డ్యాంలోకి 2,43,867 క్యూసెక్కుల ప్రవాహం
131 టీఎంసీలు దాటిన నిల్వలు
కర్నూలు, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం జలాశయం.. తెలుగు రాష్ట్రాల్లో సాగు, తాగునీటి అవసరాలు తీర్చే జీవనాడి.
ఎగువన కురుస్తున్న వర్షాలకు కృష్ణమ్మ వరద ఉరకలేస్తూ డ్యాంలో చేరుతోంది. జూరాల ప్రాజెక్టు గేట్లు దాటుకుని 2,43,867 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. ప్రస్తుతం నీటి నిల్వలు 131.26 టీఎంసీలకు చేరుకున్నాయి. గడచిన ఎనిమిది రోజుల్లో 88.1946 టీఎంసీల వరద వచ్చిందని డ్యాం ఎస్‌ఈ వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. జలాశయం గరిష్ఠ నీటి మట్టం 885 అడుగులు, సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా.. 866.90 అడుగుల వద్ద 131.26 టీఎంసీలు చేరాయి. రాయలసీమ జిల్లాలకు సాగు, తాగునీరు అందించే తుంగభద్రకు కూడా వరద కొనసాగుతోంది. డ్యాం గరిష్ఠ నిల్వ సామర్థ్యం 105.788 టీఎంసీలు కాగా.. ప్రసు ్తతం 59.718 టీఎంసీలు చేరాయి. ఎగువ తుంగ ప్రాజెక్టు గేట్లు దాటుకుని 1,00,750 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. తాగునీటి కోసం కాలువలకు 1,443 క్యూసెక్కులు విడుదల చేశారు. కర్నూలు జిల్లాలో టీబీపీ ఎల్లెల్సీలో 410 క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉంది. సాగుపై ఆయకట్టు రైతుల్లో ఆశలు చిగురిస్తున్నా.. ఎల్‌నినో ప్రభావం వల్ల రాబోయే రోజుల్లో నీటిఎద్దడి ఏర్పడుతుందన్న భయంతో సాగునీటి విడుదలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలో ఉంది. ఎగువన ఆలమట్టి, నారాయణపూర్ నుంచి జూరాల ప్రాజెక్టుకు భారీ వరద వస్తోంది. జూరాలకు 2.52 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. శ్రీశైలానికి 2,49,785 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
ప్రాజెక్టు నిండకముందే తెలంగాణ విద్యుదుత్పత్తి
ఇంకోవైపు.. శ్రీశైలం ఎడమ గట్టు విద్కుత్యేంద్రం నుంచి తెలంగాణ విద్యుదుత్పత్తి ప్రారంభించి 4,267 క్యూసెక్కులు నాగార్జున సాగర్‌కు విడుదల చేసింది. డ్యాం పూర్తిగా నిండకపోయినా విద్యుదుత్పత్తి పేరిట నీటిని వదిలేయడంపై సీమ ప్రజలు ఆందోళన వ్యక్తం చేయడంతో సాయంత్రానికి విద్యుదుత్పత్తిని ఆపేశారు. కల్వకుర్తి ఎత్తిపోతలకు 800 క్యూసెక్కులు తరలిస్తున్నారు.

