న్యూఢిల్లీ: కరోనా నేపథ్యలో అమెరికా, కెనడా సరిహద్దు మధ్య విధించిన ఆంక్షలు జూలై 21 వరకు కొనసాగుతాయని కెనడా మంత్రి ఓ ప్రకటనలో తెలిపారు. సరిహద్దు ఆంక్షలను కొనసాగించేందుకు అమెరికా కూడా అంగీకారం తెలిపిందని వెల్లడించారు. ఈ క్రమంలో సరిహద్దు గుండా అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు కొనసాగుతాయని వెల్లడించారు. అయితే అత్యవసర సేవలకు సంబంధించిన వాహనాలకు ఈ ఆంక్షలు వర్తించవని పేర్కొన్నారు. అంతేకాకుండా కొవిడ్ టీకా తీసుకన్న ప్రయాణికులకు కొన్ని మినహాయింపులు ఇవ్వనున్నట్టు తెలిపారు. వాటికి సంబంధించిన విధివిధానాలను త్వరలోనే వెల్లడించనున్నట్టు చెప్పారు. ఇదిలా ఉంటే.. కరోనా విజృంభణ నేపథ్యంలో అమెరికా, కెనడా దేశాల సరిహద్దు వద్ద 2020 మార్చి నుంచి ఆంక్షలు అమలవుతన్న విషయం తెలిసిందే.

