Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
యూరియా ఖర్చు తగ్గించే 'బ్లూ గ్రీన్ ఆల్గే

యూరియా ఖర్చు తగ్గించే 'బ్లూ గ్రీన్ ఆల్గే

ర్యావరణ కాలుష్యం, ఆహార భద్రత, ఇంధన కొరత వంటి అనేక సవాళ్లను నేడు ప్రపంచం ఎదుర్కొంటోంది. జనాభా వేగంగా పెరగడం, వ్యవసాయ భూములు తగ్గిపోవడం, పారిశ్రామికీకరణ, సహజ వనరుల అసమాన వినియోగం వంటి కారణాల వల్ల ఈ సమస్యలు మరింత తీవ్రమవుతున్నాయి.

పెరుగుతున్న జనాభాకు తగిన ఆహారం అందించాలంటే, పర్యావరణానికి హాని కలగకుండా వ్యవసాయ ఉత్పత్తిని పెంచే మార్గాలను అన్వేషించాలి. ఇలాంటి పరిస్థితుల్లో బ్లూ గ్రీన్ ఆల్గే (సైనోబ్యాక్టీరియా) ఎంతో ప్రాధాన్యం సంతరించుకున్నది. ఇవి భూమిపై అత్యంత పురాతనమైన సూక్ష్మజీవులు. సూర్యరశ్మిని ఉపయోగించి ఆహారం తయారు చేసుకోవడంతో పాటు ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయి. భూమిపై ఆక్సిజన్ ఏర్పడటంలో, జీవం అభివృద్ధి చెందడంలో ఇవి కీలకపాత్ర పోషిస్తున్నాయి. ప్రస్తుతం భూమిపై ఉత్పత్తి అయ్యే ఆక్సిజన్‌లో సుమారు 30శాతం వరకు వీటి వాటా ఉందని అంచనా.

బ్లూ గ్రీన్ ఆల్గే వాతావరణంలోని నత్రజనిని మొక్కలు ఉపయోగించగల రూపంలోకి మార్చే సామర్థ్యం కలిగి ఉంటాయి. అందువల్ల వీటిని జీవ ఎరువులుగా (బయో ఫర్టిలైజర్లు) ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా వరి సాగులో రసాయన ఎరువుల అవసరాన్ని తగ్గించి నేల సారాన్ని పెంచడంలో సహాయపడతాయి. ఈ సూక్ష్మజీవులు చెరువులు, నదులు, సముద్రాలు, నేలలు, వేడి నీటి ఊటలు, ఎడారులు, అధిక ఉప్పు ఉన్న ప్రాంతాలు, ధ్రువ ప్రాంతాలు వంటి అత్యంత క్లిష్టమైన వాతావరణాల్లో కూడా జీవిస్తాయి.

నత్రజని మొక్కల పెరుగుదలకు అత్యంత అవసరమైన ప్రధాన పోషకం. ఇది వ్యవసాయ ఉత్పత్తిని ప్రభావితం చేసే ముఖ్యమైన అంశం. వాతావరణంలో నత్రజని సమృద్ధిగా ఉన్నా, చాలా మొక్కలు దానిని నేరుగా ఉపయోగించుకోలేవు. అయితే బ్లూ గ్రీన్ ఆల్గే వాతావరణంలోని నత్రజనిని మొక్కలు గ్రహించగల రూపంలోకి మార్చే నత్రజని స్థిరీకరణ ప్రక్రియను నిర్వహిస్తాయి. పరిశోధనల ప్రకారం, సైనోబ్యాక్టీరియా ద్వారా సంవత్సరానికి హెక్టారుకు సుమారు 20-30 కిలోల వరకు నత్రజని నేలకు అందుతుంది. సైనోబ్యాక్టీరియా ఆధారిత జీవ ఎరువులను తక్కువ ఖర్చుతో పెద్ద ఎత్తున తయారు చేయవచ్చు. వీటి తయారీ వ్యయం రసాయన ఎరువుల ఖర్చులో మూడోవంతు మాత్రమే ఉంటుంది. వరి పొలాల్లో ఈ జీవ ఎరువులను ఉపయోగించడం వల్ల పంట దిగుబడి, ధాన్య నాణ్యత, పోషక విలువలు పెరుగుతాయి. అంతేకాకుండా, రసాయన నత్రజని ఎరువుల అవసరం 25శాతం వరకు తగ్గుతుంది, దీంతో రైతుల సాగు ఖర్చు కూడా తగ్గుతుంది.

బ్లూ గ్రీన్ ఆల్గే నత్రజనిని మాత్రమే కాకుండా నేలలోని భాస్వరాన్ని కూడా మొక్కలకు అందుబాటులోకి తీసుకురావడంలో సహాయపడుతుంది. అలాగే ఇవి విడుదల చేసే జిగురు లాంటి పదార్థం నేల కణాలను బలంగా కలిపి, నేల నిర్మాణాన్ని మెరుగుపరుస్తుంది. ఇవి చనిపోయిన తర్వాత సేంద్రియ పదార్థంగా మారి నేలలో హ్యూమస్‌ను పెంచి నేల సారాన్ని మెరుగుపరుస్తాయి. బ్లూ గ్రీన్ ఆల్గే సారం లేదా కల్చర్‌తో వరి విత్తనాలను నానబెట్టి విత్తడం వల్ల విత్తనాల మొలక శాతం పెరగడంతో పాటు మొక్కల ప్రారంభ పెరుగుదల కూడా మెరుగుపడుతుంది. దీనికి ప్రధాన కారణం వీటిలో సహజసిద్ధంగా ఉండే విటమిన్ B₁₂, అమైనో ఆమ్లాలు, మొక్కల పెరుగుదలను ప్రోత్సహించే ఆక్సిన్లు (IAA), జిబ్బెరెల్లిన్లు వంటి వృద్ధి హార్మోన్లు. అంతేకాకుండా బ్లూ గ్రీన్ ఆల్గే ఇనుము వంటి సూక్ష్మపోషకాల లభ్యతను పెంచే సైడెరోఫోర్లు అనే ప్రత్యేక సమ్మేళనాలను ఉత్పత్తి చేస్తాయి. ఇవి నేలలోని పోషకాలను మొక్కలు సులభంగా గ్రహించేలా చేసి, ఆరోగ్యకరమైన పెరుగుదలకు తోడ్పడతాయి.

వరి కోత అనంతరం మొక్కజొన్న, బంగాళాదుంప, గోధుమ, పప్పుధాన్యాలు, నూనెగింజల వంటి మెట్ట పంటలను సాగు చేస్తారు. ఈ పంటల ఎదుగుదలకు నేల నిర్మాణం బాగుండటం చాలా అవసరం. అయితే వరి నాట్లకు ముందు చేసే బురద తయారీ వల్ల నేల నిర్మాణం దెబ్బతింటుంది. ఈ పరిస్థితిలో వరి పొలాల్లో బ్లూ గ్రీన్ ఆల్గే ప్రవేశపెట్టడం ద్వారా నేల నిర్మాణం త్వరగా పునరుద్ధరించవచ్చు. ఇవి విడుదల చేసే పాలీసాకరైడ్లు, పెప్టైడ్లు, ఇతర జిగురు పదార్థాలు నేల రేణువులను అతికించి స్థిరమైన సమూహాలుగా ఏర్పరుస్తాయి. దీని వల్ల నేలలో నీటి నిల్వ సామర్థ్యం, గాలి ప్రసరణ, నేల స్థిరత్వం మెరుగుపడి, నేల కోత తగ్గుతుంది. అలాగే వరి తర్వాత వేసే మెట్ట పంటల విత్తనాల మొలక, మొక్కల ఎదుగుదల మెరుగుపడుతుంది.

వరి పొలాల్లో బ్లూ గ్రీన్ ఆల్గేను ప్రవేశపెట్టి సమృద్ధిగా పెంచితే కలుపు మొక్కల పెరుగుదలను సహజంగా అణచివేయవచ్చు. బ్లూ గ్రీన్ ఆల్గే నీటి ఉపరితలంపై దట్టంగా వ్యాపించి ఒక పొరలా ఏర్పడటం వల్ల సూర్యరశ్మి నీటి అడుగుభాగానికి చేరకుండా అడ్డుకుంటాయి. ఫలితంగా నీటిలో పెరిగే కాంతి సంశ్లేషణ చేసే కలుపు మొక్కలు తగినంత కాంతిని పొందలేక వాటి పెరుగుదల గణనీయంగా తగ్గుతుంది. దీంతో కలుపు తీయడానికి అయ్యే ఖర్చుతో పాటు రసాయన మందుల అవసరం కూడా తగ్గుతుంది. ఈ విధంగా బ్లూ గ్రీన్ ఆల్గే వరి సాగులో పర్యావరణహితమైన సహజ కలుపు నియంత్రణ సాధనాలుగా ఉపయోగపడతాయి.

సంగర్తి హరీశ్‌

రీసెర్చ్ స్కాలర్, జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం

ఈ వార్తలనూ చదవండి:

ఆకస్మిక వరదలు అందుకే.. నేపాల్ విదేశాంగ శాఖ మంత్రి

నేపాల్ ఎంబసీ కీలక ప్రకటన.. దిగువ ప్రాంతాలకు అలర్ట్..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy