ఇంటర్నెట్ డెస్క్: యూపీఐ సేవలు చెల్లింపుల ప్రక్రియను సులభతరం చేశాయి. మొబైల్ నంబర్, యూపీఐ ఐడీ, క్యూఆర్ కోడ్ ఉపయోగించి సెకన్లలో ఎవరికైనా డబ్బులు పంపొచ్చు.
అయితే పొరపాటున తప్పుడు నంబర్‌కు బదిలీ చేస్తే ఏం చేయాలి? వాటిని తిరిగి ఎలా పొందడం? తెలుసుకుందాం రండి!
కొందరు పంపాల్సిన వ్యక్తికి కాకుండా మరో వ్యక్తికి యూపీఐ ద్వారా డబ్బులు పంపుతుంటారు. తీరా విషయం తెలుసుకున్నాక తమ డబ్బు పోయిందని ఆందోళన చెందుతారు. అయితే ఇలాంటి సందర్భాల్లో బ్యాంకును సంప్రదించాలి. తప్పుడు యూపీఐ లావాదేవీ గురించి తెలియజేయాలి. బ్యాంకులకు కస్టమర్ కేర్ లేదా బ్రాంచ్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. యూపీఐ లావాదేవీకి సంబంధించిన తేదీ, ఐడీ, మొత్తం వంటి వివరాలను బ్యాంకుకు వెల్లడించాలి. అలాగే యూపీఐ యాప్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు.
డబ్బులు తిరిగి వస్తాయా?
ఫిర్యాదు తరువాత బ్యాంకు వాపసు ప్రక్రియను మొదలుపెడుతుంది. అయితే ఫిర్యాదు ఆలస్యంగా చేస్తే డబ్బులు పొందే అవకాశాలు తగ్గిపోతాయి. అందుకే వీలైనంత త్వరగా ఫిర్యాదు చేయాలి.అయితే ఈ ప్రక్రియలో బ్యాంకు నుంచి ఫిర్యాదు సంఖ్య లేదా రిఫరెన్స్ నంబర్ తప్పకుండా తీసుకోవాలి.
ఇలా చేయకూడదు
డబ్బులు పొరపాటున పంపిన వ్యక్తికి పదేపదే ఫోన్ చేయకూడదు.
అలాగే అతణ్ని బెదిరించడానికి ప్రయత్నించకూడదు.
మీ సమస్యను బ్యాంకు ద్వారానే పరిష్కరించుకోవాలి. ఫిర్యాదు విషయంలో జాప్యం చేయకూడదు.
ఈ వార్తలూ చదవండి

