Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్‌తో సీఎం చంద్రబాబు భేటీ.. ఏపీ అభివృద్ధిపై చర్చ

సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్‌తో సీఎం చంద్రబాబు భేటీ.. ఏపీ అభివృద్ధిపై చర్చ

ఇంటర్నెట్ డెస్క్, జూన్ 15 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్‌ ( PM Lawrence Wong )తో ఈరోజు (సోమవారం) మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు.

సింగపూర్ ప్రధాని అధికారిక నివాసంలో సుమారు 30 నిమిషాల పాటు జరిగిన ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, పెట్టుబడులు, సాంకేతిక రంగ సహకారం, మౌలిక సదుపాయాల విస్తరణ వంటి కీలక అంశాలపై చర్చించారు.

ఆ అంశాల్లో సింగపూర్ మద్దతు అవసరం

ఏపీ అభివృద్ధికి అవసరమైన టెక్నాలజీ, సెమీకండక్టర్లు, క్వాంటం కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగాల్లో సహకారం అందించాలని సీఎం చంద్రబాబు సింగపూర్ ప్రధానిని కోరారు. ముఖ్యంగా సెమీకండక్టర్ తయారీ ఎకోసిస్టమ్ అభివృద్ధి, నైపుణ్యాల పెంపు (కెపాసిటీ బిల్డింగ్) అంశాల్లో సింగపూర్ మద్దతు అవసరమని వివరించారు. అమరావతి సహా రాష్ట్రంలోని వివిధ నగరాలు, పట్టణాల్లో అర్బన్ గవర్నెన్స్, నగర ప్రణాళిక, ఆధునిక మౌలిక సదుపాయాల కల్పనలో భాగస్వామ్యం కావాలని సీఎం కోరారు. ఈ సందర్భంగా అమరావతి రాజధాని నిర్మాణ పనుల పురోగతిపై సింగపూర్ ప్రధాని ప్రత్యేక ఆసక్తి చూపించారు. విద్యాసంస్థలు, అంతర్జాతీయ ప్రమాణాలతో చేపడుతున్న మౌలిక సదుపాయాల నిర్మాణాల గురించి లారెన్స్ వాంగ్ వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఏపీలో ప్రకృతి సేద్యం ద్వారా వ్యవసాయం..

భవిష్యత్తులో అమరావతి ప్రపంచ స్థాయి నివాసయోగ్య నగరాల సరసన నిలుస్తుందని సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో ప్రజారోగ్య రంగం అభివృద్ధి, జనాభా నిర్వహణకు సంబంధించిన చర్యలను కూడా వివరించారు. వ్యవసాయ రంగంపై కూడా ఇరువురు నేతల మధ్య చర్చ జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రకృతి సేద్యం ద్వారా వ్యవసాయం చేస్తున్న విషయాన్ని సీఎం ప్రస్తావించారు. రాష్ట్రంలోని ఉద్యానవన, ఆక్వా ఉత్పత్తులను సింగపూర్ దిగుమతి చేసుకునే అవకాశాలను పరిశీలించాలని కోరారు. ప్రకృతి సేద్యం ఉత్పత్తులకు అంతర్జాతీయ ప్రమాణాల సర్టిఫికేషన్, ట్రేసబిలిటీ వ్యవస్థలను ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వివరించారు.

ఏపీ - సింగపూర్ కలిసి పనిచేయాలి..

పోర్టులు, ఎయిర్‌పోర్టుల అభివృద్ధితో పాటు వాణిజ్య, పారిశ్రామిక అవకాశాలను మరింత విస్తరించేందుకు ఆంధ్రప్రదేశ్, సింగపూర్ కలిసి పనిచేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. రాష్ట్రం 160 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యంతో ముందుకు సాగుతోందని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా జనాభా తగ్గుదల, అందుబాటు గృహ నిర్మాణం, శిశువులు, చిన్నారుల సంరక్షణ వంటి సామాజిక అంశాలపై కూడా ఇరువురు నేతలు అభిప్రాయాలు పంచుకున్నారు. సేవల రంగం తరహాలోనే తయారీ, సరఫరా గొలుసు (సప్లై చైన్) రంగాలు కూడా భారత్‌లో వేగంగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయని ఇద్దరు నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ భేటీ ద్వారా ఆంధ్రప్రదేశ్-సింగపూర్ సంబంధాలు మరింత బలోపేతం కావడంతో పాటు పెట్టుబడులు, సాంకేతిక సహకారం, పట్టణాభివృద్ధి, వ్యవసాయ ఎగుమతుల రంగాల్లో కొత్త అవకాశాలు ఏర్పడే అవకాశం ఉందని ఇరువురు నేతలు భావిస్తున్నారు.

.

సింగపూర్‌లో సీఎం చంద్రబాబుకు గ్రాండ్ వెల్‌కమ్.. ఎన్ఆర్ఐల స్వాగతం

ఐదేళ్లు తాడేపల్లి ప్యాలెస్‌లో గొడ్డలి పార్టీ అధ్యక్షుడు మొద్దు నిద్రపోయారు: మంత్రి నిమ్మల

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy