Dailyhunt
శ్రీవారి ప్రసాదం కల్తీపై అసెంబ్లీలో చర్చించడం బాధాకరం: మంత్రి ఆనం

శ్రీవారి ప్రసాదం కల్తీపై అసెంబ్లీలో చర్చించడం బాధాకరం: మంత్రి ఆనం

మరావతి, ఫిబ్రవరి 24: తిరుమలలో శ్రీవారి భక్తులకు అందించే ప్రసాదం కల్తీ, అపవిత్రంపై అసెంబ్లీ వేదికగా చర్చించాల్సి రావడం బాధాకరమని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

మంగళవారం అసెంబ్లీలో తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి వినియోగించిన కల్తీ నెయ్యిపై చర్చ జరిగింది. ఈ చర్చను మంత్రి ఆనం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏఆర్ డెయిరీతో పాటు అనుబంధ డెయిరీలు ఈ కల్తీ నెయ్యిని సరఫరా చేశాయని ఫిర్యాదులో పేర్కొన్నారన్నారు. ప్రొక్యూర్‌మెంట్ విభాగం జనరల్ మేనేజర్ పి.మురళీ కృష్ణ ఫిర్యాదుతో లడ్డూ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేశారని తెలిపారు. ఈ ఫిర్యాదు మేరకు 2024 సెప్టెంబర్ 25న ఆహార కల్తీ, మోసం, కుట్ర అభియోగాలతో కేసు నమోదైందని గుర్తు చేశారు. దీనిపై ప్రత్యేక దర్యాప్తు విభాగాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని వివరించారు. ఆ తర్వాత సీబీఐ విచారణకు ఆదేశించామని చెప్పారు.

నిజమైన నెయ్యి సేకరించేందుకు టెండర్ నిబంధనలు గతంలో కఠినంగా ఉండేవని మంత్రి ఆనం గుర్తు చేశారు. కానీ 2020 ఫిబ్రవరిలో అప్పటి ప్రభుత్వం ఆ నిబంధనలు సడలించిందని వివరించారు. అనుభవం, వార్షిక టర్నోవర్, పాల సేకరణ తప్పనిసరి.. తదితర నిబంధనలన్నింటినీ తొలగించారన్నారు. అనుభవంలేని ప్రైవేట్ డెయిరీల ప్రవేశానికి నిబంధనల సడలింపు అవకాశం కల్పించిందని చెప్పారు. తక్కువ ధరకే నెయ్యి సరఫరా చేస్తున్నట్లు చెప్పి కల్తీ నెయ్యి పంపిణీ చేశాయని విమర్శించారు.

2024 మార్చిలో టెండర్ ఆహ్వానించగా ఏఆర్ డెయిరీ కిలోకు రూ.319 చొప్పున సరఫరా చేసేందుకు ముందుకొచ్చిందన్నారు. సరైన నాణ్యత పరీక్షలు నిర్వహించకుండానే ఆ సంస్థకు చెందిన నెయ్యి కొనుగోలు చేశారని చెప్పారు. అనంతరం నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపగా.. వనస్పతి, జంతు కొవ్వు కలిశాయని నివేదిక వచ్చిందన్నారు. నెయ్యి సేకరణలో వ్యవస్థాగత లోపాల కారణంగా కల్తీకి అవకాశమిచ్చారని విమర్శించారు. డిజిటల్ రికార్డుల ధ్వంసం, డాక్యుమెంటేషన్ తారుమారు, టెండర్ కేటాయింపులో గోల్‌మాల్ చేసినట్లు ఆధారాలు లభించాయని తెలిపారు. దాంతో కుట్ర, మోసం, ఫోర్జరీ, అవినీతి, సాక్ష్యాలు ధ్వంసం, ఆహార కల్తీ, నేరపూరిత ఉల్లంఘన జరిగిందని సిట్.. తన ఛార్జ్‌షీట్‌లో వెల్లడించిందని మంత్రి ఆనం రెడ్డి తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy