Friday, 24 Sep, 2.58 am ఆంధ్రజ్యోతి

తెలంగాణ తాజావార్తలు
ఉద్యోగం పేరిట మోసాలు చేసే ముఠా గుట్టు రట్టు

అక్కన్నపేట,సెప్టెంబరు 23: ఓ పంచాయతీ రాజ్‌ ఉద్యోగి, ట్రాన్స్‌కో ఉద్యోగితో పాటు మరో నలుగురు కలిసి ముఠాగా ఏర్పడ్డారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ పలు ప్రాంతాల్లో బాధితుల వద్ద డబ్బు వసూలు చేసి నకిలీ అపాయింట్‌మెంట్‌ ఆర్డర్లు ఇచ్చి తప్పించుకొని తిరుగుతున్నారు. ఎట్టకేలకు ముఠాలో కీలక సభ్యుడు, పంచాయతీరాజ్‌ ఉద్యోగి ఆరండ్యోర్‌ రాజ్‌కుమార్‌ పోలీసుల చేతికి చిక్కాడు. గురువారం సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులసమాచారం ప్రకారం.. ములుగు జిల్లా పంచాయతీ రాజ్‌ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న ఆరండ్యోర్‌ రాజ్‌కుమార్‌, హైదరాబాద్‌ ట్రాన్స్‌కో కార్యాలయ ఉద్యోగి లకావత్‌ బీమ్‌నాయక్‌, పలు ప్రాంతాలకు చెందిన గుగులోతు సదానందం, దాడి సాయిచంద్‌, విజ్జిగిరి శ్రీనివాస్‌, విశ్రాంత ప్రభుత్వోద్యోగి సారంగం కలిసి ఒక ముఠాగా ఏర్పడ్డారు.

అక్కన్నపేట మండలం గుడాటిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని తెనుగుపల్లి గ్రామానికి చెందిన బైరి శ్రీనివాస్‌ పంచాయతీరాజ్‌ శాఖలో జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగం కోసం రూ.13.60 లక్షలు రాజ్‌కుమార్‌కు పలు దఫాలుగా ఇచ్చాడు. ఆయనతో పాటు హుస్నాబాద్‌, కోహెడ, కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌, వరంగల్‌ జిల్లాలోని 14 మంది నిరుద్యోగుల నుంచి పంచాయతీ రాజ్‌ శాఖలో జూనియర్‌ అసిస్టెంట్‌, ఆఫీసు సబార్డినేట్‌ ఉద్యోగాల కోసం మొత్తం రూ.75 లక్షలను నిందితులు వసూలు చేశారు. వారందరికీ హైదరాబాద్‌లోని పంచాయతీరాజ్‌ ముఖ్య కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించి ఆర్డర్‌ ప్రతులు ఇచ్చారు. వాటితో సంబంధిత పంచాయతీ రాజ్‌ కార్యాలయంలోకి వెళ్లగా అవి నకిలీ ప్రతులని తేలింది. దీంతో బాధితులంతా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుల కోసం గాలింపు చేపట్టారు. గురువారం రాత్రి రాజ్‌కుమార్‌ను అరెస్ట్‌ చేశారు. అతని వద్ద కంప్యూటర్‌, నకిలీ అపాయింట్‌మెంట్‌ ఆర్డర్‌ కాపీలు, రబ్బర్‌స్టాంపులు స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు. మిగతా నిందితులను కూడా త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy
Top