Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విధుల్లో సమయ పాలన పాటించకుంటే చర్యలు

విధుల్లో సమయ పాలన పాటించకుంటే చర్యలు

అధికారులు, ఉద్యోగులకు కలెక్టర్‌ హెచ్చరిక

సచివాలయ ఉద్యోగుల హాజరుపై అసంతృప్తి

పాడేరు, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు సమయ పాలన పాటించాలని, లేకుంటే చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ టి.నిషాంతి హెచ్చరించారు.

ఐటీడీఏ కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. కేవలం జిల్లా అధికారులు మాత్రమే పని చేస్తే ప్రగతి సాధించలేమని, క్షేత్రస్థాయిలో ఉద్యోగులు సైతం పూర్తిస్థాయిలో విధులు నిర్వహిస్తేనే అది సాధ్యమన్నారు. ప్రతి శాఖలోని ఉద్యోగుల హాజరును సంబంధిత శాఖాధిపతి విధిగా పర్యవేక్షించాలన్నారు. సిబ్బంది సమయపాలన పాటించకపోయినా, విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్నా తక్షణమే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది హాజరును నిరంతరం పర్యవేక్షించాలని గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ పీబీకే పరిమిళ, ఏడీఎంహెచ్‌వో కృష్ణమూర్తిని ఆదేశించారు. ఇంజనీరింగ్‌ అధికారులు తమ ప్రగతిపై మండలాల వారీగా నివేదికలు సమర్పించాలన్నారు. ఐవీఆర్‌ఎస్‌లో పనితీరు శాతం తక్కువగా ఉన్న కారణాలపై, ప్రగతి సాధనకు అవసరమైన కార్యాచరణ రూపొందించి కలెక్టరేట్‌కు సమర్పించాలన్నారు. జిల్లా అధికారులుతమ శాఖలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని, ప్రగతి సాధనకు ప్రత్యేక చర్యలు చే పట్టాలని సూచించారు.

సచివాలయ ఉద్యోగుల హాజరుపై అసంతృప్తి

జిల్లాలో సచివాలయ ఉద్యోగుల హాజరు చాలా తక్కువగా ఉందని కలెక్టర్‌ టి.నిషాంతి అసంతృప్తి వ్యక్తం చేశారు. రానున్న వారం రోజులు ప్రతి సచివాలయంలోని ఉద్యోగుల హాజరుపై రోజువారీ నివేదికలను జాయింట్‌ కలెక్టర్‌కు అధికారులు సమర్పించాలన్నారు. సచివాలయ సిబ్బంది హాజరు ఆశించిన స్థాయిలో లేకపోవడంపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ టి.శ్రీపూజ, ఐటీడీఏ ఏపీవో ఎం.వెంకటేశ్వరరావు, జిల్లాలోని వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy