Friday, 23 Apr, 1.46 am ఆంధ్రజ్యోతి

అమరావతి
తాళికట్టు శుభవేళ..కరోనా బీభత్సం

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి): మియాపూర్‌కు చెందిన రవికుమార్‌ తన కూతురు వివాహ నిశ్చితార్థాన్ని గత జనవరిలో నిర్వహించాడు. పెళ్లిని మే నెల 13న మియాపూర్‌లోని ఓ పెద్ద ఫంక్షన్‌హాల్లో జరిపించేందుకు నిర్ణయించాడు. ఫంక్షన్‌హాల్‌ ఖర్చు రూ.2 లక్షల్లో అడ్వాన్స్‌గా రూ.లక్ష ఇచ్చేశాడు. బంగారు ఆభరణాలు, ఇతర వస్తువులనూ కొన్నాడు. అయితే ప్రస్తుతం హైదరాబాద్‌లో కరోనా మహమ్మారి వ్యాప్తితో రవి కుమార్‌ ప్రణాళిక అంతా తలకిందులైంది. పెళ్లికి వచ్చే బంధుమిత్రులు ఇబ్బందులు పడతారేమోననే భావనతో ఆయన వివాహ వేదికను వరంగల్‌ అర్బన్‌ జిల్లాలోని స్వగ్రామమైనమల్లారానికి మార్చారు. ఈ మేరకు బంధువులకు సమాచారం చేరవేస్తున్నాడు.

రాంనగర్‌కు చెందిన రేషం మల్లేశం.. శుభకార్యాలకు డెకరేషన్‌ చేయిస్తుంటాడు. ఏప్రిల్‌ 24 నుంచి 29 వరకు జరిగే 20 పెళ్లిళ్లకు సంబంధించి ఆయనకు రెండు నెలల క్రితం ఆర్డర్లు వచ్చాయి. బెంగళూరు నుంచి పూలు తెప్పించి సిబ్బందితో పనులు చేయించేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు. నగరంలో కొవిడ్‌ కేసులు పెరగడంతోపాటు నైట్‌ కర్ఫ్యూ అమల్లోకి రావడంతో 20 ఆర్డర్లలో 10 క్యాన్సిల్‌ అయ్యాయి. వారంతా అడ్వాన్స్‌ తిరిగిచ్చేయాలని మల్లేశంపై ఒత్తిడి చేస్తున్నారు!

..ఇలా ప్రస్తుతం ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు. శుభకార్యాలు పెట్టుకున్న కుటుంబాలు, అడ్వాన్సులు తీసేసుకొని ఆ ఏర్పాట్లలో మునిగి ఉన్న నిర్వాహకులను ఇప్పుడు కరోనా కంగారెత్తిస్తోంది. వందల మంది అతిథుల మధ్య అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించి.. వేడుకను చిరస్మరణీయం చేసుకోవాలని కలలుకన్న వారి ఆశలు కల్లలవుతున్నాయి. కొందరు పెళ్లిళ్లను వాయిదా వేసుకుంటుంటే.. ఇంకొందరు మంచి ముహూర్తం మళ్లీ రాదనే భావనతో అతిథుల సంఖ్యను 100లోపునకు కుదించైనా వేడుకను జరిపేందుకే మొగ్గు చూపుతున్నారు.

మే 6 మంచి ముహూర్తాలు..

ఏప్రిల్‌ 24 నుంచి 29 వరకు రెండు, మూడు మంచి ముహుర్తాలున్నాయి. ఎక్కువగా మే 6, 14, 22, 23, 26, 28, 30 వరకు మంచి ముహూర్తాలు ఉన్నాయి. మే 22న గొప్ప ముహూర్తం ఉండటంతో నగరంలో ఒకే రోజు దాదాపు 50వేల పెళ్లిళ్లు జరుగుతాయని అంచనా వేస్తున్నారు. జూన్‌, జూలైలో కూడా ముహూర్తాలున్నాయి. ఈ నెలన్నర రోజుల్లో నగరంలో దాదాపు 1.3 లక్షల పెళ్లిళ్లు జరుగుతాయని అంచనా వేశారు. దీంతో గ్రేటర్‌ పరిధిలో చాలామంది తమ ఇళ్లలో పెళ్లిళ్లు జరిపించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.

ఫంక్షన్‌ హాల్‌ యజమానులపై ఒత్తిడి..

మే నెలలో మంచి ముహూర్తాలను చూసుకుని పెళ్లి ఏర్పాట్లను చేసుకుంటున్న వారు కరోనా కారణంగా ప్రస్తుతం ఫంక్షన్‌ హాల్‌ యజమానులపై ఒత్తిడి చేస్తున్నారు. అడ్వాన్స్‌ను తిరిగి చెల్లించాలని కోరుతున్నారు. ఇక రాత్రిళ్లు బుకింగ్‌ చేసుకొన్న ఫంక్షన్స్‌ను నైట్‌ కర్ఫ్యూ నేపథ్యంలో మధ్యాహ్నానికి మార్చుకుంటున్నారు. కూకట్‌పల్లిలోని ఓ కుటుంబం కర్ణాటకలో పెళ్లి చేసుకుని ఇక్కడ రిసెప్షన్‌ చేసుకొనేందుకు ఫంక్షన్‌ హాల్‌ బుకింగ్‌ చేసుకుంది. అయితే కర్ణాటకలో కరోనా నిబంధనల ప్రకారం పెళ్లిళ్లకు అవకాశం లేకపోవడంతో ఇక్కడి రిసెప్షన్‌ను కూడా రద్దయిపోయింది. ఇక పూర్తి లాక్‌డౌన్‌ పెడితే అప్పుడు బుకింగ్స్‌ రద్దు చేసుకొందామన్న ఆలోచనతో కొందరు ఉన్నారు. శుభకార్యాలకు సంబంధించిన బుకింగ్స్‌ నెమ్మదిగా రద్దవుతుండడంతో హాల్స్‌ నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. చంపాపేట్‌, కర్మన్‌ఘాట్‌, కూకట్‌పల్లి, కుత్బు ల్లాపూర్‌, ముషీరాబాద్‌, సికింద్రాబాద్‌, ఉప్పల్‌, ఎల్‌బీనగర్‌, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, తదితర ప్రాంతాల్లో అధికారికంగా 1400 వరకు ఫంక్షన్‌ హాళ్లు ఉండగా, అనధికారికంగా మరో 1200 వరకు నడుస్తున్నాయి. వీటితోపాటు వందలాది హోటళ్లలోని బ్లాంకెట్‌ హాళ్లు, గార్డెన్లలో కూడా ఏటా లక్షలాది పెళ్లిళ్లు జరుగుతుంటాయి.

కొత్త బుకింగ్‌లు తగ్గాయి

నాకు మే, జూన్‌కు కలిపి ఇప్పటికే 35 పెళ్లిళ్లు, రిసెప్షన్లకు బుకింగ్‌లు వచ్చాయి. ముహూర్తాలు ఖరారు చేసుకున్నవారంతా కూడా కొద్ది మందితోనైనా వేడుక జరిపేందుకు సిద్ధంగా ఉన్నారు. నిరుడు కరోనాతో లాక్‌డౌన్‌, విమానాల రద్దుతో పెళ్లిళ్లు ఆగిపోయాయి. ఇప్పటివరకు అలాంటి ఇబ్బంది లేదు. కరోనాతో కొత్త బుకింగ్‌లు రావడం లేదు.

కొప్పుల ప్రేమ్‌, కేబీఆర్‌ ఫంక్షన్‌హాల్‌, మన్సూరాబాద్‌

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy
Top