Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సీజనల్ వ్యాధులను తేలికగా తీసుకోవద్దు: మంత్రి దామోదర రాజనర్సింహ

సీజనల్ వ్యాధులను తేలికగా తీసుకోవద్దు: మంత్రి దామోదర రాజనర్సింహ

హైదరాబాద్, ఆగస్టు 29: సీజనల్ వ్యాధులపై మంత్రి దామోదర్ రాజనర్సింహ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈరోజు(శనివారం) రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రంలో సీజన్ వ్యాధుల పరిస్థితిపై ఆరోగ్య శాఖ అధికారులతో చర్చించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. డెంగ్యూ, మలేరియా, చికన్‌గున్యా కేసులు తగ్గుముఖం పట్టాయన్నారు. గతేడాదితో పోలిస్తే డయేరియా, డిసెంట్రీ కేసులు కూడా తక్కువగా నమోదు అయినట్లు తెలిపారు. టైఫాయిడ్ కేసులు స్వల్పంగా పెరిగాయన్నారు. కేసులు పెరుగుతున్న జిల్లాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని మంత్రి ఆదేశించారు. ఫీవర్ సర్వేలను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు.

ప్రతి జ్వరం కేసును పర్యవేక్షించి.. అవసరమైన పరీక్షలు, చికిత్స అందించాలని మంత్రి తెలిపారు. ప్రభుత్వ హాస్పిటళ్లలో మందులు, టెస్టింగ్ కిట్లు అందుబాటులో ఉంచాలన్నారు. ఐఎల్‌ఐ, స్వైన్‌ఫ్లూ కేసులపై అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఐఎల్‌ఐ కేసులపై రోజువారీగా పర్యవేక్షించాలని రాజనర్సింహ తెలిపారు. అయితే, ప్రస్తుతం రాష్ట్రంలో సీజనల్ ఇన్‌ఫ్లూయెంజా పూర్తిగా నియంత్రణలోనే ఉందని మంత్రికి అధికారులు వివరించారు.

దోమల నివారణ చర్యలను మరింత ముమ్మరం చేయాలని దామోదర రాజనర్సింహ ఆదేశాలు జారీ చేశారు. ప్రతి శుక్రవారం 'డ్రై డే' కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలన్నారు. నిల్వ నీటి తొలగింపు, లార్వా నిర్మూలన, ఫాగింగ్ కొనసాగించాలని సూచించారు. గ్రామాలు, పట్టణాలు, పాఠశాలలు, హాస్టళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రజారోగ్య పరిరక్షణే ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యమని స్పష్టం చేశారు. వ్యాధులు వచ్చిన తర్వాత చికిత్స కంటే.. ముందస్తు నివారణే లక్ష్యమన్నారు. ప్రతి జిల్లాలో ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లు అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు. సీజనల్ వ్యాధుల కేసులను ఏమాత్రం తేలికగా తీసుకోవద్దని మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలు జారీ చేశారు.


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy