Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వైభవ్ చేతికి టీమిండియా జెర్సీ.. ఈ అనుభూతిని వర్ణించలేనంటూ..

వైభవ్ చేతికి టీమిండియా జెర్సీ.. ఈ అనుభూతిని వర్ణించలేనంటూ..

ఇంటర్నెట్ డెస్క్: భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ జీవితంలో ఓ మధుర క్షణం చోటు చేసుకుంది. తన అద్భుత ప్రదర్శనలతో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన వైభవ్..

15 ఏళ్ల వయసులోనే జాతీయ జట్టుకు ఎంపికైన సంగతి తెలిసిందే. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల కోసం ప్రకటించిన భారత జట్టులో అతడు స్థానం సంపాదించుకున్నాడు. తాజాగా వైభవ్ టీమిండియా జెర్సీని అందుకున్నాడు. ఈ మేరకు బీసీసీఐ ఎక్స్ వేదికగా వీడియో విడుదల చేసింది. 'యావత్ దేశం ఎదురుచూస్తున్న క్షణం వచ్చేసింది. వైభవ్ సూర్యవంశీ భారత జెర్సీని అందుకున్నాడు' అని బీసీసీఐ ఆ పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చింది.

భారత జట్టు త్రోడౌన్ స్పెషలిస్ట్ రఘు చేతుల మీదుగా వైభవ్ జెర్సీని అందుకున్నాడు. ఈ జెర్సీ ఇచ్చేందుకు రఘు గది వద్దకు రాగానే.. వైభవ్‌ అతడి కాళ్లకు నమస్కరించాడు. జెర్సీని చూసిన వెంటనే అతడి ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. ఈ సందర్భంగా వైభవ్ మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యాడు. 'నేను మొదటిసారి బ్యాట్ పట్టిన రోజు నుంచి భారత జట్టు తరఫున ఆడాలని కల కనేవాడిని. ఆ కల ఇప్పుడు నిజమైంది. ఈ అనుభూతిని మాటల్లో వర్ణించలేను. జెర్సీని చూసిన క్షణం నుంచి నా ఆనందానికి అవధులు లేవు. ఇదంతా ఓ కలలా అనిపిస్తోంది. ఎప్పుడూ ఊహించని విషయం ఒక్కసారిగా నిజమైతే ఎలా స్పందించాలో తెలియదు. ప్రస్తుతం నేను అదే పరిస్థితుల్లో ఉన్నా' అని వైభవ్ వెల్లడించాడు.

జెర్సీ నంబర్- 03..

వైభవ్‌కు భారత జట్టులో జెర్సీ నంబర్-03 కేటాయించారు. గతంలో స్టార్ ప్లేయర్లు హర్భజన్ సింగ్, సురేశ్ రైనా ఈ జెర్సీ నంబర్‌తోనే ఆడటం విశేషం. ఐపీఎల్, అండర్ 19 ప్రపంచ కప్, ట్రై సిరీస్.. ఇలా ఆడిన ప్రతి సిరీస్‌లో సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్న వైభవ్.. ఇప్పుడు భారత జట్టులో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించనున్నాడు. అయితే జట్టులో చోటు దక్కినప్పటికీ.. తుది జట్టులో స్థానం సంపాదించడం వైభవ్‌కు సవాలుతో కూడుకున్న విషయమే. ఓపెనింగ్ స్థానం కోసం అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్ వంటి సీనియర్లతో వైభవ్ పోటీ పడాల్సి ఉంటుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy