Dailyhunt
థాయ్ మసాజ్ ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా?

థాయ్ మసాజ్ ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా?

ఇంటర్నెట్ డెస్క్: థాయ్ మసాజ్(Thai Massage) ప్రపంచ వ్యాప్తంగా చాలా ప్రసిద్ధి చెందిన చికిత్సా విధానం. ఇది శతాబ్దాలుగా కొనసాగుతున్న సంప్రదాయ పద్ధతి.

థాయిలాండ్‌కు వెళ్లిన చాలామంది తప్పక ఈ మసాజ్ చేయించుకుంటారు. ఎందుకంటే థాయ్ మసాజ్ అనేది కేవలం విశ్రాంతి కోసం మాత్రమే కాదు.. శరీరం - మనస్సు రెండింటికీ మేలు చేసే విధానం.

థాయ్ మసాజ్ ప్రత్యేకత..

థాయ్ మసాజ్ ఇతర మసాజ్‌లకు భిన్నంగా ఉంటుంది. ఇందులో నూనె ఎక్కువగా ఉపయోగించరు. ఇది యోగా లాంటి సాగదీతలతో చేసే చికిత్స. థాయ్ మసాజ్ అనేది నేలపై పరుపు వేసుకుని, వదులుగా ఉండే బట్టలతో చేసే ఒక సాంప్రదాయ యోగా మసాజ్. ఇందులో నిపుణులు చేతులు, మోచేతులు, మోకాళ్లు, కాళ్లతో శరీరంపై ఒత్తిడి(Acupressure) కలిగిస్తూ, యోగా తరహాలో శరీరాన్ని సాగదీస్తారు(Stretching). ఇది శరీర శక్తి ప్రవాహాన్ని(Sen Lines) మెరుగుపరుస్తుంది.

థాయ్ మసాజ్ వల్ల ఉపయోగాలు

  • కండరాల నొప్పులు తగ్గుతాయి

  • మెడ, భుజాలు, వెన్ను నొప్పులకు ఉపశమనం

  • శరీరంలోని ఒత్తిడి తగ్గుతుంది

  • రక్త ప్రసరణ మెరుగుపడుతుంది

  • మానసిక ప్రశాంతత లభిస్తుంది

  • మంచి నిద్ర వస్తుంది

శరీరంలో శక్తి సరిగా ప్రవహించకపోతే అలసట, నొప్పులు వంటివి రావడం సహజం. థాయ్ మసాజ్ ఈ శక్తి ప్రవాహాన్ని సరిచేస్తుందని నిపుణులు అంటున్నారు. ఇది సెరోటోనిన్, డోపమైన్ వంటి హ్యాపీ హార్మోన్లను పెంచడంలో కూడా సాయపడుతుంది. అయితే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉన్నవారు డాక్టర్‌ను సంప్రదించిన తర్వాతే ఈ మసాజ్ చేయించుకోవాలి.

థాయ్ మసాజ్ రకాలు..

థాయ్ మసాజ్‌లో పలు రకాలు ఉన్నాయి. సంప్రదాయ పద్ధతిలో శరీరాన్ని పూర్తిగా సాగదీసే మసాజ్, నూనెతో చేసే ఆయిల్ థాయ్ మసాజ్, మూలికలతో చేసే హెర్బల్ థాయ్ మసాజ్, అలాగే, ఫుట్ రిఫ్లెక్సాలజీ వంటి రకాలుంటాయి.

థాయ్ మసాజ్ బ్యాంకాక్, పట్టాయా వంటి ప్రాంతాల్లో విస్తృతంగా అందుబాటులో ఉంటుంది. థాయిలాండ్‌లో ఉపయోగించే కరెన్సీని భట్ అంటారు. భట్ విలువ భారత రూపాయితో పోలిస్తే ఎక్కువగా ఉంటుంది. అందుకే అక్కడ థాయ్ మసాజ్ ధర స్థానికులకు గంటకు సుమారు 260 భట్స్‌(భారత కరెన్సీలో సుమారు రూ.750 నుంచి రూ.800 వరకు) ఉండగా.. విదేశీయులకు 400 నుంచి 500 భట్స్(సుమారుగా రూ.1100 - రూ.1500) వరకు వసూలు చేస్తారు.

Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించలేదు.

తిన్న వెంటనే నీళ్లు తాగితే ఏమవుతుంది?

జామపండును తొక్కతో తినాలా? లేక తీసేసి తినాలా?

For More Latest News

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy