Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సునేత్రపై పవార్‌పై 'గంగీ గుడియా' వ్యాఖ్యలు.. 'మహా' రాజీయాల్లో దుమారం!

సునేత్రపై పవార్‌పై 'గంగీ గుడియా' వ్యాఖ్యలు.. 'మహా' రాజీయాల్లో దుమారం!

ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్ర రాజకీయం మరోసారి వేడెక్కింది. ఉప ముఖ్యమంత్రి సునేత్రా పవార్‌ను 'గంగీ గుడియా(మూగ బొమ్మ)' అని కాంగ్రెస్ అభివర్ణించడంతో తీవ్ర వివాదం చెలరేగింది.

దీనిపై అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీ తీవ్రంగా స్పందించింది. మహిళలను అవమానిస్తూ, రాజకీయాలను మరింత దిగజార్చారని కాంగ్రెస్‌పై మండిపడింది.

సునేత్రా పవార్ ఇటీవల నిర్వహించిన ఓ మీడియా సమావేశం, బీడ్ పర్యటనలను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ విమర్శలకు దిగింది. ఆమె ఇంకెంతకాలం 'గంగీ గుడియా'గా కొనసాగుతారని ప్రశ్నించింది. బహిరంగ సభల్లో కీలక అంశాలపై ఆమె మౌనంగా ఉండటాన్ని తప్పుబడుతూ ఈ వ్యాఖ్యలు చేసింది. అయితే.. అధికార మహాయూతి కూటమిలో భాగస్వామి అయిన అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీ నాయకులు దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ ఒకప్పుడు ఓ ప్రత్యేకమైన రాజకీయ సంస్కృతిని కలిగిఉండేదని, ప్రజా వేదికలపై కొన్ని ప్రమాణాలను పాటించేదని.. కానీ ఇప్పుడు ఆ సిద్ధాంతాలు, విలువలకు దూరమైందన్నారు. ఓ మహిళా నేతపై అలాంటి భాషను ఉపయోగించి మహిళలను కాంగ్రెస్ అగౌరవపరిచిందని ఆరోపించారు. ఈ వాగ్వాదంతో కాంగ్రెస్, ఎన్‌సీపీ మధ్య రాజకీయ ఘర్షణ మరింత ముదిరినట్టైంది.

మరోవైపు.. కాంగ్రెస్ చేసిన ఆ వ్యాఖ్యలకు ఎన్‌సీపీ(శరద్ పవార్ వర్గం) ఎమ్మెల్యే రోహిత్ పవార్ మద్దతు పలికారు. అందులోని పదాలకంటే అది వెలువడిన సందర్భమే ముఖ్యమని చెబుతూ కాంగ్రెస్ వైఖరిని పరోక్షంగా సమర్థించారు. సునేత్రా పవార్ ఇటీవల నిర్వహించిన ఓ మీడియా సమావేశాన్ని ప్రస్తావిస్తూ.. విలేకరి అడిగిన ఓ ప్రశ్నకు ఆమె సమాధానమిస్తుండగా, మంత్రి ధనంజయ్ ముండే కలుగజేసుకుని నోరుమూయించారని రోహిత్ అన్నారు. ఒకవేళ అక్కడ అజిత్ పవారే ఉండుంటే.. ముండేను జోక్యాన్ని అడ్డుకునేవారని చెప్పుకొచ్చారు. 'ఒకరిని 'గంగీ గుడియా' అని పిలవడాన్ని సానుకూలంగానూ చూడొచ్చు, ప్రతికూలంగానూ చూడొచ్చు. ఎందుకంటే మాజీ ప్రధాని ఇందిరాగాంధీని కూడా ఒకప్పుడు అచ్చం ఇలాగే పిలిచారు. కానీ.. ఆ తర్వాత ఆమె తనదైన నాయకత్వ శైలిలో తనను తాను నిరూపించుకున్నారు' అని రోహిత్ వివరించారు. కాగా.. ఎన్‌సీపీ వర్గాలు రెండూ విలీనమవుతున్నాయంటూ ఇటీవల చర్చలు ఊపందుకుంటున్న తరుణంలో ఈ వివాదం తెరపైకి రావడం గమనార్హం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy