Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వ్యవస్థల్ని నాశనం చేయడమే గొడ్డలి పార్టీ అధినేత లక్ష్యం: సీఎం చంద్రబాబు

వ్యవస్థల్ని నాశనం చేయడమే గొడ్డలి పార్టీ అధినేత లక్ష్యం: సీఎం చంద్రబాబు

మరావతి, జులై 29: వ్యవస్థలు నిర్మాణం చేద్దామనే సంకల్పంతో ఎవరైనా రాజకీయాల్లోకి వస్తారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు.

కానీ వ్యవస్థల్ని నాశనం చేయటమే లక్ష్యంగా గొడ్డలి పార్టీ అధినేత ఉన్నారంటూ వైఎస్ జగన్‌పై ఆయన మండిపడ్డారు. బుధవారం వెలగపూడిలోని సచివాలయంలో అందుబాటులో ఉన్న పార్టీ నేతలతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తాజా పరిణామాలపై వారు చర్చించారు. శ్రీకాకుళం జైలులో ఉన్న వైసీపీ నేత, మాజీ మంత్రి సిదిరి అప్పలరాజును గురువారం మాజీ సీఎం వైఎస్ జగన్ పరామర్శించనున్నారనే విషయాన్ని సీఎం దృష్టికి పార్టీ నేతలు తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఆయన స్పందించారు.

వ్యవస్థల నిర్మాణం చేసే వాళ్లు చట్టాలను గౌరవిస్తూ వాటికి లోబడి నడుచుకుంటారని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కానీ గొడ్డలి పార్టీ నేతలకు చట్టాలంటే గౌరవం లేదన్నారు. గొర్రెల కాపరి చనిపోతే సాక్ష్యాలు తారుమారు చేసి ఇంకొకరి జీవితాన్ని బలి చేద్దామనుకున్న వారిని పరామర్శించడం ద్వారా సమాజానికి ఏం మెసేజ్ ఇస్తారంటూ వైసీపీ అధినేత తీరును ఎండగట్టారు. గతంలో కారు చక్రాల కింద వ్యక్తి నలిగిపోతే కనీసం అతడిని ఆసుపత్రికి తీసుకెళ్దామనే మానవత్వం కూడా గొడ్డలి పార్టీ అధినేతకు లేదని అన్నారు. పుట్టిన రోజులకు గొడ్డళ్లతో జంతు బలులు చేసి రాక్షసానందం పొందే హింస ప్రవృత్తి ఆ పార్టీదని ఆయన అభివర్ణించారు.

నేరాల నియంత్రణకు 2014-19 మధ్య రాష్ట్రవ్యాప్తంగా 15 వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. అయితే 2019-24 మధ్య వాటికి మెయింటైనెన్స్ లేకపోవడంతో అవి నిర్వీర్యం అయ్యాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే.. వాటన్నింటినీ పునరుద్ధరించటంతో నేరస్తుల్ని సాక్ష్యాలతో సహా పట్టుకోగలుగుతున్నామని వివరించారు.

రోడ్డు ప్రమాదంలో పాస్టర్ ప్రవీణ్ చనిపోతే.. దానిని హత్యగా చిత్రీకరించి రాజకీయంగా ప్రభుత్వంపై బురద చల్లాలని చూశారని వైసీపీ నేతల తీరును ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. సీసీ టీవీ ఆధారాలు అన్నీ బయటపెట్టే సరికి తోక ముడిచారంటూ ఆ పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నేర ప్రవృత్తి కలిగిన వారు తాము నేరం చేసి.. దానిని ఎదుటి వారిపై రుద్దాలని చూస్తారని వ్యాఖ్యానించారు. ఆలాంటి వారంతా గొడ్డలి పార్టీలోనే ఉన్నారని పేర్కొన్నారు. గంజాయి బ్యాచ్‌లను వెంటేసుకుని నేరస్తుల్ని పరామర్శించటమే పనిగా గొడ్డలి పార్టీ అధినేత వైఎస్ జగన్ చేస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విమర్శించారు.


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy