Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
స్వాతంత్య్ర సమరయోధుడు  ఏటుకూరి కృష్ణమూర్తి ఇకలేరు

స్వాతంత్య్ర సమరయోధుడు ఏటుకూరి కృష్ణమూర్తి ఇకలేరు

  • జాతీయోద్యమంలో జైలుకెళ్లిన యోధుడు

  • మగ్దూం భవన్‌లో కృష్ణమూర్తి

  • భౌతిక కాయానికి నివాళులు అర్పించిన నారాయణ, నెల్లికంటి సత్యం, చాడా

  • జూబ్లీహిల్స్‌లో ముగిసిన అంత్యక్రియలు

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు21(ఆంధ్రజ్యోతి): స్వాతంత్య్ర సమరయోధుడు, భారత కమ్యూనిస్టు పార్టీ నాయకుడు, ఏటుకూరి కృష్ణమూర్తి (104) ఇకలేరు. కొన్నాళ్లుగా శ్వాస కోశ సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయన ఈ నెల18న నగరంలోని ఓ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ ఆదివారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. హిమాయత్‌నగర్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం మగ్దూం భవనంలో బంధుమిత్రులు సందర్శనార్థం సోమవారం ఉదయం కృష్ణమూర్తి భౌతికకాయాన్ని ఉంచారు. సీపీఐ నేతలు నారాయణ, చాడా వెంకటరెడ్డి, పల్లా వెంకటరెడ్డి, పశ్య పద్మ, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం తదితరులు నివాళులు అర్పించారు. అనంతరం జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలో కృష్ణమూర్తి అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఆయన సొంతూరు ఏపీలోని గుంటూరు జిల్లా ఏటుకూరు. ప్రముఖ చరిత్ర రచయిత ఏటుకూరి బలరామమూర్తి పెద్ద తమ్ముడు కృష్ణమూర్తి. గుంటూరు టౌన్‌ హైస్కూల్లో చదువుతున్న రోజుల్లో క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. లాలాపేట పోలీసు స్టేషన్‌మీద జాతీయ జెండా ఆవిష్కరించిన బృందంలో ఒకడిగా స్థానిక సబ్‌జైల్లో నెలరోజులు ఖైదులో ఉన్నారు. బ్రిటీషు ఆర్మీలో సైనికుడిగా చేరిన కృష్ణమూర్తి రాయల్‌ ఇండియన్‌ నావికాదళ తిరుగుబాటుకు మద్దతుగా లఖ్‌నవూలో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా నిరసనలో పాల్గొన్నాడు. అందుకుగాను లాహోర్‌జైల్లో 8నెలలు శిక్ష అనుభవించారు. ఏపీలోని కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో 1948లో రెవెన్యూ క్లర్కుగా ఉద్యోగంలో చేరి, 1978సెప్టెంబరులో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా ఉద్యోగ విరమణ చేశారు. ఉమ్మడి ఏపీలో 50ఏళ్లుగా ప్రభుత్వ పెన్షన్‌ తీసుకుంటున్న ఏకైక వ్యక్తిగా కృష్ణమూర్తి నిలిచారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం వ్యవస్థాపకుల్లో కృష్ణమూర్తి ఒకరు. ఆంధ్రప్రదేశ్‌ స్వాతంత్య్ర సమరయోధుల సంస్థ ప్రధాన కార్యదర్శిగా సేవలందించారు.

ఏపీలోని బాపట్ల తాలూకా స్వాతంత్య్ర సమరయోధుల సంగ్రహ పరిచయం, గుంటూరు జిల్లా కమ్యూనిస్టు ఉద్యమ వైతాళికులు, భారత స్వాతంత్ర్యోద్యమంలో మా ఊరు, చిన్ననాటి జ్ఞాపకాలు - చెరిగిపోని అనుభవాలు తదితర పుస్తకాలు 15కుపైగా రాశారు. తద్వారా జాతీయోద్యమ స్థానిక చరిత్రను అక్షరబద్ధం చేశారు. ఇండో సోవియట్‌ కల్చరల్‌ సొసైటీ, ప్రపంచ శాంతి సంఘంలోనూ ఏపీ కార్యదర్శిగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఏటుకూరి కృష్ణమూర్తి భార్య శేషమ్మ2002లో కన్నుమూశారు. వీరికి నలుగురు సంతానం. కుమార్తెలు స్వతంత్ర, ఉషారాణి, కుమారులు శ్రీనివాసమూర్తి, భరద్వాజ. అక్టోబరు1వ తేదీన నగరంలో కృష్ణమూర్తి సంస్మరణ సభ నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy