Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తెలంగాణ రైజింగ్‌తో త్రీ ట్రిలియన్ ఎకానమీ లక్ష్యం: శ్రీధర్‌బాబు

తెలంగాణ రైజింగ్‌తో త్రీ ట్రిలియన్ ఎకానమీ లక్ష్యం: శ్రీధర్‌బాబు

సంగారెడ్డి, మే 15 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రైజింగ్‌తో త్రీ ట్రిలియన్ ఎకానమీ కోసం తాము పనిచేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు (Minister Sridhar Babu) వ్యాఖ్యానించారు.

జహీరాబాద్ లాంటి ప్రాంతంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు కోసం తాము కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఈరోజు (శుక్రవారం) కొండాపూర్ మండలం తొగర్‌పల్లిలో మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహలు పర్యటించారు. రూ.650 కోట్ల పెట్టుబడితో 44 ఎకరాల్లో భారీ ఫుడ్ ఇండస్ట్రీకి మంత్రులు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో TGIIC చైర్‌పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పాల్గొన్నారు. 1500 మంది స్థానిక మహిళలకు ఉపాధి కల్పనే లక్ష్యంగా కేజేఎస్ యూనిట్-IIకి శ్రీకారం చుట్టారు.

1500 మంది మహిళలకు ఉపాధి..

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడారు. తొగర్‌పల్లిలో ఇంత పెద్ద పరిశ్రమ రావడానికి TGIIC చైర్‌పర్సన్ నిర్మల జగ్గారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కారణమని చెప్పుకొచ్చారు. 1500 మంది మహిళలకు ఈ పరిశ్రమతో ఉపాధి లభిస్తుందని తెలిపారు. ఈ పరిశ్రమ పూర్తిగా కాలుష్య రహితమని అన్నారు. ఈ ప్రాంత ప్రజలకు ఉపాధి కల్పించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని స్పష్టం చేశారు. రాబోయే కాలంలో అంతర్జాతీయ కారిడార్‌లో ఓ ఇండస్ట్రీ నెలకొల్పుతామని వెల్లడించారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో అంతర్జాతీయ సదస్సులో పాల్గొని పరిశ్రమల కోసం పెట్టుబడులను ఆకర్శిస్తున్నామని చెప్పుకొచ్చారు. స్థానిక యువతకు ఉపాధే లక్ష్యంగా తాము పనిచేస్తున్నామని తెలిపారు. రాబోయే కాలంలో 2047 నాటికి దేశ జాతీయ ఉత్పత్తిలో 10 శాతం ఉత్పత్తి పెంచేలా తాము పనిచేస్తున్నామని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు.

పటాన్‌చెరులో మొదటగా పరిశ్రమలు ఏర్పడ్డాయి: దామోదర రాజనర్సింహ

ఉమ్మడి రాష్ట్రంలోనే మొదట పరిశ్రమలు సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో ఏర్పడ్డాయని మంత్రి దామోదర రాజనర్సింహ వ్యాఖ్యానించారు. మంత్రి శ్రీధర్‌బాబుకి పరిశ్రమల శాఖ తగినవిధంగా సెట్ అవుతుందని తెలిపారు. మెదక్ ప్రజలు చాలా అదృష్టవంతులని చెప్పుకొచ్చారు. వెనుకబడ్డ ప్రాంతాల్లో పరిశ్రమలు వస్తే ఆ ప్రాంత ప్రజలకు ఉపాధి లభిస్తుందని దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు.

సంగారెడ్డి జిల్లాకు కేంద్ర సంస్థలు తీసుకువచ్చాం: జగ్గారెడ్డి

మంత్రి శ్రీధర్ బాబు ఈ పరిశ్రమ ఏర్పాటు కోసం సహకరించారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తెలిపారు. 1500 మంది మహిళలకు ఈ పరిశ్రమతో ఉపాధి లభిస్తుందని అన్నారు. సంగారెడ్డి జిల్లాకు BHEL, BDL, ODF లాంటి కేంద్ర సంస్థలను తీసుకువచ్చామని జగ్గారెడ్డి తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy