Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
టీజీ టి20 లీగ్‌కు ఖరారైన ఎనిమిది ఫ్రాంఛైజీలు

టీజీ టి20 లీగ్‌కు ఖరారైన ఎనిమిది ఫ్రాంఛైజీలు

స్పోర్ట్స్ డెస్క్: ప్రతిభావంతులను వెలుగులోకి తీసుకురావడం.. గ్రామీణ ప్రాంతాల క్రికెటర్ల సత్తాకు వేదికగా నిలవడమే లక్ష్యంగా ఆరంభంకానున్న తెలంగాణ టీ20 క్రికెట్‌ లీగ్‌ (టీజీ20)లో ఎనిమిది ఫ్రాంఛైజీలు ఖరారయ్యాయి.

తెలంగాణ టి20 లీగ్‌ను హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) ప్రతిష్టాత్మకంగా నిర్వహించనుంది. ఇక బిడ్‌ ద్వారా అధిక మొత్తాలు దాఖలు చేసిన టాప్‌-8 టీమ్‌ యాజమాన్యాలను హెచ్‌సీఏ శనివారం ప్రకటించింది. భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) అనుమతితో తొలి సారి టీజీ టి20 లీగ్‌ను నిర్వహిస్తున్నారు.

వచ్చే నెలలో ఆటగాళ్ల వేలం నిర్వహించనున్నారు. ఈ ప్రక్రియ పూరైన టీజీ20 లీగ్ ప్రారంభం కానుంది. ఉప్పల్‌ స్టేడియం వేదికగా మ్యాచ్‌లు జరుగుతాయి. శనివారం నిర్వహించిన టీజీ20 బిడ్డింగ్‌లో అత్యధికంగా రూ.7 కోట్ల 50 లక్షలకు హైదరాబాద్‌ ఫ్రాంఛైజీను ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సొంతం చేసుకుంది. మొత్తం ఎనిమిది జట్ల కోసం 13 సంస్థలు పోటీపడ్డాయి. రంగారెడ్డి జట్టును బూరుగు ఇన్‌ఫ్రా/ ప్రణవ సంస్థ (రూ.7.20 కోట్లు) సొంతం చేసుకుంది. అలానే వరంగల్‌ జట్టును బెయిన్‌ గ్లోబల్‌ రిసోర్సెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, మెదక్‌ ఫ్రాంఛైజీను బృంద ఇన్‌ఫ్రా ప్రైవేట్‌ లిమిటెడ్‌ దక్కించుకుంది.

నల్గొండ జట్టును కిషోర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ గెలుచుకుంది. కరీంనగర్‌ జట్టును ఈఐపీఎల్‌ గ్రూప్‌ అండ్‌ టిబరుమల్‌ , మహబూబ్‌నగర్‌ టీమ్‌ను వీరభద్ర స్టీల్స్‌, ఖమ్మం జట్టును అనివత గ్రూప్‌ సొంతం చేసుకున్నాయి. ఈ బిడ్డింగ్‌ ప్రక్రియను హైకోర్టు ఏకసభ్య కమిటీ హెడ్‌ జస్టిస్‌ నవీన్‌రావు, హెచ్‌సీఏ అధ్యక్షుడు అమర్‌నాథ్, కార్యదర్శి మన్నె జీవన్‌రెడ్డి, టీజీ20 ఛైర్మన్‌ ఆగమ్‌రావు, లీగ్‌ ఆపరేషన్స్‌ హెడ్‌ భరణి సమక్షంలో నిర్వహించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy