న్యూఢిల్లీ : ఓ వైపు కరోనా సెకండ్ వేవ్... మరో వైపు భారీగా పెరుగుతున్న కేసులు, ఇంకో వైపు వ్యాక్సిన్ కొరత అంటూ విమర్శలు... ఈ నేపథ్యంలో ప్రజలకు ఊరట కలిగించే అంశం ఒకటి వచ్చింది. భారత్‌లో మరో వ్యాక్సిన్‌కు అనుమతి లభించింది. రష్యా అభివృద్ధి చేసిన 'స్పుత్నిక్-వి' వ్యాక్సిన్ అత్యవసర వినియోగం కోసం నిపుణుల కమిటీ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. త్వరలోనే టీకా ఉత్పత్తి చేసి, వినియోగంలోకి తీసుకురానున్నారు. డీజీసీఐ అనుమతి లభిస్తే మాత్రం మూడో వ్యాక్సిన్‌గా స్పుత్నిక్ నిలుస్తుంది. ఇప్పటికే కొవాగ్జిన్, కోవిషీల్డ్ అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాల్సిందిగా డాక్టర్ రెడ్డీస్ దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే.

