Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తెలుగు నవలా రచయితలకు సిరికోన సాహితీ అకాడమీ ఆహ్వానం..

తెలుగు నవలా రచయితలకు సిరికోన సాహితీ అకాడమీ ఆహ్వానం..

ఇంటర్నెట్ డెస్క్: 'సిరికోన సాహితీ అకాడమీ' ఆధ్వర్యంలో జొన్నలగడ్డ రాంభొట్లు-సరోజమ్మ స్మారక 'సిరికోన నవలల పోటీ-2026' నిర్వహించనున్నారు. తెలుగు భాషలో మంచి నవలల రచనను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ పోటీని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ ఏడాది పోటీకి 'మానవ సంబంధాల పట్ల యువతలో అనాసక్తత-మారుతున్న సామాజిక, కుటుంబ విలువలు' అనే ఇతివృత్తాన్ని ఎంపిక చేశారు. ఈ అంశాన్ని ఆధారంగా చేసుకుని ప్రత్యేకంగా రాసిన నవలలు మాత్రమే పోటీకి అర్హత పొందుతాయి. ఉత్తమ నవలకు రూ.40 వేల నగదు పురస్కారం అందించనుండగా.. న్యాయ నిర్ణేతల సూచన మేరకు అర్హత సాధించిన ఇతర నవలలకు కూడా ప్రత్యేక పురస్కారాలు ప్రకటించే అవకాశం ఉంది.

పోటీలో పాల్గొనే రచయితలు తమ నవలను కనీసం 120 పేజీల నుంచి గరిష్ఠంగా 200 పేజీల వరకు.. 12 పాయింట్ల అక్షర పరిమాణంలో రూపొందించాలి. నవలను Word లేదా PDF ఫార్మాట్‌లో subbujvr@gmail.com ఈమెయిల్‌కు పంపాలి. పోటీ రచనలు 2026 డిసెంబర్ 31లోగా చేరాలి. నవల ప్రతి మీద రచయిత లేదా రచయిత్రి పేరు ఉండకూడదు. పూర్తి పేరు, చిరునామా, ఫోన్ నంబర్, ఈమెయిల్ వివరాలను ప్రత్యేకంగా అందించాలి. పోటీ కోసం సమర్పించే రచనలో నిర్వాహకులకు సంబంధించిన వ్యక్తులు లేదా సంస్థల ప్రస్తావన ఉండకూడదని నిర్వాహకులు స్పష్టం చేశారు. ఇతివృత్తం, పాత్ర చిత్రణ, నవలాశిల్పం వంటి అంశాల్లో ఉన్నతమైన మౌలిక ప్రమాణాలు కలిగిన రచనలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.

గతంలో పత్రికలు లేదా సామాజిక మాధ్యమాల్లో ప్రచురితమైన రచనలు పోటీకి అంగీకరించరు. నవల పూర్తిగా స్వతంత్ర రచన అయి ఉండటంతో పాటు.. గత సిరికోన నవలల పోటీల్లో 'ఉత్తమ' లేదా 'విశిష్ట' బహుమతులు పొందిన రచయితలు ఈసారి పోటీలో పాల్గొనడానికి అర్హులు కారు. పోటీ ఫలితాలు వెలువడే వరకూ అదే నవలను ఇతర పోటీలకు పంపకూడదు. పురస్కారం పొందిన రచనలను ప్రచురించే సందర్భంలో జొన్నలగడ్డ రాంభొట్లు-సరోజమ్మల చిత్రంతో పాటు బహుమతి వివరాలను పుస్తకం ముఖపత్రం వెనుక భాగంలో తప్పనిసరిగా ప్రకటించాలి. పోటీకి సంబంధించిన పూర్తి నియమాలను పాటిస్తూ, నవలతో పాటు ప్రత్యేక హామీ పత్రాన్ని కూడా సమర్పించాల్సి ఉంటుంది. మరిన్ని వివరాల కోసం జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, (+1) 214 -621-1790 (US), Email: subbujvr@gmail.com జొన్నవిత్తుల శ్రీరామచంద్ర మూర్తి, (+91) 99488 96984 (భారత్) నీలకంఠం నరసరాజు, (+91) 99596 05656 (భారత్) నంబర్లలో సంప్రదించవచ్చు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy