Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఉరవకొండలో వైసీపీ హల్‌చల్‌

ఉరవకొండలో వైసీపీ హల్‌చల్‌

  • అనుమతి లేకున్నా ధర్నాకు మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి యత్నం

  • అడ్డుకుని వాహనం ఎక్కించిన పోలీసులు

  • అడ్డుకున్న వైసీపీ కార్యకర్తలు

  • రోడ్డుకు అడ్డంగా ఆక్సిజన్‌ సిలిండర్లు, బండరాళ్లు

  • ప్రజలపైకీ రాళ్లెత్తడంతో ఉద్రిక్తత

  • విశ్వేశ్వరరెడ్డిని అదుపులోకి తీసుకుని వేరే చోటకు తరలింపు

  • మాజీ ఎంపీ మాధవ్‌ కూడా అరెస్టు

ఉరవకొండ (ఆంధ్రజ్యోతి): అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో వైసీపీ శ్రేణులు హంగామా సృష్టించాయి. రోడ్లకు అడ్డంగా ఆక్సిజన్‌ సిలెండర్లు, బండలు వేసి భయానక వాతావరణం సృష్టించాయి. నియోజకవర్గంలో దౌర్జన్యాలు, భూఆక్రమణలు పెరిగాయంటూ వైసీపీ మాజీ ఎమ్యెల్యే విశ్వేశ్వరరెడ్డి సోమవారం ధర్నాకు పిలుపిచ్చారు. దీనికి పోటీగా టీడీపీ కూడా.. గత వైసీపీ హయాంలో బీసీలపై జరిగిన దాడులను నిరసిస్తూ మహాధర్నాకు సిద్ధమైంది. అయితే శాంతిభద్రతల దృష్ట్యా ఈ రెండు ధర్నాలకూ పోలీసులు అనుమతులు నిరాకరించారు. అయినా విశ్వేశ్వరరెడ్డి ఉరవకొండలోని వైసీపీ కార్యాలయానికి చేరుకున్నారు. ఆ పార్టీ నాయకులు ప్రత్యేక వాహనాల్లో గ్రామాల నుంచి కార్యకర్తలను ఉరవకొండకు తరలించారు. వారంతా రావడంతో.. ధర్నాకు అనుమతి లేదని.. వెళ్లిపోవాలని పోలీసులు స్పష్టంచేశారు. కానీ వారు పట్టించుకోలేదు. పైగా తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నాకు విశ్వేశ్వరరెడ్డి వెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. ఆయన్ను అదుపులోకి తీసుకుని, పోలీసు వాహనంలో ఎక్కించేందుకు యత్నించారు. వైసీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో పోలీసులు, కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. మాజీ ఎమ్మెల్యేను ఎట్టకేలకు వాహనంలో ఎక్కించగా.. వైసీపీ కార్యకర్తలు పేట్రేగిపోయారు. ఆక్సిజన్‌ సిలెండర్లను రోడ్డుకు అడ్డంగా వేశారు. బండలను కూడా అడ్డంగా ఉంచి.. నానాయాగీ చేశారు. రాళ్లను జనంపైకి కూడా ఎత్తడంతో వారు భయాందోళనలకు లోనయ్యారు. పరిస్థితి ఉద్రిక్తంగామారడంతో పోలీసులు విశ్వేశ్వరరెడ్డిని అరెస్టు చేసి వేరే ప్రాంతానికి తరలించారు. దీనిని నిరసిస్తూ వైసీపీ శ్రేణులు గుంతకల్లు-ఉరవకొండ ప్రధాన రహదారిపై ధర్నాకు దిగాయి. పోలీసులువారిని అక్కడి నుంచి పంపించివేయడంతోపరిస్థితి సద్దుమణిగింది. కాగా.. ధర్నాలో పాల్గొనేందుకు ఉరవకొండకు వచ్చి ఓ ఇంట్లో ఉన్న వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను పోలీసులు ముందుగానే అదుపులోకి తీసుకున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy