చెన్నై: సీపీఐ వెటరన్ నేత డి.పాండియన్ సుదీర్ఘ అస్వస్థతతో శుక్రవారంనాడు రాజీవ్ గాంధీ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన వయస్సు 89 సంవత్సరాలు. కొంతకాలంగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న ఆయన తరచు హెమోడయాలసిస్ చేయించుకుంటున్నారు. రక్తంలో షుగర్ స్థాయి బాగా పడిపోవడంతో స్పృహతప్పిన ఆయనను గురువారం రాత్రి ఆసుపత్రిలో చేర్చారు. పరిస్థితి తీవ్రంగా ఉండటంతో వెండిలేటర్ సపోర్ట్‌తో వైద్యులు చికిత్స అందిచగా, ఉదయం 10.15 గంటల సమయంలో ఆయన తుదిశ్వాస విడిచినట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
అన్నాడీఎంకే నేత, మాజీ సీఎం దివంగత జె.జయలలితకు అత్యంత సన్నిహితంగా పాండియన్ ఉండేవారు. సీపీఐ తమిళనాడు విభాగం అధ్యక్షుడిగా మూడు సార్లు పనిచేశారు.
పాండియన్ మృతి పట్ల పార్టీలకు అతీతంగా నేతలు సంతాపం తెలిపారు. డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఆర్.ముత్తురసన్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి కె.బాలకృష్ణన్, కాంగ్రెస్ నేత పీటర్ ఆల్ఫోన్స్, టీఎన్‌సీసీ అధ్యక్షుడు కేఎస్ అళగిరి, అన్నాడీఎంకే డిప్యూటీ కోఆర్డినేటర్ కేపీ మునుస్వామి, వీసీకే నేత టి.తిరుమావలవన్, ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైకో, తదితరులు సంతాపం తెలిపారు. పాండియన్ మృతి రాష్ట్రానికి తీరనిలోటని తమ సంతాప సందేశాల్లో పేర్కొన్నారు.

