Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సీబీఎస్ఈ పోర్టల్‌ సమస్యల పరిష్కారానికి

సీబీఎస్ఈ పోర్టల్‌ సమస్యల పరిష్కారానికి

  • ఐఐటీ మద్రాస్‌, ఐఐటీ కాన్పూర్‌ నిపుణులు

న్యూఢిల్లీ, మే 24: సీబీఎస్ఈ పోర్టల్‌లో తలెత్తిన సాంకేతిక సమస్యల పరిష్కారం దిశలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ కీలక ఆదేశాలు జారీ చేశారు.

ఐఐటీ మద్రాస్‌, ఐఐటీ కాన్పూర్‌ సంస్థలకు చెందిన ప్రొఫెసర్లు, సాంకేతిక నిపుణుల బృందాన్ని రంగంలోకి దించాలని సీబీఎస్ఈ బోర్డును ఆదేశించారు. ఈ ఏడాది సీబీఎస్ఈ 12వ తరగతి సమాధాన పత్రాల పునర్మూల్యాంకన ప్రక్రియలో తలెత్తిన సాంకేతిక లోపాలపై విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు రావడంతో విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిపుణుల బృందాలు సీబీఎస్ఈ పోర్టల్‌ స్థిరత్వం, సర్వర్‌ పనితీరు, ఐటీ వంటి అంశాలను పరిశీలిస్తాయి. అలాగే లాగిన్‌ ధ్రువీకరణ, యూజర్‌ యాక్సెస్‌, చెల్లింపుల వ్యవస్థలో ఉన్న లోపాలను సరిచేసేందుకు చేపట్టాల్సిన చర్యలను సూచిస్తాయి.

మరోవైపు మూల్యాంకనం చేసిన సమాధాన పత్రాల స్కాన్‌ కాపీల కోసం విద్యార్థులు దరఖాస్తులు చేసిన సమయంలో సాంకేతిక లోపాల కారణంగా వారి నుంచి అదనంగా వసూలు చేసిన ఫీజును తిరిగి చెల్లించనున్నట్లు సీబీఎస్ఈ ప్రకటించింది. మే 21, 22 తేదీల్లో పోర్టల్‌లో సాంకేతిక లోపాలు తలెత్తి, కొందరు విద్యార్థుల నుంచి నిర్దేశిత రుసుము కంటే ఎక్కువ ఫీజు, మరికొందరి నుంచి తక్కువ ఫీజు వసూలయిందని పేర్కొంది. అదనంగా వసూలైన మొత్తాన్ని వారు చెల్లించిన విధానం (డెబిట్‌కార్డు, క్రెడిట్‌కార్డు, యూపీఐ)లోనే తిరిగి వారి ఖాతాల్లో జమ చేస్తామని సీబీఎస్ఈ స్పష్టం చేసింది. అలాగే దరఖాస్తు గడువును కూడా మే 25 అర్ధరాత్రి వరకు పొడిగించినట్లు తెలిపింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy