ఇంటర్నెట్ డెస్క్: తన సోదరి టీకొట్టు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న వీడియో వైరల్ కావడంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తాజాగా క్లారిటీ ఇచ్చారు. ఆమె తన కాళ్ల మీద తాను నిలబడే ప్రయత్నం చేస్తోందని, గౌరవప్రదంగా జీవనం సాగిస్తోందని అన్నారు.
టీ కొట్టు నడుపుకోవడమంటే ఆర్థిక కష్టాల్లో ఉన్నట్టే కదా అన్న విలేకరి ప్రశ్నించగా సీఎం యోగి ఈ మేరకు సమాధానం ఇచ్చారు.
తాను యోగినని యూపీ సీఎం చెప్పారు. కాబట్టి, తాను కుటుంబాన్ని కేవలం సంప్రదాయ కోణంలో మాత్రమే చూడనని చెప్పారు. రాష్ట్రంలోని 25 కోట్ల మంది ప్రజలు తన కుటుంబసభ్యులేనని అన్నారు. తన సోదరి ఇతరులపై ఆర్థికంగా ఆధారపడలేదని చెప్పారు. సొంతకాళ్లపై నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. 'నా విశ్వాసం ఏటంటే.. నా సోదరి ఏ పరిస్థితుల్లో ఉన్నా ఇతరుల ముందు చేయి చాచదు. తన కాళ్లమీద తాను నిలబడి స్వావలంబన సాధించే దిశగా ముందడుగు వేస్తుంది. జీవితంలో ఇదే అత్యంత గౌరవప్రదమైన విధానమని నేను భావిస్తాను' అని సీఎం యోగి అన్నారు. ఎవరైనా సరే జీవితంలో చేయిచాచ కుండా సొంతకాళ్లపై నిలబడేందుకు ప్రయత్నించాలని సూచించారు.
ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్‌పై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. రామభక్తులు, సన్యాసుల విషయంలో గతంలో సమాజ్‌వాదీ పార్టీ తీసుకున్న చర్యలకు ముందు క్షమాపణ చెప్పి ఆ తరువాత అయోధ్య రామమందిర సందర్శనకు రావాలని అన్నారు. 1990లో ములాయం సింగ్ ప్రభుత్వ హయాంలో కరసేవకులపై పోలీసు కాల్పుల ఉదంతాన్ని కూడా సీఎం యోగి ఈ సందర్భంగా ప్రస్తావించారు. రామభక్తులకు ఇలాంటి పరిస్థితికి కారణమైన వారు పశ్చాత్యాపం వ్యక్తం చేయాలని అన్నారు. రామ మందిరాన్ని సందర్శించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని అన్నారు. అయితే, గతంలో నగరాన్ని నిర్లక్ష్యం చేసి భక్తుల భావోద్వేగాల్ని అవమానించిన వారు ముందు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ వార్తలనూ చదవండి:

