Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సూర్యుడు.. మేడిన్‌ చైనా!

సూర్యుడు.. మేడిన్‌ చైనా!

  • 582 టన్నుల మ్యాగ్నెట్‌ను పరీక్షించిన డ్రాగన్‌

  • స్వచ్ఛమైన, అపరిమితమైన విద్యుత్‌ ఉత్పత్తే లక్ష్యం

  • చైనా నిర్మించిన ఫ్యూజన్‌ రియాక్టర్‌ మాగ్నెట్‌

న్యూఢిల్లీ, జూలై 28: సమస్త జీవకోటికి సూర్యుడే ప్రాణాధారం.

టెక్నాలజీలో దూసుకుపోతున్న చైనా... ఆ సూర్యుడినే కృత్రిమంగా సృష్టించి ఈ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే దిశగా అడుగులు వేస్తోంది..! దీనికోసం ఆ దేశ శాస్త్రవేత్తలు 582 టన్నుల బరువుతో ప్రపంచంలోనే అతిపెద్ద సూపర్‌కండక్టింగ్‌ ఫ్యూజన్‌ అయస్కాంతాన్ని తయారుచేసి దాన్ని విజయవంతంగా పరీక్షించారు. అణు సంలీనం(న్యూక్లియర్‌ ఫ్యూజన్‌) ప్రక్రియ ద్వారా భూమిపైనే స్వచ్ఛమైన, అపరిమితమైన శక్తిని ఉత్పత్తి చేసే లక్ష్యంతో ఈ భారీ ప్రాజెక్టును రూపొందిస్తున్నారు. 2030 నాటికి ఫ్యూజన్‌ శక్తి ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలన్న చైనా ప్రతిష్ఠాత్మక ప్రణాళికలో ఈ విజయం ముఖ్యమైన మైలురాయిగా భావిస్తున్నారు. చైనీస్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ ఆధ్వర్యంలోని ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాస్మా ఫిజిక్స్‌ అభివృద్ధి చేసిన, కొత్తగా ఆమోదం పొందిన ఈ టోరాయిడల్‌ ఫీల్డ్‌ సూపర్‌కండక్టింగ్‌ మ్యాగ్నెట్‌.. 21 మీటర్ల పొడవు, 21 మీటర్ల వెడల్పు, 582 టన్నుల బరువు ఉంటుంది. ఇంగ్లీషు అక్షరం 'డి' ఆకారంలో దీన్ని తయారుచేశారు.

ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా నిర్మించిన అతిపెద్ద ఫ్యూజన్‌ రియాక్టర్‌ సూపర్‌కండక్టింగ్‌ అయస్కాంతం ఇదేనని పరిశోధకులు చెబుతున్నారు. అణు సంలీన ప్రక్రియలో భాగంగా... 10 కోట్ల డిగ్రీల కంటే అధిక ఉష్ణోగ్రత కలిగిన ప్లాస్మాను సృష్టిస్తారు. ఈ అత్యధిక ఉష్ణోగ్రత రియాక్టర్‌ గోడలకు తగలకుండా.. శక్తివంతమైన అయస్కాంత క్షేత్రంలో బంధించడం ఈ భారీ అయస్కాంతం పని. అందుకే ఈ భారీ మ్యాగ్నెట్‌తోపాటు అధిక ఉష్ణోగ్రత సూపర్‌కండక్టింగ్‌ సెంట్రల్‌ సోలెనాయిడ్‌ కాయిల్‌ను కూడా చైనా శాస్త్రవేత్తలు పరీక్షించారు. 2027 నాటికి ప్రయోగాత్మక రియాక్టర్‌ను పూర్తిచేసి.. 2030నాటికి అణు సంలీనం ద్వారా వాణిజ్య పరంగా విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంది.

కృత్రిమ సూర్యుడు అంటే..?

కృత్రిమ సూర్యుడు అనేది.. ఒక అణు సంలీన రియాక్టర్‌ (న్యూక్లియర్‌ ఫ్యూజన్‌ రియాక్టర్‌). ఇది సూర్యుడికి శక్తినిచ్చే ప్రక్రియనే తిరిగి సృష్టిస్తుంది. ఇది 10 వేల కోట్ల డిగ్రీల సెల్సియస్‌ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద హైడ్రోజన్‌ పరమాణువులను సంలీనం చేసి, కర్బన రహిత విద్యుత్‌ ఉత్పత్తికి మార్గం సుగమం చేస్తుంది. భవిష్యత్తులో ఇది అపరిమితమైన, స్వచ్ఛమైన, సురక్షితమైన విద్యుత్‌ వనరును అందిస్తుందని చైనా శాస్త్రవేత్తలు ఆశిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy