విజయవాడ, మే 24: తెలుగు రాష్ట్రాల్లో చలన చిత్ర పరిశ్రమ అభివృద్ది చెందాలని ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆకాంక్షించారు. ఆదివారం విజయవాడలో ఏపీ చలనచిత్ర టెలివిజన్, నాటక అభివృద్ది సంస్థ కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ది కోసం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారం అందిస్తున్నారని పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎఫ్‌డీసీ) ఏర్పాటు అయిందని గుర్తు చేశారు. రాష్ట్ర విభజన అనంతరం 2017లో ఆంధ్రప్రదేశ్‌లో అంబికా కృష్ణ ఆధ్వర్యంలో ఎఫ్‌డీసీ ఏర్పాటు చేశారన్నారు.
రాజధాని లేని ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నా.. అనేక అభివృద్ది కార్యక్రమాలు చేపట్టారని ఆయన వివరించారు. ఇక్కడ చలనచిత్ర పరిశ్రమను కూడా అభివృద్ది చేసేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టారని వివరించారు. ప్రస్తుతం ఎఫ్‌డీసీ చైర్మన్‌గా భరత్ భూషణ్‌తో కొత్త కమిటీని ఏర్పాటు చేశారని చెప్పారు. రెండు రాష్ట్రాల్లో ఎఫ్‌డీసీలు ఉన్నా.. అందరూ కలిసే పని చేస్తారని తెలిపారు. నాడు, నేడు విజయవాడ తెలుగు సినీ పరిశ్రమకు రాజధానిగా ఉంటుందన్నారు. ఏ చిత్రానికైనా 70 శాతం కలెక్షన్లు ఏపీ నుంచి వసూళ్లు అవుతాయని పేర్కొన్నారు. రాజమండ్రి, అరకు, విశాఖపట్నం తదితర ప్రాంతాలలో అనేక సినిమాలు చిత్రీకరణ జరుపుకుంటున్నాయని తెలిపారు.
ప్రతి ప్రాంతంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా షూటింగ్‌లు జరిగేలా అనుమతులు ఇస్తున్నారని వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో సినిమా షూటింగ్‌కు బ్రహ్మాండమైన లొకేషన్లు ఉన్నాయని.. వాటిని సద్వినియోగం చేసుకోవాలని చిత్ర పరిశ్రమలోని దర్శక, నిర్మాతలకు ఆయన సూచించారు. ఇక్కడ కృష్ణానది, దుర్గమ్మ గుడి, అరకు వ్యాలీ, అడవులు, జలపాతాలు ఇలా చాలా.. ఈ రాష్ట్రంలో ఉన్నాయని తెలిపారు. గ్రామీణ నేపథ్యంలో సహజత్వం ఉట్టిపడేలా పలు ప్రాంతాలు.. షూటింగ్‌లకు అనుకూలంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఆయా ప్రాంతాలలో మౌలిక సదుపాయల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు.
ఒక సినిమా షూటింగ్‌కు అవసరమైన అన్ని అనుమతులు సింగిల్ విండో విధానంలో ఇస్తామని చెప్పారు. నందమూరి తారక రామారావు జన్మించిన కృష్ణా జిల్లా నుంచి ఈ కార్యచరణ ప్రకటించడం ఆనందంగా ఉందన్నారు. ఎఫ్‌డీసీని పూర్తిగా యాక్టీవ్ చేసి, సినిమా, నాటక, టీవీ రంగానికి పెద్ద పీట వేసేలా కమిటీ వేయడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. సభ్యులంతా సమన్వయంతో పని చేస్తూ.. వారి అనుభవంతో అభివృద్దిలో భాగస్వామ్యం కావాలన్నారు. ఎక్కడ షూటింగ్ జరిగినా.. పూర్తిగా సహకారం అందించాలని ప్రజలను ఆయన కోరారు. సినిమా ఎలా ఉందనే పరిస్థితి నుంచి సినిమాను బ్రతికించాలనే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
సాధ్యమైనన్ని ఎక్కువ సినిమాలు, మంచి సినిమాలు చేయాలన్నారు. తన వరకు సందేశాత్మకంగా ఉండే చిత్రాలకు ప్రాధాన్యత ఇస్తున్నానని చెప్పారు. టెక్నాలజీ లేని సమయంలోనే త్వరగా సినిమా షూటింగ్ మూగిసేదని తెలిపారు. నేడు టెక్నాలజీ పెరిగిన తర్వాత సినిమా షూటింగ్ చాలా ఆలస్యం అవుతున్నాయని పేర్కొన్నారు. ధియేటర్లలో సినిమాలు లేక.. ఎగ్జిబిటర్లు పరిస్థితి చూసి జాలి కలుగుతుందన్నారు. మంచి కార్యాచరణతో చలన చిత్ర పరిశ్రమను అన్ని విధాలా కాపాడుకుంటామన్నారు.
తెలంగాణా ప్రభుత్వం కూడా సినీ పరిశ్రమకు అన్ని విధాలా సహకారం అందించాలని కోరుతున్నామని తెలిపారు. హైదరాబాద్ ఇప్పటికే సినీ పరిశ్రమకు కేరాఫ్ అడ్రస్‌గా మారిందని.. ఏపీలో కూడా తెలుగు సినిమా షూటింగ్‌లు జరిగేలా ప్రోత్సహిస్తామన్నారు. నంది అవార్డులు, నంది నాటకోత్సవాలు త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. తెలుగు సినిమా రంగాన్ని ముందుకు తీసుకువెళ్లేలా అందరూ కలిసి పని చేయాలని తెలుగు చిత్ర పరిశ్రమకు నందమూరి బాలకృష్ణ పిలుపునిచ్చారు.
బైండోవర్ ఉల్లంఘించిన నిందితుడి అరెస్ట్.. జైలుకు తరలింపు: డీఎస్పీ
పార్టీ బలోపేతం కోసం అందరూ కలిసి పని చేయాలి: ఎంపీ మల్లు రవి
For More AP News And Telugu News

