Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సీబీఎస్ఈ లోపాలు ఎత్తిచూపిన యువకుడికి ఐఐటీ కాన్పుర్‌లో జాక్‌పాట్

సీబీఎస్ఈ లోపాలు ఎత్తిచూపిన యువకుడికి ఐఐటీ కాన్పుర్‌లో జాక్‌పాట్

ఇంటర్నెట్ డెస్క్: సాధారణంగా ప్రభుత్వ వెబ్‌సైట్స్ జోలికెళ్లడం నేరంగా భావిస్తారు. నిబంధనలు అతిక్రమిస్తే సంబంధిత అధికారులు చర్యలకూ ఉపక్రమిస్తుంటారు.

కానీ ఓ 19 ఏళ్ల యువకుడు మాత్రం అదేపనితో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సీబీఎస్‌ఈ మార్కుల అప్‌లోడ్‌ పోర్టల్‌లో భద్రతా లోపాలను గుర్తించిన నిసర్గ అధికారి అనే యువకుడు.. దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు, నెటిజన్ల నుంచి ప్రశంసలందుకున్నాడు. అతడి ప్రతిభను గుర్తించిన ఐఐటీ కాన్పుర్.. ఏకంగా ప్రముఖ సైబర్‌ సెక్యూరిటీ, సైబర్ డిఫెన్స్ పరిశోధనా కేంద్రమైన C3iHubలో ఓపెన్‌ సోర్స్‌ ఇంటెలిజెన్స్‌ (OSINT) అండ్ థ్రెట్ ఇంటెలిజెన్స్ ఇంజినీర్‌గా నియమించింది. ఓ సాధారణ సైబర్‌ రీసెర్చర్‌గా జీవితాన్ని ప్రారంభించిన నిసర్గ.. తన అద్భుత ప్రతిభతో దేశంలోని అగ్రశ్రేణి సైబర్‌ సెక్యూరిటీ పరిశోధనా కేంద్రంలో కొలువు సాధించడం విశేషం.

నిసర్గ ఎంపికపై ఐఐటీ కాన్పుర్ డైరెక్టర్ ప్రొఫెసర్ మణీంద్ర అగర్వాల్ మాట్లాడుతూ.. 'నిసర్గ అధికారి.. C3iHubలో OSINT, థ్రెట్ ఇంటెలిజెన్స్ ఇంజినీర్‌గా చేరారు. అతను చిన్న వయసులోనే చెప్పుకోదగిన సాంకేతిక సామర్థ్యాలను ప్రదర్శించిన ప్రతిభావంతుడైన యువ ఇంజినీర్. అతనికి అపారమైన సామర్థ్యం ఉందని, ఐఐటీ కాన్పుర్‌లో పనిచేయడం ద్వారా C3iHubలోని సైబర్‌ సెక్యూరిటీ, థ్రెట్ ఇంటెలిజెన్స్ కార్యక్రమాలకు సహకరిస్తూనే.. తన సామర్థ్యాలను మరింతగా మెరుగుపరుచుకునే అవకాశం లభిస్తుందని మేం విశ్వసిస్తున్నాం. అతని భవిష్యత్తు ప్రయాణానికి మా శుభాకాంక్షలు' అని అన్నారు.

C3iHub అనేది ఐఐటీ కాన్పుర్‌లోని ఓ ప్రత్యేకమైన సైబర్ సెక్యూరిటీ పరిశోధనా కేంద్రం. ఇది పూర్తిగా ఆ యూనివర్శిటీ క్యాంపస్‌లోనే పనిచేస్తుంది. ఇదేం సాధారణ డిపార్ట్‌మెంట్ కాదు.. ప్రత్యేకంగా సైబర్ దాడులు, డేటా భద్రత, హ్యాకింగ్ లాంటి అంశాలపై పరిశోధన చేసే ప్రాజెక్ట్ కేంద్రం. అందులో పనిచేసే నిసర్గ వంటివారు నేరుగా క్లాస్‌లు, టీచింగ్‌లో కాకుండా.. ఈ రీసెర్చ్ బృందంలో ఉంటారు. ప్రభుత్వ, బ్యాంకింగ్, రక్షణ వ్యవస్థల డిజిటల్ భద్రతను మెరుగుపరచడం సహా సైబర్ ముప్పులను ముందే అంచనావేయడం వీరి విధి. సాధారణంగా ఇలాంటి నియామకాలకు సంబంధించి నెలకు సుమారు రూ.50వేల నుంచి రూ.1.2 లక్షల వరకు వేతనం ఉంటుంది. కానీ నిసర్గ లాంటి ప్రత్యేక టాలెంట్ ఉన్నవారికి మాత్రం మెరుగైన ప్యాకేజీ ఉండే అవకాశముంది.

భారతదేశంలోని ప్రముఖ సైబర్ సెక్యూరిటీ పరిశోధనా కేంద్రాలలో ఒకటైన C3iHubలో నిసర్గ నియామకం.. నేటి డిజిటల్‌ ప్రపంచంలో సైబర్‌ దాడులు, డేటా చోరీలు, బెదిరింపులు పెరుగుతున్న నేపథ్యంలో నైపుణ్యం కలిగిన యువ నిపుణులకు పెరుగుతున్న డిమాండ్‌ను ప్రతిబింబిస్తోంది. ప్రభుత్వ పోర్టల్లో లోపాన్ని గుర్తించి బాధ్యతాయుతంగా వెల్లడించిన ఓ యువకుడు.. ఇప్పుడు ఐఐటీ కాన్పుర్‌లో కీలక బాధ్యతలు చేపట్టడం చర్చనీయాంశంగా మారింది.

ఇవీ చదవండి:

ఢిల్లీలో గురు రంధావా జిమ్‌పై కాల్పులు.. తమ పనేనన్న బిష్ణోయ్ గ్యాంగ్!

కేంద్రం గుడ్ న్యూస్.. ఆ పెట్రోల్‌పై ఎక్సైజ్ డ్యూటీ ఎత్తివేత

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy