Monday, 25 May, 4.16 am ఆంధ్రజ్యోతి

తెలంగాణ తాజావార్తలు
సీడ్‌ బౌల్‌ ఆఫ్‌ ఇండియాగా కరీంనగర్‌ జిల్లా

లాభసాటి పంటలపై రైతులకు అవగాహన కల్పించాలి

జిల్లాలో సాగునీటికి కొరత లేదు...

మంత్రి ఈటల రాజేందర్‌

కరీంనగర్‌, మే 24 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో భూసార పరీక్షలు నిర్వహించి ఎంత విస్తీర్ణంలో పంటలు పండించవచ్చు. ఎలాంటి పంటలు వేస్తే అధిక దిగుబడి వచ్చి ఎక్కువ ఆదాయం వస్తుందనే విషయాలపై రైతులకు అవగాహన కల్పించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అధికారులను ఆదేశించారు. ఆదివారం కరీంనగర్‌ కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో వానాకాలం వ్యవసాయ సమగ్ర ప్రణాళిక రూపకల్పన విధానంపై కరీంనగర్‌, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల వ్యవసాయ శాఖ అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో రాష్ట్ర మంత్రులు ఈటల రాజేందర్‌, గంగుల కమలాకర్‌, కొప్పుల ఈశ్వర్‌ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సమావేశం తర్వాత ఏఏ జిల్లాలో ఏఏ పంటలు పండించాలన్నది వివరంగా వ్యవసాయ అధికారులు జిల్లాలోని భూసార పరీక్షలు నిర్వహించి అందులో ఎంత విస్తీర్ణంలో పంటలు పండించవచ్చని, ఎలాంటి పంటలు వేస్తే ఎక్కువ దిగుబడి వచ్చి రైతులకు ఎక్కువ ఆదాయం సమకూరుతున్నది దానిపై అవగాహనకల్పించాలని ఆయన అన్నారు. ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం ద్వారా అన్ని నియోజకవర్గాల్లో సాగునీటికి ఇబ్బందులు తొలగిపోయాయన్నారు. సాగునీటికి కొరత లేని కరీంనగర్‌ జిల్లా సీడ్‌బౌల్‌ ఆఫ్‌ తెలంగాణయే కాకుండా సీడ్‌ బౌల్‌ ఆఫ్‌ ఇండియాగా చెప్పుకోవచ్చని మంత్రి ఈటెల పేర్కొన్నారు. రైస్‌బౌల్‌ ఆఫ్‌ తెలంగాణగా ఉమ్మడి జిల్లాను చెప్పుకోవచ్చని అన్నారు.

సన్నరకాలతో అధిక లాభాలు

కరీంనగర్‌ జిల్లాలో అత్యధికంగా వరి పంటను పండిస్తున్నారు, వర్షాకాలంలో పంట మార్పు చేసి పత్తిగాని, కంది గాని, పెసర గాని వేయాలన్నారు. వర్షాకాలంలో రైతులు సన్న వడ్లను ఎక్కువ పండించాలని, దీంతో రైతుల ఆదాయం పెరుగుతుందన్నారు. రైతులు పసుపు, సోయాబిన్‌, పసుపులో మక్క అంతర పంట పండించడం వల్ల రైతులకు ఎక్కువ ఆదాయం వస్తుందన్నారు.

అధికారులు సమన్వయంతో పని చేయాలి.. మంత్రి కొపుల ఈశ్వర్‌

మంత్రి కొప్పుల ఈశ్వర్‌ మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి జిల్లాలో ప్రతి ప్రాంతానికి సాగునీరు అందుబాటులోకి వచ్చిందన్నారు. కొన్నిగ్రామాల్లో చెరువులకు నీటి వసతి కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యమంత్రి సూచనల ప్రకారం ఏఈ నుంచి డీఈ జిల్లా అధికారులు అందరు కలిసి అన్ని ప్రాంతాలకు అన్నిచెరువులకు నీరు చేరే విధంగా ఏర్పాటు చేయాలని అన్నారు. ఉమ్మడి జిల్లాలో నీరు చేరని ప్రదేశాలను గుర్తించి రైతు సంఘాల నాయకులు, రాజకీయ ప్రతినిధులు సర్పంచ్‌లను సంప్రదించి నీరుచేరే విధంగా ఇంజనీరింగ్‌ అధికారులు కృషిచేయాలన్నారు. ఇందుకు ముఖ్యమంత్రి మొదటి విడతలో వంద కోట్ల రూపాయలను ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు కేటాయించారని తెలిపారు. శాసనసభ్యులతో చర్చించి జిల్లాలకు సంబంధించిన పెండింగ్‌ పనులు ఏమైనా ఉంటే పూర్తి చేయించుకోవాలని తెలిపారు.

డిమాండ్‌ ఉన్న పంటలు సాగు చేయాలి. మంత్రి గంగుల కమలాకర్‌

మంత్రి గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ రాబోయే కాలంలో డిమాండ్‌ ఉన్న పంటలు వేయడం వల్ల రైతులకు గిట్టుబాటుధర వస్తుందన్నారు. ఆధునిక విధానాలతో రైతులు పంటలు పండిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం దొడ్డురకం వరిధాన్యం ఏ గ్రేడ్‌లో, సన్నరకాల వరి ధాన్యం బి గ్రేడ్‌లో ఉందన్నారు. ఏ గ్రేడ్‌ వరిధాన్యం ఉత్పత్తి పెరిగి గోదాములు నిండిపోయాయన్నారు. మన రాష్ట్రంలో ఆయిల్‌ పంటలు లేకపోవడం వల్ల ఇతర దేశాలనుంచి దిగుమతి చేసుకుంటున్నామని ఆయన తెలిపారు.

నియంత్రత వ్యవసాయ విధానం ద్వారా అన్ని రకాల పంటలు పండించాలన్నారు. సమావేశంలో పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్‌, ఎమ్మెల్సీలు భానుప్రసాద్‌, నారదాసు లక్ష్మన్‌రావు, జీవన్‌రెడ్డి, జడ్పీచైర్మన్లు కనుమల్ల విజయ, పుట్ట మధుకర్‌, వసంత, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్‌, సుంకె రవిశంకర్‌ సతీష్‌బాబు, కోరుగంటి చందర్‌, దాసరి మనోహర్‌రెడ్డి, సంజయ్‌కుమార్‌, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, జిల్లాల కలెక్టర్లు కె శశాంక, సిక్తా పట్నాయక్‌, రవి, నగర మేయర్‌ సునీల్‌రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఏనుగు రవీందర్‌రెడ్డి, రవీందర్‌సింగ్‌, ఎస్సారెస్సీ సీఈ శంకర్‌, వ్యవసాయ శాఖాధికారులు, ఏడీలు, తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy
Top
// // // // $find_pos = strpos(SERVER_PROTOCOL, "https"); $comUrlSeg = ($find_pos !== false ? "s" : ""); ?>