అమరావతి, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లులను సవాలు చేస్తూ ఎమ్మెల్సీలు పరుచూరి అశోక్‌బాబు, అమ్మినేని శ్రీరామకృష్ణ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై వారిద్దరూ సోమవారం వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. భారత రాజ్యాంగం, ఏపీ శాసనసభ, శాసనమండలి నిబంధనలకు విరుద్ధంగా రూపొందిన ఆ బిల్లులు చెల్లుబాటు కావన్నారు. ఆ రెండు బిల్లుల్ని శాసనమండలి చైర్మన్ సెలక్ట్ కమిటీకి సిఫారసు చేశారని, కానీ శాసనసభ కార్యదర్శి వాటిని తనవద్దే తొక్కిపెట్టారని ఆ పిటిషన్లలో పేర్కొన్నారు. ప్రభుత్వం ఆ బిల్లులను రెండోసారి అసెంబ్లీలో ప్రవేశపెట్టి, నెల రోజుల అనంతరం గవర్నర్ ఆమోదానికి పంపించిందన్నారు.
అవి ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టానికి విరుద్ధమన్నారు. రాష్ట్రంలో రెండు సభలు ఉన్నప్పుడు శాసనమండలి అభిప్రాయాన్ని ఖాతరు చేయకుండా చేసే చట్టాలు చెల్లుబాటు కావని వివరించారు.
పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ చట్టం రద్దుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గత జూలై 31న జారీ చేసిన గజెట్‌నోటిఫికేషన్లు రాజ్యాంగ విరుద్ధమని, వాటి అమలును నిలుపుదల చేయాలని అభ్యర్థించారు. అదేవిధంగా పాలనా రాజధానిని తరలించరాదని, అమరావతి నుంచి ఏ కార్యాలయాన్నీ ఏ ప్రాంతానికీ తరలించరాదని, ఆ మేరకు ప్రతివాదులకు ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. ప్రతివాదులుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర శాసనసభ కార్యదర్శి, గవర్నర్ ప్రత్యేక ప్రధానకార్యదర్శి, రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శి, మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి, కేంద్ర హోంశాఖ కార్యదర్శి, కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి, ఏఎంఆర్‌డీఏ కమిషనర్ తదితరులను పేర్కొన్నారు.
