Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
స్థానిక ఎన్నికల ఫలితాలను వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.. మంత్రి ఆనం ధ్వజం

స్థానిక ఎన్నికల ఫలితాలను వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.. మంత్రి ఆనం ధ్వజం

నెల్లూరు, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలను వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి (AP Minister Anam Ramnarayana Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆత్మకూరు ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికల్లో అద్భుతమైన విజయాన్నికూటమికి అందించారని వ్యాఖ్యానించారు. ఈరోజు (సోమవారం) నెల్లూరులో మంత్రి ఆనం పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రెండున్నరేళ్లలో గతంలో ఎన్నడూ లేనంతగా సంక్షేమం, అభివృద్ధి పనులు తమ హయాంలో జరిగాయని పేర్కొన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల కంటే, ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లోనూ కూటమి పార్టీలకు మెజార్టీ పెరిగిందని చెప్పుకొచ్చారు.

మేకపాటి సొంతూరులోనూ టీడీపీ విజయం

మేకపాటి సొంతూరులోనూ టీడీపీ విజయం సాధించిందని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రస్తావించారు. దానిని బట్టి ఎంత ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయో అర్ధమవుతోందని అన్నారు. రాజకీయాల్లోకి కార్పొరేట్ శక్తులు వచ్చాయిని చెప్పారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పుడు బాధపడలేదని, ప్రజానిర్ణయాన్ని గౌరవంగా స్వీకరించామని తెలిపారు. వైసీపీ నేతలకు ప్రజాస్వామ్య వ్యవస్థపై గౌరవం లేదని మండిపడ్డారు. జగన్ హయాంలో ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచారని ధ్వజమెత్తారు. మాజీ ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి తమపై, అధికారులపై, పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆగ్రహించారు. ప్రజాస్వామ్య వ్యవస్థ గురించి ముందు వైసీపీ నేతలు తెలుసుకోవాలని హితవు పలికారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని తమ గురించి వైసీపీ నేతలు మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. మేకపాటి కుటుంబానిది ఎప్పుడూ హత్యలు, మానభంగాలు, నాటుబాంబులు, దాడుల సంస్కృతే అని వ్యంగ్యంగా మాట్లాడారు.

విక్రమ్ రెడ్డిపై కేసు పెట్టడానికి సిద్ధం..

విక్రమ్ రెడ్డి 'మర్డర్ ఆఫ్ డెమోక్రసీ' అంటూ తమపై చేసిన వ్యాఖ్యలు ఖండిస్తున్నామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు న్యాయవాదులతో చర్చిస్తామని తెలిపారు. రాజ్యాంగాన్ని అగౌరవ పరిచినందుకు ఆయనపై కేసు పెట్టడానికి తాను సిద్ధమని సవాల్ చేశారు. విక్రమ్ రెడ్డి... సమాజానికి, ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆయనపై చర్యలు తీసుకోమని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతామని అన్నారు. జగన్ అండ్ కో చొక్కాలు మడతపెట్టడాలు ఇక అయిపోయాయని.. ప్రజల తీర్పును స్వీకరించే పరిస్థితిలో వారు లేరని ఎద్దేవా చేశారు. కాబట్టే 99 స్ట్రైక్ రేట్‌తో కూటమి పార్టీల అభ్యర్థులు విజయం సాధించారని వ్యాఖ్యానించారు.

మేకపాటి కుటుంబమే బాంబుల సంస్కృతి తెచ్చింది..

మేకపాటి కుటుంబమే బాంబుల సంస్కృతి తెచ్చిందని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మండిపడ్డారు. శింగనపల్లి పంచాయతీ దోర్నాల పోలీస్ స్టేషన్‌ను దొమ్మిచేసి, అధికారులపై దాడులు చేశారని దుయ్యబట్టారు. మాగుంట అనుచరులు, నేతలపై కత్తులతో దాడులు చేసింది మీరు కాదా? అని ప్రశ్నించారు. మేకపాటి కుటుంబం జాతీయ రహదారి నిర్మాణ పనులు పూర్తికాకుండానే రూ.102.44కోట్లు వసూలు చేసిందని ఆరోపించారు. NHAI ఫిర్యాదు చేస్తే, కేరళలో ఈడీ అధికారులు కేసు పెట్టారని.. వారి అకౌంట్లు సీజ్ చేశారని ప్రస్తావించారు. పొదలకూరు పోలీస్ స్టేషన్‌లో మేకపాటిపై సీఐ కేసు పెట్టారని అన్నారు. వాళ్ల కుటుంబ సభ్యుల పేర్లు, ఫొటోలు మార్చి ఫేక్ డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్లు చేసుకున్నారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy