తెలంగాణ తాజావార్తలు
తెలంగాణ గ్రామాల్లో ప్రతి ఇంటికీ నల్లా
ట్విటర్‌లో వెల్లడించిన కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్
ఇది కేసీఆర్, కేటీఆర్ ఘనత: మంత్రి ఎర్రబెల్లి
హైదరాబాద్/న్యూఢిల్లీ, జనవరి 21(ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాల్లోని గృహాలకు నల్లా కనెక్షన్లు నూరు శాతం ఇచ్చిన రెండో రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. రాష్ట్రంలో 54,06,070 గృహాలకు నల్లా ద్వారా నీరందుతున్నట్లు పేర్కొన్నారు. కాగా, మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ నల్లా ద్వారా నీరందుతోందని.. ఇది సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ల ఘనతని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మిషన్ భగీరథ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు బాటిల్ ద్వారా భగీరథ నీటిని త్వరలోనే అందిస్తామని తెలిపారు. కాగా, ఐకేపీ వీఓఏ ఉద్యోగుల సంఘం క్యాలెండర్‌ను మంత్రి ఎర్రబెల్లి ఆవిష్కరించారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షుడు మహేశ్ వినతిపత్రం సమర్పించారు.