Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వరుస మ్యాచ్‌లకు హార్దిక్ దూరం.. స్పందించిన ముంబై ఇండియన్స్

వరుస మ్యాచ్‌లకు హార్దిక్ దూరం.. స్పందించిన ముంబై ఇండియన్స్

ఇంటర్నెట్ డెస్క్: ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య వరుస మ్యాచ్‌లకు దూరమైన సంగతి తెలిసిందే. దీంతో అభిమానుల్లో నెలకొన్న అనుమానాలపై ముంబై ఇండియన్స్ క్లారిటీ ఇచ్చింది.

గురువారం పంజాబ్ కింగ్స్‌పై విజయం సాధించిన అనంతరం స్టార్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ ఈ విషయంపై మాట్లాడాడు. గాయం కారణంగానే గత మూడు మ్యాచ్‌లకు పాండ్య దూరమైనట్లు వెల్లడించాడు. ప్రస్తుతం అతడు ముంబైలో శిక్షణ తీసుకుంటున్నట్లు పేర్కొన్నాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగే తదుపరి మ్యాచ్‌కు పాండ్య తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపాడు.

'చెన్నైతో మ్యాచ్ తర్వాత నుంచి హార్దిక్ జట్టుకు దూరంగా ఉన్నాడు. మే 10న ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ కోసం అతడు రాయ్‌పూర్ వెళ్లాడు. కానీ ఫిట్‌నెస్ సమస్యతో తుది జట్టులో ఆడలేకపోయాడు. పాండ్య వంటి ఆటగాళ్లు లేని లోటు జట్టులో కనిపిస్తోంది. అతడిపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. హార్దిక్ వేరే ఫ్రాంచైజీకి మారబోతున్నాడనే ప్రచారంలో ఎలాంటి నిజం లేదు. పాండ్య ధర్మశాలకు వెళ్లకపోవడం కూడా యాజమాన్యం తీసుకున్న నిర్ణయమే' అని శార్దూల్ ఠాకూర్ వెల్లడించాడు.

వెన్నునొప్పితో బాధపడుతున్న హార్దిక్ పాండ్య.. మే 4న లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఆ తర్వాత జట్టుతో పాటు ప్రయాణించినప్పటికీ.. రాయ్‌పూర్‌ వేదికగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లోనూ ఆడలేదు. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌కు అందుబాటులోకి వస్తాడని అంతా భావించారు. కానీ ఫిట్‌నెస్ సమస్యల వల్లే హాజరుకాలేదు. వ్యక్తిగత కారణాల వల్ల సూర్యకుమార్ యాదవ్ కూడా ఈ మ్యాచ్‌కు దూరమవ్వడంతో.. బుమ్రా కెప్టెన్సీ చేశాడు. అతడి నాయకత్వంలో పంజాబ్‌పై ఎంఐ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే ఈ సీజన్‌లో ముంబై ఇప్పటికే టోర్నీ నుంచి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy