Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ట్రంప్‌ను వ్యంగ్యంగా టార్గెట్ చేసిన ఇరాన్ ఎంబసీ.. బాలయ్య వీడియో షేర్ చేస్తూ..

ట్రంప్‌ను వ్యంగ్యంగా టార్గెట్ చేసిన ఇరాన్ ఎంబసీ.. బాలయ్య వీడియో షేర్ చేస్తూ..

హరారే: ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తీవ్ర వ్యాఖ్యలకు ఆ దేశ దౌత్య కార్యాలయం వినూత్న రీతిలో స్పందించింది. జింబాబ్వేలోని ఇరాన్ ఎంబసీ సోషల్ మీడియా వేదికగా ఓ తెలుగు యాక్షన్ సినిమా క్లిప్‌ను షేర్ చేస్తూ అమెరికా అధ్యక్షుడిని వ్యంగ్యంగా టార్గెట్ చేసింది.

నందమూరి బాలకృష్ణ నటించిన 'భగవంత్ కేసరి' సినిమాకి సంబంధించిన 58 సెకన్ల వీడియోను ఇరాన్ ఎంబసీ షేర్ చేసింది. ఈ వీడియోలో భారీ తుపాకులు, రైఫిళ్లు, రక్షణ కవచాలతో హీరో, విలన్ గ్యాంగ్‌ల మధ్య జరిగే ఓ ఫైటింగ్ సన్నివేశం కనిపిస్తోంది.

దీనిని షేర్ చేసిన ఇరాన్ ఎంబసీ.. 'ఇరాన్‌ను ట్రంప్ అంతం చేస్తానంటున్నారు. కానీ ఇరాన్ బలహీనమైన దేశం కాదని ఆయనకు తెలుసు. ఈ విషయం మేము తెలియజేసినప్పటి నుంచి వారు హాలీవుడ్‌కు బదులు బాలీవుడ్ సినిమాలు చూస్తున్నారు' అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇరాన్ ఎంబసీ చేసిన ఈ పోస్టు సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. కాగా, ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో మంగళవారం ట్రంప్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఇరాన్‌ శాంతి ఒప్పందానికి రాకపోతే ఆ దేశాన్ని సర్వనాశనం చేస్తామని, నరకంలోకి నెట్టేస్తామని ఆయన తీవ్రంగా హెచ్చరించారు.

'ప్రస్తుతం ఇరాన్‌ ముందు రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి ఒప్పందానికి వచ్చి దేశాన్ని పునఃనిర్మించుకోవడం, రెండోది అమెరికా నుంచి మరిన్ని దాడులను ఎదుర్కోవడం. ఇరాన్ ఒప్పందానికి రాకపోతే ఆ దేశాన్ని పూర్తిగా నాశనం చేస్తాం. తిరిగి కోలుకునే ఆశ, అవకాశం లేకుండా నరకంలోకి నెట్టివేస్తాం. వాళ్లు ఏం కోరుకుంటున్నారు?' అని ట్రంప్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే జింబాబ్వేలోని ఇరాన్ ఎంబసీ పైవిధంగా స్పందించింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy