వికారాబాద్, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పరిగి మండలం గడిసింగపూర్ సమీపంలోని చింతల చెరువు వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురిలో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో ఖాజా బీ (65), జహంగీర్ బీ (78) మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం వికారాబాద్ ఆస్పత్రికి తరలించారు.
వివరాల ప్రకారం.. దోమ మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన నలుగురు కారులో ప్రయాణిస్తున్నారు. అబ్దుల్ హై అనే వ్యక్తి తన కారులో మరో ముగ్గురికి లిఫ్ట్ ఇచ్చినట్లు సమాచారం. నలుగురు కలిసి ప్రయాణిస్తుండగా పరిగి మండలం గడిసింగపూర్ సమీపంలోని చింతల చెరువు వద్ద ప్రమాదం జరిగింది. చింతల చెరువు సమీపంలో రోడ్డుపై ఆగి ఉన్న లారీని కారు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న తీవ్రతకు కారులో ఉన్న ప్రయాణికులకు తీవ్రగాయాలు అయ్యాయి.

