Wednesday, 27 Jan, 7.24 pm ఆంధ్రజ్యోతి

అమరావతి
'టాటా' ఆధ్వర్యంలో 'రాగావధానం'

మెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రం ట్రయాంగిల్ ప్రాంతంలో జనవరి 23న(శనివారం) 'రాగావధానం' అనే విలక్షణమైన, వినూత్నమైన కార్యక్రమాన్ని స్థానిక తెలుగు సంస్థ ట్రయాంగిల్ ఏరియా తెలుగు అసోసియేషన్ (టాటా) 2021' దిగ్విజయంగా నిర్వహించింది. టాటా అధ్యక్షులు అల్లు రామకృష్ణ నేతృత్వంలో గాన విద్యా ప్రవీణ, గురు గరికపాటి వెంకట ప్రభాకర్ అవధానిగా.. ఈ సంగీత ప్రధానమైన కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగించారు. తెలుగు భాషకే తలమానికమై, సాహిత్యపరంగా ఎంతో ప్రాచుర్యం పొందిన 'అష్టావధానం' మాదిరిగానే.. ఈ 'రాగావధానాన్ని' కూడా కేవలం సంగీత పరమైన వివిధ అంశాలతో టాటా 2021 కార్యవర్గ సభ్యులు ఈ ఏడాది సంక్రాంతి పండుగకు మొదటి కానుకగా నిర్విహించడం విశేషం. ప్రముఖ నటులు, రచయిత, దర్శకులు తనికెళ్ళ భరణి.. ప్రముఖ రచయిత, వక్త, ఓలేటి పార్వతీశం.. సిలికాన్ ఆంధ్రా యూనివర్శిటీ అధ్యక్షులు కూచిభొట్ల ఆనంద్ విశిష్ట అతిథులుగా వచ్చేశారు. అట్లాంటా వాస్తవ్యులు, లఘుచలన చత్ర నిర్మాత ఫణి డొక్కా ఈ అవధానానికి సమన్వయ కర్తగా వ్యవహరించారు.

ఈ "రాగావధానం" నడిపించిన అవధాని, శాస్త్రీయ సంగీతములో నిష్ణాతులు, ఎస్ఎస్ మ్యూజిక్ ఎకాడమీ అధినేత ప్రభాకర్ తన అసామాన్యమైన ధారణతో, కేవలం సంగీత ప్రధానంగా ఈ క్రింది అంశములను ఈ అవధాన ప్రక్రియలో భాగంగా చేర్చడం జరిగింది.

1) రాగ మార్పు - రాగమాలిక - శాస్త్రీయ సంగీతం

2) రాగ మార్పు - రాగ యుగళము- సినిమా సంగీతం

3) భావ మార్పు - సినిమా/ శాస్త్రీయ సంగీతం

5) గతి బేధం - లలిత సంగీతం /జానపద సంగీతం

6) స్వరాక్షరం - పద్యము, శ్లోకము

7) నిషిద్ధ స్వరం - లలిత సంగీతం /జానపద సంగీతం

8) అప్రస్తుత ప్రసంగం

గురు ప్రభాకర్ శిష్యురాలు, టెక్సాస్ వాస్త్యవ్యురాలైన 'ఆముక్త నార్ల' ప్రార్థన గీతంతో స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ సంగీత ప్రధానమైన "రాగావధానము" కార్యక్రమానికి అష్టావధానములో వలెనే..

1) సుపర్ణ చాగంటి

2) శృతి గరికపాటి

3) భాస్కర్ కొంపెల్ల

4) ప్రసాద్ కొమ్మరాజు

5) మధు స్రవంతి గరికపాటి

6) సూర్యనారయణ ఉలిమిరి

7) కాంతి యెడవల్లి

8) సుబ్బారావు మేడూరి

ఇలా 8 మంది పృచ్చకులుగా వ్యవహరించి శాస్త్రీయ సంగీతపు పట్టుగొమ్మలైన కర్నాటక, హిందుస్తానీ రాగాలను పైన తెలిపిన అంశాలలో పొందుపరిచి, అర్థవంతమైన, నిగూఢమైన, గమ్మత్తైన ప్రశ్నలుగా సంధించారు. వీటికి గురు ప్రభాకర్ తన అసామాన్యమైన సంగీత జ్ఞానంతో, ధారణా ప్రతిభతో, సమయస్పూర్తితో, వివరణ పూర్వకముగా సమస్యలను శ్రావ్యముగా పాడి, పూరించి, అందరి మన్ననలనూ పొందారు. సామాజిక మాధ్యమాలైన జూం, యూట్యూబ్, మన టీవీల ద్వారా ప్రత్యక్ష ప్రసారమైన ఈ కార్యక్రమం అత్యంత ఆసక్తికరంగా కొనసాగింది. 1500కు పైగా మంది ఈ కార్యక్రమాన్ని వీక్షించగా సుమారు మూడున్నర గంటలపాటు సంగీత ప్రియులను ఆద్యంతమూ రంజింప చేసింది. టాటా సాహితీ వేదిక తరఫున రమేష్ తుమ్మలపల్లి వందన సమర్పణ చేయగా.. టాటా 2021 కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన ఈ "రాగావధానం".. స్థానిక ట్రయాంగిల్ వాసులకు ఈ ఏడాది ఒక మరపురాని తీపి గుర్తుగా ఉంటుందని చెప్పవచ్చు.

సమీక్ష: ప్రసాద్ కొమ్మరాజు

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy
Top