Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
థరూర్‌కు Vs నేపాల్‌ 'శశి థరూర్‌'.. 'గ్రాండ్‌ లార్సెనీ' నుంచి 'ఎపికారికసీ' వరకు

థరూర్‌కు Vs నేపాల్‌ 'శశి థరూర్‌'.. 'గ్రాండ్‌ లార్సెనీ' నుంచి 'ఎపికారికసీ' వరకు

ఇంటర్నెట్ డెస్క్: శశిథరూర్.. చాలా మంది ఆయన్ను మిస్టర్ ఇంగ్లీష్, మిస్టర్ డిఫికల్ట్ వర్డ్స్ అని పిలుస్తుంటారు. క్రికెట్‌ అంటే అమితంగా ఇష్టపడే ఆయన..

ఆంగ్ల భాషపై మంచి పట్టుసాధించి, పలు వేదికలపై ప్రేక్షకుల మన్ననలెన్నో పొందారు. అయితే.. నేపాల్‌లో ఆయన్ను సరిపోలిన వ్యక్తి ఒకరు ఆయనకు ఎదురయ్యారు. ఆయనే ఆ దేశ ఆర్థిక మంత్రి, డా.స్వర్ణిమ్ వాగ్లే. ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడటం, భాషలో కఠిన పదాలను సులభంగా వాడటంతో వాగ్లేను చాలా మంది 'నేపాల్ శశి థరూర్‌'గా అభివర్ణిస్తుంటారు. అలాంటి ఇద్దరు వ్యక్తులు.. ఒకే వేదికపై కలిస్తే ఎలా ఉంటుంది? ఖాట్మండూలో అదే జరిగింది. కాంగ్రెస్‌ ఎంపీ శశి థరూర్‌, నేపాల్‌ ఆర్థిక మంత్రి స్వర్ణిమ్‌ వాగ్లే కలిసి ప్రేక్షకులను తమ భాషా విన్యాసాలతో అలరించారు.

ఖాట్మండూలో ఇటీవల జరిగిన 'అన్వీక్ష' సమ్మిట్ వేదికపై 'ఐడియాస్‌ అక్రాస్‌ బోర్డర్స్‌' ఇండియా-నేపాల్‌ డైలాగ్‌లో ఈ ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది. నేపాల్‌ ఆర్థిక వ్యవహారాలు, రాజకీయ పరిణామాలు, యువత ఆకాంక్షలు, భారత్‌-నేపాల్‌ సంబంధాలపై విస్తృత చర్చలు జరిగిన ఈ సదస్సులో థరూర్‌, వాగ్లే మధ్య జరిగిన పదాల పోటీ ప్రత్యేకాకర్షణగా నిలిచింది. తాను థరూర్‌కు అభిమానినని, ఆయన్ను అనుసరించేందుకు ప్రయత్నిస్తున్నానని వాగ్లే చెప్పగా.. థరూర్ చిరునవ్వు నవ్వారు. సంభాషణలో భాగంగా వాగ్లే.. 'గ్రాండ్‌ లార్సెనీ' అనే పదాన్ని ప్రయోగించారు. చట్టపరంగా నిర్ణయించిన పరిమితికి మించి విలువైన ఆస్తిని దొంగిలించేందుకు సూచించే ఈ పదాన్ని వాగ్లే చెప్పగానే.. థరూర్‌ తనదైన శైలిలో స్పందించారు. 'దీనిని ప్రతిపక్ష నాయకుడి కంటే ఆర్థిక మంత్రి ఎక్కువగా ఉపయోగిస్తారు' అని చమత్కరించారు.

అంతటితో ఆగని థరూర్‌.. 'డిఫెనెస్ట్రేట్‌' అనే పదాన్ని ప్రయోగించారు. అంటే ఒక వ్యక్తిని కిటికీలోంచి బయటకు విసిరేయడం అని అర్థం. దీనికి నేపాల్‌ రాజకీయ పరిణామాలను జోడించి ప్రస్తావిస్తూ.. 'మీరు మాజీ ప్రధానిని డిఫెనెస్ట్రేట్‌ చేశారు' అని థరూర్ వ్యాఖ్యానించారు. దీంతో సభంతా ఒక్కసారిగా నవ్వులతో మార్మోగింది. ఇక.. జర్మన్‌ పదమైన 'షాడెన్‌ఫ్రాయిడె'పైనా ఇద్దరి మధ్య ఆసక్తికర చర్చ సాగింది. ఇతరులకు జరిగిన చెడును చూసి కలిగే ఆనందం లేదా సంతృప్తిని సూచించే ఈ పదానికి ఆంగ్లంలో 'ఎపికారికసీ' అనే పదం ఉన్నప్పటికీ, ఆంగ్లేయులే దాన్ని పెద్దగా ఉపయోగించరని థరూర్‌ వివరించారు. భాషపై ప్రేమ, రాజకీయ చర్చ, హాస్య చతురత కలగలిపిన ఈ సంభాషణ ఆ వేదికపై ప్రత్యేకతను చాటుకుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy