ఆంధ్ర ప్రదేశ ముఖ్యాంశాలు
టీడీపీ మున్సిపల్ ఎలక్షన్ మేనిఫెస్టో విడుదల

గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ శుక్రవారం మేనిఫెస్టో విడుదల చేసింది. ఈ మేరకు టీడీపీ జాతీయ కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ 10 అంశాలతో కూడిన మేనిఫెస్టో విడుదల చేశారు. 'పల్లెలు గెలిచాయి.. ఇప్పుడిక మనవంతు' పేరిట మేనిఫెస్టో విడుదలైంది. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, వర్ల రామయ్య, నక్క ఆనందబాబు, స్థానిక నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికల్లో పోటీ చేసి గెలిచినా.. ఓడినా వారిని మగాడని, మొనగాడని అంటారు.. కానీ అన్ని ఏకగ్రీవం చేసుకుని దొడ్డిదారిన గెలిచివారిని జగన్ రెడ్డి అంటారని ఎద్దేవా చేశారు. ఏపీలో పరిస్థితి ఇదని అన్నారు. ఎన్నికలకు వెళ్లెముందు ఏ పార్టీ అయినా మేనిఫెస్టో విడుదల చేసి ప్రజలకు ఎలాంటి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నది చెబుతుందన్నారు. కానీ జగన్ రెడ్డి మాత్రం వైసీపీకి ఓట్లు వేయకపోతే సంక్షేమపథకాలు నిలిపివేస్తామని చెబుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ నేతలు, కార్యకర్తలపై వైసీపీ నేతలు బెదిరింపులు, దౌర్జన్యాలకు పాల్పడ్డారని లోకేష్ ఆరోపించారు.
ఇటీవల జరిగిన నాలుగు విడతల స్థానిక ఎన్నికల్లో 38.89 శాతం పంచాయతీలను తెలుగుదేశం పార్టీ కైవశం చేసుకుందని నారా లోకేష్ అన్నారు. రాష్ట్రంలో వైసీపీ పాలన చూస్తుంటే.. ''పబ్లిసిటీ పీక్..మ్యాటర్ వీక్' అంటూ ఎద్దేవా చేశారు. దీనికి సన్నబియ్యమే ఒక ఉదాహరణగా చెప్పారు. 'ఎన్నికల ముందు సన్నబియ్యం ఇస్తామని చెప్పారు.. అధికారంలోకి వచ్చిన తర్వాత సన్నబియ్యంకాదని.. నాణ్యమైన బియ్యం ఇస్తామన్నారు.. తర్వాత వేల కోట్లు ఖర్చుచేసి వాహనాలు ఏర్పాటు చేశారు. స్పీడుగా గ్రామాలకు పంపారు.. ప్రజలు ఛీ కొట్టారు.. మళ్లీ స్పీడుగా ఆ వాహనాలు తాడేపల్లి ప్యాలస్‌కు వచ్చాయని'' లోకేష్ ఎద్దేవా చేశారు. అందుకే పబ్లిసిటీ పీక్..మ్యాటర్ వీక్ అని అన్నారు. ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను అడిగి.. అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టణ ప్రాంతాల్లో ఎక్కడా అభివృద్ధి జరగలేదని లోకేష్ విమర్శించారు.
related stories
-
ఆంధ్రప్రదేశ్ త్వరలో రాజధానిగా విశాఖ
-
పొట్టి శ్రీరాములు నెల్లూరు చంద్రబాబు,లోకేష్‌లపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి:కిలివేటి
-
ఆంధ్ర ప్రదేశ ముఖ్యాంశాలు సాక్షి పత్రికను బహిష్కరించాలి: హర్షకుమార్