Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
శ్రీవారి రూపాన్ని గీసిన తొలి చిత్రకారుడు కన్నుమూత

శ్రీవారి రూపాన్ని గీసిన తొలి చిత్రకారుడు కన్నుమూత

  • వృద్ధాప్యం, అనారోగ్య సమస్యలతో శ్రీనివాసన్‌ తుదిశ్వాస

చెన్నై, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి చిత్రాన్ని తొలిసారిగా గీసిన ప్రముఖ చిత్రకారుడు శ్రీనివాసన్‌(86) కన్నుమూశారు.

వృద్ధాప్యంతో పాటు స్వల్ప అనారోగ్యంతో బాధపడుతూ తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా కోవిల్‌పట్టిలో ఉన్న స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. 10వ తరగతి వరకు చదువుకున్న శ్రీనివాసన్‌ చిన్ననాటి నుంచే చిత్రలేఖనంపై మక్కువతో దేవతామూర్తులను ఊహించుకుంటూ చిత్రాలు గీసేవారు. ప్రముఖ చిత్రకారుడు కొండయ్య రాజు వద్ద శిష్యరికం చేసి తన కళకు మెరుగులు దిద్దుకున్నారు. 1970ల్లో ఏడుకొండలవాడి విగ్రహాన్ని ప్రత్యక్షంగా చూసి, చిత్రించేందుకు ఔత్సాహికుల నుంచి దరఖాస్తులను కోరగా శ్రీనివాసన్‌ కూడా దరఖాస్తు చేసుకున్నారు.

ఆయన చిత్రలేఖనాన్ని పరిశీలించిన నాటి ఆలయ నిర్వాహకులు ఆయన్ను తిరుమలకు ఆహ్వానించారు. అయితే ఆ సమయంలో అనారోగ్యం కారణంగా ఆయన గర్భగుడిలోకి అడుగు పెట్టలేని పరిస్థితి నెలకొనడంతో.. స్వల్ప దూరం నుంచి గర్భాలయంలోని మూలవిరాట్టుకు ఎదురుగా కూర్చొని చిత్రం గీశారు. ముందుగా ఎలాంటి ఆభరణాలు లేకుండా స్వామి చిత్రాన్ని గీసిన శ్రీనివాసన్‌..

ఆ తరువాత ఆభరణాలంకృతుడైన శ్రీవారి రూపాన్ని అద్భుతంగా మలిచారు. ఆ చిత్రాలకు దేవస్థానం నిర్వాహకులు ఆమోదం తెలపడంతో 'శివకాశి ప్రింటింగ్‌ హౌస్‌' వారు ఫొటోలు, క్యాలెండర్లను ముద్రించారు. వాటికి భక్తకోటి నుంచి విశేష ఆదరణ లభించింది. క్రమంగా అవే విశ్వవ్యాప్తం కావడంతో శ్రీనివాసన్‌కు పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వినియోగిస్తున్న శ్రీవారి చిత్రపటం ఆయన గీసిందే కావడం విశేషం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy