హైదరాబాద్: తెలంగాణ సర్కారుపై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా లోటస్ పాండ్‌లో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణలో మహిళ ప్రాతినిధ్యం గురించి షర్మిల మాట్లాడారు. తెలంగాణ సమాజంలో మహిళల ప్రాతినిధ్యం ఎంతో అందరికీ తెలుసన్నారు. తెలంగాణ గడ్డ రాజకీయ చైతన్యానికి అడ్డా అని, ఇక్కడి మహిళలు ఎవరికీ తక్కువ కాదని చెప్పారు. రాణి రుద్రమదేవి చరిత్ర అందరికీ తెలుసన్నారు. ఉద్యమాల్లో మహిళలది కీలక పాత్ర అని, కానీ ప్రస్తుత తెలంగాణ సమాజంలో స్త్రీల ప్రాతినిధ్యం ఎంత అని ప్రశ్నించారు. అసమానతలు గెలిచి సాధించుకున్న రాష్ట్రంలో అసమానతలు ఉన్నాయని షర్మిల ఆరోపించారు.

