Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వ్యాధుల కాలం.. జర పైలం

వ్యాధుల కాలం.. జర పైలం

  • స్కూల్‌కు వెళ్లే పిల్లల ఆరోగ్యంపై తల్లిదండ్రుల శ్రద్ధ తప్పనిసరి

  • మంచి అలవాట్లతోనే సాధ్యమంటున్న వైద్యులు

  • వర్షాకాలంలో జబ్బుల ముప్పు

హైదరాబాద్‌ సిటీ: పిల్లల ఆటాపాటలు..

కిలకిల నవ్వులు.. సరదా సందడిగా ఉంటేనే ఇంటిల్లిపాది సంతోషంగా ఉండేది. ఒక వేళ అనారోగ్యం తలెత్తితే భిన్న పరిస్థితులు చూడాల్సి ఉంటుంది. స్కూల్‌ ఓపెన్‌ .. వర్షాకాల సీజన్‌ కావడం తో వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. పోషకాహారం, సరైన నిద్ర తప్పనిసరి అని వైద్యులు చెబుతున్నారు.

జబ్బులు చుట్టుముట్టే...

వర్షాకాలంలో కలుషితమైన ఆహారం, నీటి వల్ల జీర్ణకోశ సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఇంటి నుంచి తీసుకెళ్లిన శుభ్రమైన తాగునీరే ఉపయోగించాలి. వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. డెంగ్యూ పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇంటి చుట్టుపక్కల నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. పిల్లలు పూర్తి చేతుల దుస్తులు ధరించేలా చూడాలి. తడి వాతావరణానికి ఆకస్మాత్తుగా అస్వస్థత చెందుతుంటారు.

ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ప్రస్తుతం నెలకొన్న వాతావరణంతో ఫ్లూ కేసులు ఎక్కువగా వస్తున్నాయి. ఇందులో ఎక్కువగా దగ్గు, జలుబుకు సంబంధించినవే ఉంటున్నాయి. జ్వరం, తీవ్రమైన ఒళ్లునొప్పులు, తలనొప్పి అసాధారణ అలసట వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలి. అలర్జీలు లేదా ఆస్తమా ఉన్న పిల్లలకు వర్షాకాలంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. తరచూ దగ్గు, తుమ్ములు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదు.

 నిద్ర, అల్పాహారం కీలకం

పాఠశాలలు ప్రారంభమైన మొదటి కొన్ని వారాల్లో అనారోగ్య సమస్యలు కనిపిస్తుంటాయి. పిల్లలు మళ్లీ పాఠశాల జీవనశైలికి అలవాటు పడేలా తల్లిదండ్రులు ముందుగానే చర్యలు తీసుకోవాలి. రోజూ కనీసం 8 నుంచి 10 గంటల నిద్ర పోవాలి. ఉదయం అల్పాహారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మానకూడదు. ఇడ్లీ, దోసె, ఉప్మా, గుడ్లు, పాలు, పండ్లు వంటి పోషకాహారం ఇవ్వాలి. లంచ్‌ బాక్స్‌లోనూ పోషకాహారం ఉండేలా చూసుకోవాలి.

చిన్నారుల ఆరోగ్యంపై అప్రమత్తం

కొత్త తరగతులు, కొత్త ఉపాధ్యాయులు, చదువుల ఒత్తిడి కారణంగా కొంతమంది పిల్లలు ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంది. తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడి వారి భావాలను అర్థం చేసుకోవాలి. సరైన నిద్ర, పోషకాహారం, పరిశుభ్రత, సమయానికి వైద్య సలహా వంటి అంశాలు పిల్లల ఆరోగ్యానికి ఎంతో కీలకం. వర్షంలో తడిసిన దుస్తులు, సాక్స్‌, షూస్‌తో ఎక్కువసేపు ఉండటం వల్ల చర్మ సమస్యలు, ఫంగల ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశం లేకపోలేదు. ఇంటికి వచ్చిన వెంటనే పొడి దుస్తులు మార్చుకునేలా అలవాటు చేయాలి.

  • డాక్టర్‌ విఠల్‌ కుమార్‌ కేసిరెడ్డి, సీనియర్‌ పీడియాట్రిషన్‌, నియోనటాలజీ, కేర్‌ ఆస్పత్రి


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy