Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఉలిక్కిపడ్డ బెంగళూరు నగరం

ఉలిక్కిపడ్డ బెంగళూరు నగరం

- మరోసారి పేలుళ్లు - రెండు రోజుల్లోనే నలుగురు బలి

బెంగళూరు: నగరవాసులు మరోసారి పేలుళ్లతో ఉలిక్కిపడ్డారు. ప్రమాదాలే అయినప్పుటికీ రెండు రోజుల వ్యవధిలోనే వేర్వేరు చోట్ల పేలుళ్లు జరగడం..

నలుగురు బలికావడం బెంగళూరు వాసులను బెంబేలెత్తిస్తోంది. బెంగళూరులో రెండు రోజుల వ్యవధిలోనే పేలుళ్ళు సంభవించి నలుగురు దుర్మరణం చెందారు. మంగళవారం దేవరచిక్కనహళ్ళిలో అపార్ట్‌మెంట్‌లో పేలుడుతో మంటలు చెలరేగి తల్లి, కుమార్తె సజీవ దహనమైన సంఘటన మరువ కముందే గురువారం చామరాజపేటలోని రాయన సర్కిల్‌, తరగుపేటలో మరో ప్రమాదం జరిగింది. లారీ గోదాములో మధ్యాహ్నం 12 గంటల తర్వాత పేలుడు జరగడంతో ఇరువురు మృతిచెందారు.

సమీపంలోని నివాసాలు దెబ్బతిన్నాయి. మనోహర్‌ (29), అస్లాం పాషా (45) మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. భారీగా పేలుడు శబ్దం రావడంతో సమీప ప్రాంతవాసులు ఉలిక్కిపడ్డారు. ఒక్కసారిగా పరుగులు తీశారు.

టపాసుల బాక్సులు, గోదాములో నిల్వ ఉంచేవారని ఇవే ప్రమాదానికి కారణమై ఉంటారని భావిస్తున్నారు. ఒకటిరెండు బాక్సులు మాత్రమే పేలిపోగా, మిగిలిన టపాసు బాక్సులు యథావిధిగా ఉండడం పలు అనుమానాలకు కారణమవుతోంది. ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్‌ ఇంజన్‌ రావడంతో పెను ప్రమాదం తప్పింది. పేలుడుకు కారణాలను ఆరా తీసేందుకు ఎఫ్‌ఎస్‌ఎల్‌ నిపుణులు డాక్టర్‌ దినేష్‌ రావ్‌ బృందం పరిశీలన జరిపింది.

ప్రమాదాన్ని బట్టి టపాసులు పేలడం ద్వారా జరిగిన ప్రమాదం ఉండకపోవచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు. గోదాము యజమాని గణేష్‌ బాబును అదుపులోకి తీసుకున్న వీవీపురం పోలీసులు విచారణ జరుపుతున్నారు. గోదాముకు అనుబంధంగా పలు నివాసాలున్నాయి. సమీపంలోనే ఉండే ఓ ఇంట్లో అవ్వ, ఇరువురు మనవళ్లు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారని బెంగళూరు దక్షిణ డీసీపీ హరీష్‌ పాండే తెలిపారు. ప్రమాదానికి కారణాలపై పోలీసులు భిన్నమైన కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy