Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Tirumala: మూడు వాహనాల్లో మురిపించిన మలయప్ప

Tirumala: మూడు వాహనాల్లో మురిపించిన మలయప్ప

తిరుమల, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఆదివారం సాయంత్రం నిర్వహించిన స్వర్ణరథోత్సవం కన్నులపండువగా జరిగింది.ఉత్సవర్లు సాయంత్రం 4 గంటలకు ఆలయం నుంచి ఊరేగింపుగా స్వర్ణకాంతులతో ధగధగ మెరుస్తున్న బంగారు రథంలో ఆశీనులయ్యారు.

సర్వాలంకారభూషితుడైన శ్రీవారు, అమ్మవార్లను స్వర్ణరథంలో భక్తులు దర్శించి ఆనందపరవశులయ్యారు. మంగళవాయిద్యాలు, వేదమంత్రాల నడుమ బంగారు రథం శోభాయమానంగా సాగింది.మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని గోవిందనామస్మరణలతో స్వర్ణరథం మోకులను పట్టుకుని లాగుతూ ముందుకు నడిపించారు. భక్తులు, శ్రీవారిసేవకులు, అప్పుడప్పుడు భద్రతా సిబ్బంది కూడా సహకరించడంతో స్వర్ణరథోత్సవం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం కోదండరాముడిగా హనుమంతవాహనంపై శ్రీవారు దర్శనమిచ్చారు.రాత్రి 7 గంటలకు విశేష అలంకరణలో పట్టాభిషేకానికి వెళ్లే రారాజులా గజవాహనంపై ఊరేగుతూ భక్తులను మలయప్పస్వామి ఆశీర్వదించారు.టీటీడీ ఈవో రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యులు సుచిత్ర ఎల్లా, నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర, ఎస్వీబీసీ చైర్మన్‌ శ్రీధర్‌ వర్మ తదితరులు పాల్గొన్నారు.

కళా వైభవం

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఆదివారం నిర్వహించిన హనుమంత, గజవాహన సేవల్లో భక్తి, సంగీత, నృత్య, సంప్రదాయ కళారూపాలు ఆకట్టుకున్నాయి. ఉదయం హనుమంత వాహనసేవలో దేశంలోని పది రాష్ట్రాలతోపాటు సింగపూర్‌ నుంచి వచ్చిన కళాబృందాలు తమ తమ విశిష్ట సంప్రదాయ కళారూపాలను ప్రదర్శించాయి. విభిన్న ప్రాంతాల కళారూపాలు ఒకే వేదికపైకి రావడంతో భారతీయ సంస్కృతిలోని భిన్నత్వంలో ఏకత్వం ప్రస్ఫుటమైంది. 25 కళాబృందాల ద్వారా 681మంది కళాకారులు తమ కళను ప్రదర్శించారు. ఉత్తమ ప్రతిభ చూపిన నాలుగు కళాబృందాలను టీటీడీ ఈవో రవిచంద్ర శాలువాతో సత్కరించారు. తిరుపతికి చెందిన యోగానంద వాసుకు చెందిన 23 మంది భరతనాట్య బృందం , మణిపూర్‌కు చెందిన 10 మంది సభ్యులున్న డా.సినమ్‌ బసు సింగ్‌.... మైబి జాగో నృత్య బృందం , విశాఖకు చెందిన 29 మంది సభ్యులున్న కె.సునీత జానపద నృత్య బృందం , బెంగళూరుకు చెందిన 30 మంది సభ్యులున్న ఎం.నృత్యోదయ అకాడమీ కృష్ణలీలల బృందం వున్నాయి.

ఎన్‌ఆర్‌ఐల నృత్యాభిషేకం

విదేశాల నుంచి వచ్చి శ్రీవారి సేవకులుగా భక్తులకు సేవలు అందిస్తూ వస్తున్న ఎన్‌ఆర్‌ఐలు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలిసారి కళా ప్రదర్శనలు ఇచ్చి స్వామికి నీరాజనాలు అర్పించారు. ఇప్పటి వరకు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి కళా బృందాలు మలయప్పస్వామి రథం ముందు కళా ప్రదర్శనలు నిర్వహించి తరించారు. ఈ సారి బ్రహ్మోత్సవాల్లో సింగపూర్‌, జర్మనీ దేశాల నుంచి ఎన్‌ఆర్‌ఐలు వచ్చి తమ కళలను ప్రదర్శించి భక్తులను విశేషంగా ఆకట్టుకున్నారు. ఇందుకోసం ఆయా బృందం సభ్యులు నెలల తరబడి శ్రమించి తమ బృందాలకు శిక్షణ ఇచ్చారు. శనివారం గరుడసేవ సమయంలో సింగపూర్‌ నుంచి వచ్చిన బృందం సీతారామ కల్యాణం నృత్యరూపకం ప్రదర్శించారు. మరోవైపు ఆదివారం ఉదయం సైతం వీరు స్వామి వాహనం ముందు తమ ప్రదర్శన చేశారు. వీరితోపాటు ఆదివారం సాయంత్రం జర్మనీ నుంచి వచ్చిన ఎన్‌ఆర్‌ఐ బృందం సభ్యులు ప్రదర్శించిన లక్ష్మీనృసింహ నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారతీయ సంస్కృతి, సంప్రదాయ కళలపై తమకున్న అభిమానం, భక్తి ప్రపత్తులు చాటుకున్నారు. రాత్రి గజవాహనం ముందు జర్మనీ నుంచి వచ్చిన ఎన్‌ఆర్‌ఐలతోపాటు ఏపీ, అసోం, అరుణాచల్‌ ప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన కళాకారులు ప్రదర్శనలు ఇచ్చారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy