Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వీటి పెంపకంతో ఆదాయం గ్యారెంటీ!

వీటి పెంపకంతో ఆదాయం గ్యారెంటీ!

  • పెట్టుబడి తక్కువ

  • ఆసక్తి చూపుతున్న రైతులు

యాడికి(అనంతపురం): పంటల సాగులో నష్టాల పాలవుతున్న రైతులు పందుల పెంపకం పట్ల ఆసక్తి చూపుతున్నారు. తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం పొందుతున్నారు.

పందులు వేగంగా పెరుగుతూ 6 నుంచి 8 నెలల్లోనే విక్రయానికి వస్తున్నాయి. ఎక్కువ పిల్లలను ఉత్పత్తిచేసే సామర్థ్యం కారణంగా పందుల పెంపకం లాభదాయకంగా మారుతోంది. ప్రభుత్వం 50శాతం సబ్సిడీతో రుణాలు ఇస్తుండడం పందుల పెంపకంలో రైతులకు ఎంతో తోడ్పాటు లభిస్తోంది. దీనిని సద్వినియోగం చేసుకుంటూ పందుల ఫాం ఏర్పాటు చేశాడు మండలంలోని తిప్పారెడ్డిపల్లికి చెందిన నాగిరెడ్డి. ఆయన బాటలోనే నిట్టూరు, కమలపాడు గ్రామాలకు చెందిన కొందరు రైతులు పందుల పెంపకం చేపడుతున్నారు.

అందుకోసం గ్రామానికి దూరంగా తోటల్లో షెడ్లు వేశారు. వాటి లోపల తేమలేని శుభ్రమైన కాంక్రీట్‌ నేలతో ఉండేలా ఏర్పాటు చేసుకున్నారు. పెద్ద పందికి 12, పిల్లకు 4 చదరపు అడుగుల స్థలం ఉండేటట్లు గడులు ఏర్పాటు చేశారు. ప్రతి గడిలో పందులు తాగడానికి నీటికోసం ప్రత్యేక ఏర్పాటు, వ్యర్థాలు బయటకు పంపడానికి డ్రైనేజీ సిద్ధం చేశారు. పందులకు రోజులో రెండుసార్లు దాణా అందిస్తున్నారు. ప్రతి మూడు కిలోల దాణాకు పంది కిలో బరువు పెరుగుతుంది. 50కిలోల దాణా ప్యాకెట్‌ను రూ.1,500 ఖర్చుచేసి కొంటున్నారు. పంది ఏడాదికి రెండు ఈతలు ఈనుతోంది. వీటిని సంరక్షించుకుంటూ యూనిట్ల సంఖ్య పెంచుకుంటూ పోవడమే పందుల పెంపకంలో లాభాలు కురిపిస్తోంది.

 ఒక్కో యూనిట్‌ రూ.5 లక్షల వరకు..

ఫాంలో యూనిట్ల ప్రకారం పందులు కొనుగోలు చేస్తారు. యూనిట్‌లో 10 ఆడ, ఒక మగ పంది ఉంటాయి. పందుల రకాలను బట్టి యూనిట్‌ ధర రూ.3.5 లక్షల నుంచి రూ.5 లక్షలు పలుకుతోంది. పందుల ఫాం యజమానులు మగ పందులను మాంసం కోసం ఎక్కువగా విక్రయిస్తుంటారు. ప్రస్తుతం పందిమాంసం బెంగళూరు మార్కెట్‌లో కిలో రూ.160 నుంచి 180 ధర పలుకుతున్నట్లు పెంపకందారులు చెబుతున్నారు.

 లాభదాయకం: నాగిరెడ్డి, తిప్పారెడ్డిపల్లి

పందుల పెంపకం లాభదాయకం. ఫాం ప్రారంభించిన ఏడాది నుంచి లాభాలు ఆర్జించవచ్చు. పందుల యూనిట్‌ ఏర్పాటుకు రూ.15లక్షల వరకు ఖర్చు వస్తుంది. పందులను ఎక్కువగా బెంగళూరు మార్కెట్‌కు తరలించి, విక్రయిస్తాం. ఫాం ఏర్పాటుకు ప్రభుత్వం 50శాతం సబ్సిడీతో రుణం ఇస్తుంది. దీనిని సద్వినియోగం చేసుకుని, లాభాలు గడించవచ్చు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy