారాలు చేసి సమాధి కూడా నిర్మించాడు.తరువాత కూడా అనిల్‌బాబు 20 కిలోమీటర్ల దూరం ఉన్న కైలాసగిరులను రోజూ ప్రదక్షిణ చేస్తూ శివతత్వాన్ని అందరికి బోధించేవాడు.ఆధ్యాత్మిక చింతనపై కొన్ని పుస్తకాలను కూడా రచించాడు.

ఈ క్రమంలో ఆయనకు చాలామంది శిష్యులుగా మారిపోయారు. ఏడాది క్రితం తల్లి అభ్యర్థనతో పెళ్లి చేసుకున్నాడు.ఈ నెల 10వతేదీ వినాయకచవితి రోజున ఉదయం, సాయంత్రం మిత్రులతో కలిసి గిరిప్రదక్షిణ చేసుకున్నాడు. అదే రాత్రి ఎడమచెయ్యి నొప్పిగా ఉండటంతో చికిత్స తీసుకోగా మరునాటికి తీవ్రమైంది. ఆయన శిష్యులు 11వ తేదీ చెన్నైకి తరలించారు. నరాల సంబంధిత వ్యాధిగా వైద్యులు గుర్తించారు.ఆదివారం మధ్యాహ్నం అనిల్‌స్వామికి కుమార్తె జన్మించింది. ఈ విషయాన్ని స్పృహలోకి వచ్చిన ఆయనకు తెలిపారు. చికిత్స పొందుతూ 13వ తేదీ అనిల్‌స్వామి మృతి చెందాడు. సిద్ధపురుషుడిగా భావించిన ఆయన శిష్యులు శ్రీకాళహస్తీశ్వరాలయ సమీపంలోని ఓ దుకాణం ఎదుట సోమవారం సాయంత్రం మృతదేహానికి అభిషేకాలు చేశారు.

అనంతరం కోట్లమ్మ సమాధి పక్కనే అంతిమ సంస్కారాలు చేశారు. ఈ విషయంపై రకరకాల అపోహలతో ప్రజల్లో కలకలం రేగింది. ఈ నేపథ్యంలో ముక్కంటి ఆలయ ఈవో పెద్దిరాజు ఇద్దరు అధికారులపై చర్యలు తీసుకున్నారు. భరద్వాజతీర్థంలో మృతదేహం ఖననం చేయడంపై ఆలయ ఏఈవో, సెక్యూరిటీ చీఫ్‌గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసులురెడ్డితో పాటు అర్చకులు అనిల్‌శర్మను సస్పెండ్‌ చేశారు.భరద్వాజ తీర్థంలో సెక్యూరిటీ విధుల్లో వున్న ఇద్దరు గార్డులను కూడా సస్పెండ్‌ చేశారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy
Top